అదాటున కోపం వచ్చింది కాబోలు
అతను అన్నాడు
నీకు నాకు మాటలు లేవని..
మాటలు ఎందుకు
నీ మౌనం వినడం వచ్చాక
గడుసుగా అడిగాను..
ఉక్రోషంగా అన్నాడు
నువ్వు నేను ఎదురు పడడం
ఇక జరిగేది లేదని ...
ఎదురు పడడం ఎందుకు
నిన్ను నా మనసులో కట్టేశాక
మరింత మొండిగా వాదించా
పట్టుదలగా అన్నాడు
నేను ఊరు వదిలి వెళుతున్నా
వెళ్ళవోయ్
నీ వెనువెంట వచ్చే
నీడ నాదేగా
మరింత పంతంగా చెప్పాను...
నువ్వు పోయిన జన్మలో
రాక్షసివై ఉంటావ్
వెనుదిరిగి అక్కసుగా అన్నాడు..
అప్పుడే కాదు... ఇప్పుడు కూడా
రాక్షసినే.. నీ . రా..క్ష .సి...నే
ఇక...బుజ్జగింపు తో
రాక్షసి మాయ మొదలైంది..
ఓయ్
రాజకుమారుడా....
పంతం వీడి రారాదూ..
మళ్లీ నీదైన ఆట మొదలెడదాం