యండమూరి వీరేంద్రనాథ్ ... చిన్న కథలు

యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా 36 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో విజయానికి ఆరోమెట్టుపుస్తకం ఒక మైలురాయి. అందులోని చిన్న కథలే ఇవి. మానవ జీవితంలో ప్రతీ అంశాన్ని టచ్ చేస్తూ వచ్చారు యండమూరి. గీతను మించిన వ్యక్తిత్వ వికాస పుస్తకం లేదు అంటూ, సందేశం ఒకవైపు ఆశక్తి కొలిపే కథలూ - విశ్లేషణలూ బోనస్ గా ఒకవైపు వివరణలు ఇస్తూ, సరికొత్త ప్రయోగాన్ని చేయడం అపూర్వం. అందులోని కథలే యండమూరి చిన్ని కథలూ...

 

పేరు అడుగు చాలు

నేను బ్యాంక్ లో పని చేసేరోజుల్లో ఇన్స్పెక్షన్  నిమిత్తమై వివిధ బ్రాంచిలకు వెళ్ళే వాణ్ని. అటువంటి సమయంలో బ్యాంక్ క్యాష్ బాక్స్ తెరవక ముందే లెక్క ప్రకారం డబ్బు ఉన్నదో లేదో పరిశీలించాలి. అందువల్ల అరగంట ముందుగానే అక్కడికి చేరుకోవాలి. ఒకరోజు అలా వెళ్ళినపుడు ఒక క్లర్క్ అందరికన్నా ముందే వచ్చి కూర్చున్నాడు. నన్ను గుర్తుపట్టి, కూర్చోబెట్టాడు. అప్పటికింకా స్టాఫ్ ఎవరూ రాలేదు. ఒక ముసలావిడ బ్యాంక్ శుభ్రం చేయడానికొచ్చింది. ఆవిణ్ణి పేరు పెట్టి పలకరిస్తూ ఆమె సంతానం గురించి, మనవల చదువు గురించి ఎంక్వయిరీ చేసాడు. ఆమె కూడా తన బాధంతా అతడి దగ్గిర స్వంత బంధువులా వెలిబుచ్చడం గమనించాను. ఆ తర్వాత నేను ఎన్నో బ్యాంకులకి ఇన్స్పెక్షన్ కి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడా కూడా పార్ట్ టైం పనిచేసే వృద్దురాళ్ళయిన స్వీపర్ నీ, స్టాఫ్ ఎవరు ఆప్యాయంగా పలకరించడం నేను గమనించలేదు.


గొప్ప గొప్ప సహాయాలు చెయ్యక్కరలేదు. ఒక చిన్నపలకరింపు అవతలివారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఖరీదైనది, వెలలేనిది 'చిరునవ్వు'. అప్పటినుండి లిఫ్ట్ లో వెళుతున్నప్పుడు కూడా దాన్ని నడిపే కుర్రవాడితో అతడి వివరాలు అడుగుతూ సంభాషించడం నేర్చుకున్నాను. హోటల్ వెయిటర్ పదార్ధాలు టేబుల్ మీద పెట్టినప్పుడు, కిల్లి కొట్టు కుర్రాడు వక్కపొడి పొట్లం ఇచ్చినప్పుడూ 'థాంక్యూ' అనే ఖరీదు లేని రెండక్షరాలు, వారికి తృప్తినీ, నవ్వుతూ మరింత బాగా పని చెయ్యటానికి కావలసిన శక్తిని ఇస్తాయి.


ఒక ప్రముఖ వ్యక్తి తన ఉపన్యాసం పూర్తి చేసి క్రిందికి దిగినపుడు, జనం, అతడిని సాధారణంగా చుట్టుముడతారు. కొన్ని సందర్భాల్లో ఆటోగ్రాపుల కోసం వత్తిడి చేస్తారు. ఒక్కోసారి వంద సంతకాల వరకూ కూడా చెయ్యవలసి ఉంటుంది. గంట ఉపన్యాసం అయ్యాక, అంత తొక్కిసలాటలో ఓపిగ్గా సంతకాలు పెట్టటానికి చాలా సహనం కావాలి. దానికన్నా ముఖ్యంగా శ్రోతలపై ఒక విధమైన ఆప్యాయత పెంచుకోవాలి.
ఆ విధంగా అందరితో నవ్వుతో, అలసట కనపడకుండా మాట్లాడుతూ, భుజాల మీద ప్రోత్సాహకరంగా తడుతూ మాట్లాడే డెబ్బయ్యేళ్ళ యువకుడిని మొన్నే నేను చూసాను.
ఆయన పేరు అబ్దుల్ కలాం.

ఎడాదికెన్ని రోజులు?

తెలివి తేటలు, కామన్ సెన్స్ లేని మనిషి ఏవిధంగా మాటల్లో మోసపోతాడో చూడండి.
ఒక గుమాస్తా యజమాని వద్దకు వచ్చి ఒకరోజు క్యాజువల్ లీవ్ ఇమ్మని అడిగాడు.
"ఒకరోజు శెలవు కావాలా?"
"అవును సార్"
"సంవత్సరానికి 365 రోజులు రోజుకి నువ్వు ఏడుగంటలు పని చేస్తావు. ఆంటే నా దగ్గర 106 రోజులు పనిచేస్తున్నావన్నమాట. 365*7/24 అంతే కదా! అందులో 52 ఆదివారాలు. పది జాతీయ శలవు దినాలూ పొతే యిక మిగిలేదెంత?
"44 రోజులండి"
"రోజుకు గంట లంచ్ టైం , అరగంట టీ టైం లెక్కగడితే ఎన్ని రోజులవుతుంది?"
"43 రోజులండి"
"ఇంకెన్ని రోజులు మిగిలాయి?"
"ఒకరోజు"
"మరి ఆ ఒక్కరోజు నువ్వు శెలవు తీసుకుంటే ఎలా?"
గుమాస్తాకి ఏం మాట్లాడాలో తెలీదు. దీన్నే కామన్ సెన్స్ లేక పోవటం అంటారు.
 

త్యాగం

ఏమి ఆశించకుండా ప్రేమించటం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఒకటి చదవండి.

పదేళ్ళ జాన్, తన చెల్లితో ఆడుకుంటూ ఉండగా, ఆ పాప పడిపోయి, తలకి గాయం తగిలి రక్తం చాలా పోయింది. జాన్ ది  ఆ గ్రూప్ రక్తం "నువ్వు నీ చెల్లికి కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు 'సరే' అన్నాడు. ఆ కుర్రాడు ఎందుకు సంశయిన్చాడో డాక్టరు మరోలా అర్ధం చేసుకున్నాడు. "పెద్దనొప్పిగా ఉండదు. అయిదు నిమిషాల్లో అయిపోతుంది. తరువాత చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. తన శరీరంలోంచి రక్తం నెమ్మదిగా సీసాలోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమక్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గిరకొచ్చి "లే..చాక్లెట్ ఇస్తాను"అన్నాడు .
ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు.
"ఇంకా ఎంత సేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్".

డాక్టర్ విభ్రాంతుడై "రక్తం తీస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నవా!" అని అడిగాడు
"అవును"
డాక్టర్ గొంతు వణికింది."అనుకునే ఇచ్చావా?' అన్నాడు కంపిస్తూ.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!