అబద్దాలకోరునని ఒప్పుకుంటాను

ఎన్ని వేల సార్లు వెనక్కి తిరిగి చూసానో
నీ నీడైనా నా చెంత చేరి సేదతీర్చి పోతుందని
నీవు మాట్లాడక దాచిన మాటలు
నిన్ను తాకిన చిరుగాలి మోసుకు వస్తుందని

ఎన్ని సొగసుల నవ్వులు అద్దుకుంటానో
నువ్వు నా పక్కన ఉన్నావన్న భ్రమతో
ఎన్ని ఊహలకు ప్రాణం పోస్తానో
నా కలలో అరక్షణమైన నువ్వు వస్తావని

నీ దాన్ని కదా...
నిన్ను తప్పు పట్టలేను
తప్పుకు పోలేను
ఎదురుచూపు వదలలేను

అయినా
నేను కాస్తంత గడసరినే కదోయ్
నా మదితడి
నీ కంట పడకుండా
ఎన్ని కథలు అల్లుతానో

అలావోకగా ఎన్నైనా చెబుతాను
నేనొక అబద్దాలకోరునని ఒప్పుకుంటాను
అయితేనేం .....
నీలోని కొంత నేనే కదా..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!