నువ్వు నాకు ఎదురైనప్పుడు
ఆకాశం రంగుల అద్దుకుంటుందని
గాలి మరింత నిశ్శబ్దాన్ని అందిస్తుందని
ఊహకు అందనివి చెప్పనులే కాని
నీవు ఎదురైతే
నువ్వు?? ఇక్కడ?? ఎలా?? అంటూ
విరిచిన ప్రశ్నలు వేస్తానేమో
కాదేమో
వస్తావన్న ఆచూకీ
అందలేదంటూ ఆశ్చర్యపోతానేమో
కానే కాదేమో
అసలు కనిపించగానే
చూడనట్టు తప్పుకుపోతానేమో
అంతేనా... కాదేమో
నిజ నిర్ధారణ ఇష్టం లేదనుకుంటా
ఎదురుపడక తప్పుకుపోయే దారులు
కొత్త కొత్తగా కనిపెడుతున్నానేమో
అన్ని అసంపూర్తిగా
పెనవేసుకున్న ఊగిసలాట ఊహలే
ఓయ్
కలతల కలలోనైనా
కాస్త అడుగు ఇటువేసి
నిజమేదో చెప్పిపోరాదటోయ్