ఒకానొక నిశ్శబ్దం
పచ్చనిదండలా పెనవేసుకుంటుంది
నా నుంచి తప్పిపోయిన
అణువులేవో కలిసికట్టుగా వచ్చి అల్లుకుంటాయి
నాకు నేనే
కొత్తగా పరిచయం అవుతాను...
ఇప్పటివరకు
చూసిన లోకాన్ని మరిచిపోతాను
మనసు గాయాలు దారితప్పిపోతాయి
చీకటి గుహల్లో
తప్పిపోయిన మనుషుల కోసం వెతుకుతాను
మూసివేసిన కనిపించనిదారుల కోసం అన్వేషిస్తాను
మరోసారి ప్రేమ తెరల మధ్యన చిక్కుకుంటాను
ఇప్పుడు
నేను విడిపోయి అతను అతనుగా
అతను అనేక నేనుగా
ఓయ్
నీకు సమ్మతమేగా
మరో మాట లేదని నమ్మకమేగా