ఓ ఎదురుచూడని ఉదయాన
అందమైన రెక్కలు నా చెంత ఉన్నాయి
బహుశా ప్రేమించిన స్నేహితులో
అప్పుడెప్పుడో కలిసిన తెలియని మనిషో
దారిలో పలకరించిన పరిచయస్తులో
ఇచ్చిన వారెవరో అంతు పట్టలేదు
ఏమైతేనేం
కుదురుగా ఉన్న జీవితానికి
చెంత చేరిన రెక్కలు
అబ్బో...ఎంత బాగున్నాయో
ఇదిగో
ఇక్కడ వాన కురుస్తోంది
రెక్కలు తడిచేలా ఎగిరి ఎగిరి
అంతుపట్టని దూరం వెళ్లి
వెచ్చవెచ్చని ఎండలో ఆరపెట్టుకువచ్చాను
ఎంత బాగుందో ... ఎంతెంత బాగుందో
అంతేనా
రాలిన ఈక రెక్కలవ్వడం చూశాను
కథలు కథలుగా చెప్పాలనిపించింది
కొత్త రెక్కలను సృష్టించి ఇవ్వాలనిపించింది
అంతలో
మనిషి నైజం నిలవరించింది
రంగుల రెక్కలను భద్రంగా దాచేసా
ఛీ....
ప్రేమించడం కాస్తంత తెలుసు కదా
అయినా ఇవ్వడం మానేసి ...ఛీ ఛీ
దాచడం నేర్చుకున్నాను చూడు
ఓయ్
కూత వేటు
దూరంలోకైనా వచ్చి వెళ్ళు
ఎందుకో
ఈవేళ నేను నేనులా లేను