కొందరుంటారు
మన జీవితంలో ఎదురుపడే ఉంటారు
మర్చిపోయిన క్షణమేదో గుర్తురాదు
అలాంటి తను
అప్పుడప్పుడు కనిపిస్తుంది
కుశలమడుగుతుంది..
తనని చూస్తూ అన్నిటికీ జవాబు చెబుతాను
కానీ
నీ పేరేంటి
నువ్వు నేను ఎప్పుడు కలిసాము
ఇలా వంద ప్రశ్నలు
పెదవి చివరనే ఆగిపోతాయి
కాలం గడిచిపోతుంది
ఓరోజు హఠాత్తుగా గుర్తొచ్చింది
ఈ మధ్య కనిపించనేలేదని
మనసు
నిశ్శబ్దపు పొరల మధ్యన నిలిచిపోయింది
పేరు, ఉండే చోటు ఏదీ తెలియదు
ఎప్పటికీ
కనిపించదేమోననే అనుమానం
కనిపిస్తే బాగుండని ఆశ
వలయాలు వలయాలుగా చుట్టేసింది
అయినా
కనిపిస్తే మటుకు
ఇంతకాలం కుశలమడిగిన తనను
నువ్వు ఎవరని ప్రశ్నించగలనా...
అయితేనేం
తను కనిపిస్తే బాగుండు
నన్నోమారు కుశలమడిగితే బాగుండు...