ఓ ప్రేమలేఖ రాశావా ఎప్పుడైనా
అథాటున ఎవరో అడిగారు అందరి మధ్యన
ఏం చెప్పనూ ...
క్షణాలు కదిలిపోతున్నాయి
చిన్నమాటేది పెదవి దాటి రావడం లేదెందుకో
అయినా
ఆకాశమంత ప్రేమిస్తున్నానంటూ
నీ వెనక వెనక తిరిగే నాకు
మృదువుగా నాలుగు పదాలు ఒకచోట చేర్చి
లేఖ రాయాలని ఆశ పుట్టదు ఎందుకో...
ప్రేమించడం కాస్తంత బానే వచ్చుగాని
ఎంతగా ... ప్రేమించానో చెప్పడం రాదో
చెబితే ... వదిలి వెళ్ళవన్న భయమో మరి
ఓహ్
చెయ్యలేని పనికి చర్చలెందుకులే...
ఏదేమైనా
కయ్యాలమారిగా తగువుల తెంపరిగా
నీతో మాట పడడం బాగుంటుంది మరి...
ఓయ్...
అంతా విని..
అయ్యో అంటూ ఊరడిద్దామని వచ్చేవు
తగువుల పిల్ల మారలేదింకా
కాస్తంత జాగ్రత్తోయ్ ... రాజకుమారా