జీవితపు నౌక ఎక్కడో గాడి తప్పింది
అనుకోని యుద్దాలేవో వచ్చి వెళ్ళాయి
ఇదంతా అయిపోయిన కథనేగా
ఆగిపోయిన యుద్ధంలో
రాలిన శకలాలు విరిగిన ముక్కలు ఎన్నెన్నో
కాలం ఒడిలో కరిగిపోయాయి అనుకున్నా
మదిలోన ఇంకిన
రాచుకుంటున్న రవ్వ, ఎగిసిపడే జ్వాలలు
ఇక కనుమరుగయ్యాయి అనుకున్నా
అనుకోని అతిథిలా చిరుగాలి వీచింది
చిగురించిన మొక్కలని మెత్తగా తాకింది
వెళుతూ వెళుతూ మదిని గట్టిగా హత్తుకుంది
నిశ్శబ్దమైన విస్పోటం...
మదిలోని రహస్యాలకు నడక వచ్చింది
అనంతమైన సముద్రపు హోరు సృష్టించింది
తప్పెక్కడ జరిగిందన్న చర్చ లేదు
మనసంతా గాయాల మయమయ్యింది
బహుశా మనిషికి
గాయం కథలపై మక్కువ ఎక్కువేమో
తగిలిన గాయాన్ని ఎప్పుడూ పదిలంగా దాస్తాడు
అప్పుడప్పుడు గిల్లడానికి అనువుగా....