నిశ్శబ్ద స్వప్నం
ఒక్కోరోజు
గాడ చీకట్ని దుప్పటిగా కప్పుకున్నట్టు
ఉక్కపోతలో ఎడారిదారి పట్టినట్టు
మనుషులెవ్వరూ లేని చోట చిక్కుకున్నట్టు
వింత వేదనేదో మనసు చుట్టూ అల్లుకుంది
తెలిసి తెలియని వారి మరణాలెన్నో వరదల్లే చుట్టుముట్టి
నవ్వుతూ మన చుట్టూ తిరిగే వారి లెక్కలేమో వెక్కిరిస్తూ గుర్తొచ్చి
ఒక్కసారిగా మనసు గాఢమైన విషాదంలోకి నెట్టబడింది
అప్పుడో క్షణాన
జీవితపు రహదారులన్నీ మూసివేయబడ్డట్టు
చిక్కని అడవిలో ఒంటరిగా చిక్కుకున్నట్టు
నాకు నేను కనిపించకుండా పోయినట్టు
తెలియని ప్రశ్నకు జవాబులా ఎదురయింది
ఇక చెప్పేదేముంది....
ఇప్పటివరకు రాసుకున్న కథ మాయమై
కొత్త కథ ఏదో ఎదురైనట్టు
నా చుట్టూ ఉన్న అందరూ
ఇపుడు అచ్చంగా నాలానే అనిపిస్తున్నారు...