అతడు బొమ్మ గీయడం మొదలెడతాడు
నేను ఆసక్తిగా చూస్తూ ఉంటాను...
ఇది కొన్ని వేలయేళ్లుగా జరుగుతున్నట్టుగా ఉంది
ఇందులో ముక్కు బాగాలేదంటూ
అందులో కన్ను బాగలేదంటూ
తొమ్మిదినీ పక్కకు పెట్టి
పదో బొమ్మతో పూర్తయిందంటాడు
పూర్తయిన బొమ్మను
ఎవరికో ఇచ్చి డబ్బు పుచ్చుకుంటాడు
అందుకే కాబోలు
అందంగా పూర్తయిన బొమ్మ మీద
నాకు ఎప్పుడూ ఆశక్తి లేదు..
నా కన్నులు ఎప్పుడూ
అతను వదిలేసిన బొమ్మల పైనే...
ఇంతకూ
వదిలేసిన బొమ్మ పూర్తయినట్టా
బాగుందంటూ వదులుకున్న బొమ్మ పూర్తయినట్టా
ఓయ్
అంతుపట్టని ఈ చిక్కు ప్రశ్నకు
నువ్వేమీ సమాధానం ఇవ్వక్కర్లేదులే
నాకేం ఇప్పుడప్పుడే ఆట పూర్తి చేయాలని లేదు...