నీ నుంచి నువ్వు విడిపోయి చాలా కాలమైంది
ఆ చాలా కాలం కిందటే కాబోలు నిన్ను కలిసాను
ఎందుకో మరి
నువ్వు సమయ సమయానికి కొత్తగా కనిపిస్తావు
రాలిపోయిన కాలానికి
గుర్తుగా ఉన్న శిలాజాలు తీసుకొచ్చి
తెలియని కొత్త కథ చెబుతానంటావు
గాలి వేగానికి రాలిన ఆకులను
వర్షపు చినుకులలో తడిపి అతికించవచ్చంటావు
మౌనాన్ని లిఖించడమెలాగో నేర్చుతానంటావు
వింతైన సావాసం విరబూసింది
కాలాలు మంచులా కరిగిపోతున్నాయి
నువ్వు నిచ్చలంగా నాతోనే ఉండిపోయావు
ఓయ్
ఇక చెప్పడానికేముంది
ఇప్పుడు
నా నుంచీ... నీ నుంచి
అనేకనేక నేనులుగా విడిపోతున్నానేమో
అచ్చంగా.... ఒకప్పటి నీలానే