మరో జన్మకు సరిపడా దాచాలని

ఎంత ఆశనో
ప్రేమకు లెక్క కట్టాలని ఉంది
కొలతలు తూచాలని ఉంది
కొదవపడ్డ వాటిని సరిచేయాలని ఉంది

తప్పుకు పోకుండా, తప్పించుకుపోకుండా
తికమక లెక్కలతో బంధించాలని ఉంది

లెక్కలేనంత ప్రేమను
కొలత వేసి బస్తాల్లో నింపి
మరో జన్మకు సరిపడా దాచాలని ఉంది

పేరాశ ఒకటి పెనవేసుకుపోతోంది
నేల నింగి లెక్కలకు అందని ప్రేమ
అంతా నాకే కావాలని పట్టు పట్టాలని ఉంది
పూర్తిగా స్వార్థపరురాలినై పోవాలని ఉంది

ఓయ్
ఇందులో
నీ ప్రమేయం ఏమీ లేదు కదా
అయినా
నెపం నీ మీదే వేయాలని ఉంది....

ఈ కవిత 3 - 3 - 2025 సోమవారం కడలి సాహిత్య పేజీలో ప్రచురించబడింది.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!