అప్పుడప్పుడు
పనిగట్టుకొని పలకరించడానికి వస్తాడు
ఎన్నోమార్లు చెప్పిన తేనె పలుకుల్లా
కాసిన్ని వర్షపు చినుకులు కురిపిస్తాడు
అయినా కరుకు మాటలై తగులుతాయి
ఏమో మరి
నాకు చెప్పడానికి మాటలేమీ మిగలలేదేమో
మౌనంలో మాటలన్నీ వినడం వచ్చిందేమో
అయినా
ప్రేమించడం మొదలెట్టి చాలాకాలం అయ్యిందిగా
తిరకాసు లెక్కలు తారుమారయ్యాయేమో
కాలంతో పాటుగా
నీడలు రెండుగా విడిపోయాయేమో
విడివడిన నీడలు కలహించుకుంటున్నాయేమో
బహుశా
మాట పట్టింపు ఏదో వచ్చే ఉంటది
వదిలి పొమ్మన్నా పోనీ అహం ఒకటి చేరే ఉంటది
ఏదైతేనేం
కాలం మలుపులతో పని లేదు నాకు
ఓయ్..,.
ఆరుజన్మల నుంచి కాస్తంత పరిచయమే కదా
నాతో వాదనలు సరికాదని బహు బాగా తెలుసు కదా
దారితప్పిన
పొడిబారిన మాటలిటు జాలువారకుండా
మెత్తగా మాటలకు తేనెలద్దడం
ఒద్దికగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేర్చుకోవోయ్ ....రాక్షస రాజకుమారా