ఒకానొక రోజు
మసక చీకట్లు కమ్ముకుంటున్నట్లు
నా నుంచి నేను తప్పుకుంటున్నట్లనిపిస్తుంది
హఠాత్తుగా ఎదురవుతాడు
నీ వెంత మంచిదానివంటాడు
నీవొక అపురూపమంటాడు
నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తాడు
ఆధాటున అంటాడో ఆలోచించి అంటాడో
మాటవరసకంటాడో మనసుపడి అంటాడో
ఆలోచనల లెక్కలెందుకులే
నా నుంచి నేను
తప్పుకు పోకుండా కట్టడి చేస్తాడు
అప్పుడప్పుడు
కనిపించని పాలపుంతలా అబ్బురమనిపిస్తాడు
కనిపించే మా ఊరిలా ఆత్మీయంగా కనిపిస్తాడు
తప్పిపోయిన స్నేహితుడిలా ద్వేషించని బంధువుల్లా
అంతా తానైపోయినట్టు అనిపిస్తుంది
కొన్నిసార్లు
అమ్మలా అనిపిస్తాడు నాన్నలా కనిపిస్తాడు
అంతా సరి చేసినట్టు ఉంటుంది
నాకొక అమృత గుళిక ఇచ్చి వెళ్లినట్టు ఉంటుంది
ఓయ్... నిన్నే
నా చిన్నప్పుడు
అబ్బురమనిపించే చందమామ
నువ్వెప్పుడయ్యావ్