మీ పిల్లలు..ఆణిముత్యాలు...

ఆణిముత్యాలు..ముత్యపు చిప్పలో పడిన వానచినుకు ఆణిముత్యం అవుతుందట. అందులోని నిజమెంతో తెలీదు కానీ..పిల్లలలందరూ నాకు మాత్రం ఆణిముత్యాలే..వాళ్ళంతా చేయితిరిగిన రచయిత మదిలోని ఆలోచనలు.. మా పిల్లలు మాకు పూర్తిగా తెలియదా అని అడిగే తల్లి తండ్రులకు  ఓచిన్న ప్రశ్న..మీరు మీ తల్లి తండ్రులకు పూర్తిగా మీ గురించి తెలియదు, నన్ను పూర్తిగా అర్ధం చేసుకున్నవాళ్ళే ఎవరు లేరు అని మీరు  అనుకుంటున్నపుడు ...మీ పిల్లలు కూడా మీ ప్రతిరూపమే..అలానే అనుకోరని  ఎలా అనగలరు..


ఎక్కడో మార్పు మొదలైంది ..ఎక్కడా అని కారణాలు  వెతకడం మొదలెడితే...చెట్టు ముందా విత్తు ముందా అన్న  జవాబు దొరకని ప్రశ్నలా తయారయింది.. పిల్లలని అడిగితే వాళ్ళు చెప్పే కారణాలు డబ్బుకు సంబంధించనివి చాలానే ఉన్నాయి... తల్లి తండ్రులని అడిగితే తమకు మించిన సదుపాయాలు కల్పిస్తున్నా ఇంకా మేము ఏదో చేయలేదు అన్నట్టు పిల్లలు ప్రవర్తిస్తున్నారు అని వాపోతున్నారు...

ఎక్కడ పొరపాటు జరుగుతుంది......ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తూ మా పిల్లలంటే చాలా ఇష్టం అని నిరూపించుకునే ప్రయత్నించే పెద్దలదా... అందుకోవడం లో హద్దులు తెలియని పిల్లలదా..  ఒక చిన్న తొట్టిలోని చేపలను పెంచుతూ..ఎక్కువ ఆహారం వేసినంత మాత్రాన సముద్రంలో చేప అవదు.. ఒక ఇంటి పెరడు తొట్టిలో పెంచే మొక్క మనదే కదా అని తడి ఆరకుండా నీరు పోస్తే అది బ్రతకడు.. ఇవన్నీ అందరికి తెలిసిన జీవిత సత్యాలే.. అక్కడ తెలిసిన సత్యం పిల్లల దగ్గర మాత్రం పాటించడం లేదు ఎందుకనీ.... ఈ మధ్యే సాక్షి దినపత్రికలో చదివిన న్యూస్... ఒక స్కూల్ పిల్లవాడి బ్యాగ్ లో అక్షరాల లక్ష రూపాయలు చూసి ఆ స్కూల్ ప్రిన్సిపాల్  తల్లి తండ్రులను అడిగితే మేమే ఇచ్చాము అబ్బాయి పుట్టినరోజు అని, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోడానికి అన్నారట.

అన్నిటికంటే కష్టమైనది బాధ్యతకల తల్లితండ్రులుగా నిలదొక్కుకోవడం, అందుకు మీ పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు, హద్దులు పెట్టగలిగి, ఆ హద్దులను అమలుచేసే కఠినత్వం కూడా ఉండాలి, బాధ్యతతో కూడిన ప్రేమ మాత్రమే అన్నిటికంటే కష్టమైనది.. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని పిల్లాడు ఏడుస్తున్నా ఆతను అడిగినా రెండో చాక్లెట్ ఇవ్వని తల్లితండ్రులకంటే ఏడుపు ఆపితే చాలు అని పిల్లాడు అడిగిన రెండు చాక్లెట్స్ ఇచ్చే తల్లితండ్రులే ఎక్కువ కాబట్టి....

మంచి కూతురిగా, ప్రేయసిగా, మంచి భార్యగా ఉండడం మీ ఒక్కరి చేతిలోనే ఉంది కానీ మంచి తల్లిగా ఉండాలంటే మీ పిల్లల సహకారం లేనిదే ఏమి చేయలేరు.. పిల్లలు మీ చేతిలోని బొమ్మ కాదు మీరు ఎక్కడా అందంగా అమర్చాలి అని నిర్ణయించడానికి, వాళ్ళు మీ ఆశనో, కలనో కాదు మీరు కోరినట్టుగా ఉండాలని ఊహతో బంధించడానికి, వాళ్ళు మీ ఆలోచన కాదు సరైనదా కాదా అని పదిమందితో చర్చించడానికి.పిల్లలు  ఒక అద్బుతమైన పుస్తకం..కానీ ఆఖరి పేజిలో ఇంకా ఉంది అని మాత్రం ఉంటుంది...

ప్రతీ ఒక్కరు ఎపుడో ఒకప్పుడు సీరియల్ కథలను  పత్రికల్లో చదివే ఉంటారు ...(అయినా ఇపుడు టివి లో చూస్తూనే ఉన్నారు కదా అందరూ..!) .మీరు ఎపుడూ వదలకుండా ప్రతీవారం చదివితేనే కథ తెలుస్తుంది.. పని ఒత్తిడిలో చదవడం మానేస్తే మీకు తెలిసిన సగం కథనే మీ చెంత ఉంటుంది..కథ పూర్తిగా తెలియాలంటే వేరే ఎవరో చెప్పాల్సి ఉంటుంది..అయినా ఎపుడో ఒకపుడు నవలగా అందుకుని చదివే సదుపాయం  ఉందనుకోండి కానీ ఉత్కంట కలిగించే సీరియల్ కథ లాంటి వాళ్ళు పిల్లలు.. ఇక్కడ ఒకేసారి నవలగా చదవాలని ఆశ పడడం కుదరదు... ఎన్నిసార్లు చదివినా కథ చెప్పగలరు కానీ పొల్లుపోకుండా తిరిగి రాయలేరు.. నీవు ఎన్ని సార్లు చదివావు అన్నది నీవు వేరొకరికి చెప్పే కథని బట్టి చెప్పవచ్చు.. మీరు  మీ పిల్లలనే అద్బుతమైన కథని ఎంతబాగా అర్ధం చేసుకున్నారో తెలియాలంటే ఏమి చేయాలి..ఒకసారి ఆలోచించండి...
 
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!