మీరు వదిలేస్తున్న మీ ఆనందం......

అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని అందరు చెపుతారు. అయితే మానవులంతా ఉత్తములా అని అడిగితే మటుకు, అలాంటి వాళ్ళను కాగడా వేసి వెతకాలి, మంచివాళ్ళని భూతద్దం  వేసి వెతకాలి అని సమాధానం చెపుతారు. నిజంగా ఈ జవాబులో నిజముందా? తనని తను చూసుకుంటూ, ఇతరులకు సాయం చేస్తూ, ఎవరినీ నొప్పించక, తానూ నొచ్చుకోక ఉండేవాడిని ఉత్తముడు అనే అనవచ్చు. తనను తను చూసుకొని ఎవరినీ నొప్పించనివాడు  మంచివాడే కదా...కానీ ఈ కాలంలో తనని తను పట్టించుకోకున్నా, తను నొచ్చుకున్నా  , అందరికి సాయం చేస్తూ, బ్రతకడం చేతకానివాడు, అనే ముద్ర ఉంటే కానీ మంచివాడుగా పరిగణించడం లేదు..

మహాత్మాగాంధిలా ఒక చెంపపై  కొడితే మరొక చెంప  చూపించి అతని తప్పుకి సిగ్గుపడేలా చెయ్యి,  అనే సూక్తి ఇపుడు ఎంతవరకు ఆచరించదగినదో   తెలియడం లేదు.. గాంధిలా చేయడానికి సహనం, ప్రతీ మనిషిని తనవాళ్ళే అనుకునే గుణం ఉండాలి, అంతటి వ్యక్తిత్వం ఉండడం కష్టం. ఆలా అని  కొట్టగానే వారిని ఎదిరించే ధైర్యం ఉండేవాళ్ళు కూడా తక్కువే.. తమ తప్పులేకున్న కొట్టించుకొని, తిరిగి ఏమి అనలేక పోయాను అని లోలోపల చాలా బాధపడుతూ, తను మంచివాడిని అనే ముసుగులో, తమ తప్పులను ఒప్పుకోకుండా, ఆత్మనూన్యతను పెంచిపోషిస్తూ ఉండే వాళ్ళు నేటి సమాజంలో ఎక్కువగా కనిపిస్తున్నారు, వీరికి జీవితం పై అభద్రతా భావం ఎక్కువ. వీరి వల్ల ఎక్కువ నష్టపోయేది, ఇతనికి దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులే.  జీవితం అంటే భయములేని నాడు మనిషి తనను తను  ఉన్నతమైన వ్యక్తిగా మలచుకొని, అందరు ఇష్టపడే వ్యక్తిగా తనలోని మంచిని ప్రదర్శించగలడు.

మానవుడు జీవించడానికి ముఖ్యంగా కావలసింది పిడికెడు ప్రేమ, ఆదరించే నలుగురు మనుషులు, తన ఉన్నతి చూసి ఆనందించేవాళ్ళు, తన సహాయం అందుకునే వారు.. ఇవి ఏవి లేకుండా కోరుకున్నంత డబ్బు, పెద్ద భవంతి, ఉన్నా కూడా తృప్తిగా జీవించలేడు. ఒకప్పుడు డబ్బు మాత్రమే కొరతగా ఉండేది, కానీ ఇపుడు డబ్బు తప్ప అన్ని కొరతగానే కనపడుతున్నాయి, ఒకప్పుడు కమ్యునికేషన్ ఫెసిలిటిస్ కూడా చాలా తక్కువ ఉండేవి అయినప్పటికీ మానవ సంబంధాలు  ఎక్కువగా ఉండేవి, కనీస అవసరాలు గడవని వారి మధ్య కూడా మానవ సంబంధాలు పటిష్టంగా  ఉండేవి. ఈ సంబంధ బాంధవ్యాలు తగ్గడం వల్ల మనిషి గుర్తింపు కూడా సన్నగిల్లింది, ఇదే మనిషిలో ఆత్మవిశ్వాసం తగ్గడానికి ఒక కారణంగా మారింది.

డబ్బు ఎక్కవ ఉన్నపుడు నలుగురు ఏంటి ఎంతమంది నైన ఆకట్టుకోవచ్చు, వారికి సహాయం చేసేంత డబ్బు ఉన్నపుడు అందుకునే వాళ్ళు కరువా అని అడిగితే! ఏమని జవాబు చెప్పాలి.. నిజమే సహాయం అందుకునే వాళ్ళు లేరు, సమాన స్థాయి  వాళ్ళకు  మీ సహాయం అవసరం లేదు, నీ కంటే తక్కువ స్థాయి  వారికి నువ్వు ఇవ్వాలనుకున్నా అందుకోడానికి సిద్దంగాలేరు, ఎందుకంటే వారు యాచకులు కారు కనుక, వాళ్ళను మీరు ప్రేమతో బంధించలేదు కనుక, మీకు ఎవరితో సంబంధం లేకుండా డబ్బుతోనే స్నేహం చేసి, నన్ను గుర్తించండి, నన్ను చూసి ఆనందించండి అని యాచకుడిలా నువ్వు ఉన్నపుడు, నీలో ఆత్మ నూన్యత ప్రవేశించక ఏమవుతుంది.. నీవు ఉన్నతుడిగా నిరూపించుకోవాలన్న ఆత్రుతతో, ఎదుటివారిని  కించపరుస్తూ, నీ మాటలతో బాధిస్తూ  ఆనందించడం అలవాటు చేసుకొని, నా కుటుంబం ఉన్నతంగా ఉండాలని కోరుకుంటే ఎలా సాధ్యం.  ఒకరిని ఆకట్టుకోవాలంటే, ఇష్టపడాలంటే కావలసింది మనసుతో  మాట్లాడడం, వారికి కొంచెం సమయం పెట్టడం, ఒకరి ఉన్నతి చూసి ఆనందించడం, ముందుగా అవి నీవు అలవర్చుకుంటే, నీకు ఇంకొకరినుండి లభిస్తాయి.

నాకు మనుషులోతో  అవసరం లేదు డబ్బు పెడ్తే అన్ని అందుతాయి అనడం ఎంతవరకు సబబు, డబ్బు పెడితే సేవలు మెరుగుగా అందడానికి సహాయపడొచ్చు, ఆ సేవలు అందించేవారు మనుషులే! అక్కడ కూడా మీరు సామరస్యంగా, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోలేకపోతే   మీ డబ్బు మనిషిగా మారి సేవలు అందించదు. మీరు డబ్బుని ప్రేమించండి, దానిపై ఆశ పడండి, అది అందడం కోసం కష్టపడండి, కానీ అది మాత్రమే ఉంటే చాలని మిమ్మలిని మీరు బంధించుకోకండి, డబ్బుని గురువుగా పూజించు, స్నేహితుడిగా ఆదరించు కానీ అదే నీ ఆత్మగా మార్చుకోకు.... డబ్బు నీ ఆనందం కోసం నీ ఉన్నతికోసం ఆలంబనగా మారాలి తప్ప, నిన్ను నీవు కోల్పోడానికి కాదు..

చదువుకుంటున్నప్పుడు ఉన్న స్నేహితులందరి దగ్గరనుండి ఒక్కసారిగా వైదొలిగి ఉద్యోగాన్వేషణలో  ఉన్నాం, బిజినెస్ లో ఉన్నాం అంటూ,  ఒక ఉన్నత వర్గంలో చేరాకా స్నేహితుల కోసం వెనుతిరిగితే అక్కడ మీకోసం ఎవరు వేచి ఉండరు. మీరు అభివృద్ధి సాధించండి అందుకోసం మీ స్నేహం, మీ బంధుత్వం అడ్డుగా ఉందని మాత్రం తలవకండి.. మీ అభివృద్దిని చూసి ఆనందించేవాళ్ళు, మీ ఉన్నతిని కోరేవారు, మీ సహాయం కోరేవారు అందరు.. మీరు వదిలేసినా మనుషుల మధ్యే ఉంటారన్నది అక్షర సత్యం. ఎందుకంటే వారికి మాత్రమే తెలుసు.. మీ ఉన్నతికంటే ముందు మీ చేయి పట్టుకుని మీ ప్రేమను పొందిన వాళ్ళు, మిమ్మలిని ప్రేమించేవాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. మీరు మీ ఉన్నతికోసం ముందుకు సాగండి కానీ, అందరినుంచి తప్పుకొని కాదు అందరిమద్యా ఉంటూ ఆనందాన్ని అరచేత అందుకుంటూ ముందుకు సాగండి.....

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!