ఎందుకు చదవాలి ది ఫైర్..(the fire..venu bhagavaan)

మన కలలు నిజం కావాలంటే మనం ముందుగా చేయాల్సిన అత్యుత్తమ పని, మేలుకోవడమే

- పాల్ వాలెరీ, ఫ్రెంచ్ కవి


జీవిత దశలను కాదు నీ జీవిత దిశని మార్చుకుని ఆపై ఇతరుల జీవితాలను మార్చే దిశగా మారటానికి తోడ్పడేది. ఈ "ది ఫైర్". నీ నిరర్ధక ఆలోచనలకు మంటను పెడుతుంది ఫైర్.
ప్రకృతిలో రాత్రి అనే చీకటి, పగలు అనే వెలుగు ఉంటాయి. రెండిటిని మనిషి ఆస్వాదిస్తాడు. కానీ అదే జీవితంలో చీకటి(భాద) కన్నా వెలుగు (ఆనందం) వైపే పయనించాలని రచయిత వేణు భగవాన్ చెప్పిన తీరు అమోఘం
- యండమూరి వీరేంద్రనాథ్.

 

 

దారి చూపే వెలుగు..ది ఫైర్..

ఒక అర్ధరాత్రి ఒక ఇల్లు అంటుకుంది. ఇంట్లో ఉన్న అందరూ తప్పించుకోగలిగారు. త్రాగుబోతు అయిన ఆ ఇంటి యజమాని తప్ప, ఆతను గాఢ౦గా నిద్రపోతున్నాడు. ఇంతలో ఇల్లంతా మంటలు వ్యాపిస్తున్నాయి. త్రాగుడు విషయం తెలిసిన కొంతమంది చుట్టుప్రక్కల వాళ్ళు ధైర్యం చేసి లోపలికెళ్ళి, ఆయనను బయటకు లాగటానికి ప్రయత్నించారు. ఇంటి గుమ్మం మంటల్లో చిక్కుకుపోవడం వలన కిటికీ ద్వారా బయటకు లాగటానికి పయత్నించారు కానీ చాలా బరువుతో త్రాగుడు మత్తులో నిద్రలో ఉన్నఅతనిని రక్షించడం ఎవరివల్లా కావడం లేదు. ఒక కిటికీ ద్వారా సాధ్యం కాక, మరొక కిటికీ ద్వారా బయటకు లాగాలని శ్రమపడుతున్నారు... ఇంతలో బయటినుండి ఒక పెద్దాయన "ముందు వాడి నెత్తిమీద గట్టిగా కొట్టండి. నిద్రలేస్తాడు. వాడే బయటకు వస్తాడు." అని అరవగానే వారిలో ఒకడు ఆ యజమాని నెత్తిమీద ఒక్కటి కొట్టాడు అంతే" ఆ యజమాని కళ్ళు తెరిచాడు. నిద్రలేచాడు, కిటికీ నుండి బయటకు దూకాడు. ఈ కథలో లాగే ఈ పుస్తకంలోని మాటలు గట్టిగా కొట్టవచ్చు. నిద్రలేపవచ్చు. మనలోని అసలైన అస్థిత్వం మేల్కొన్నపుడు సాధ్యా-సాధ్యాల పట్ల మనకున్న పరిమితులు చెరిగిపోతాయి. ఎంతటి గమ్యమైనా చేరుకోగలిగే విశ్వాసం ఇనుమడిస్తుంది.

ఒక రోజు హైవే మీద ప్రయాణిస్తున్నాను. వీధి దీపాలు లేవు, వెన్నెల కూడా లేదు. అయినా సరే ఆ చీకటిలో చాలా సులభంగా వేగంగా ప్రయాణించగలుగుతున్నాను. ఎందుకంటే నా కారుకు హెడ్ లైట్స్ ఉన్నాయి కనుక! ఈ కాంతి కేవలం కొన్ని మీటర్ల వరకే పడుతుంది మరీ గమ్యమేలా చేరడం! కాంతి కూడా నాతొ పాటు పయనిస్తుంది.ఆ కాంతిలో నాకు రోడ్డుకు ఇరువైపులా ఉండే సైన్ బోర్డులు నా గమ్యానికి చేరడానికి సహకరిస్తాయి...ఈ విధంగా ఎన్నడూ చూడని గమ్యాన్నైన అవలీలగా చేరుకోగలను. అదే విధంగా మన గమ్యం తెలిసినప్పుడు మనలోని బుద్ధి, జ్ఞానమనే కాంతిని కురుపించి దారి చూపిస్తుంది.

శతాబ్దాల చీకటిని కూడా ఒక చిన్న దీపం తరిమేస్తుంది. ఈ పుస్తకం లో ఉన్న జ్ఞానం మీ జీవితంలో అత్యంత విలువైన, ముఖ్యమైన అంశాలపై వెలుగు ప్రసరించడం ద్వారా మీ దృష్టిని సరైన విషయాలపై కేంద్రీకృతపరచడానికి సహకరిస్తుంది.

ఈ పుస్తకం ద్వారా సంపూర్ణ ప్రయోజనం పొందాలంటే..చదువుతూ, మధ్యలో కొద్దిసేపు ఆగి అందులోని నిగూఢ భావాన్ని గ్రహించి, మీలో ప్రతిఫలించే ఆలోచనలను, కలలను, అవకాశాలను ఒక వ్యక్తిగతమైన నోట్స్ లో వ్రాసుకోండి. ఈ పుస్తకం ఎంతోమంది గొప్పవారి జ్ఞాన సంపదను కలిగిఉంది. ఈ పుస్తకంలో ఉపయోగించిన సూక్తులు అన్నీ మహానుభావులు అందించినవి. ఈ పుస్తకమంతా వాటి నుండి వెల్లువెత్తే జ్ఞానాన్ని మీ ముందుకు తీసుకురావడం కొరకు నేను చేసిన వ్యాఖ్యానం మాత్రమే. జీవితంలో విజయం సాధించడం గురించిన ఎన్నో పుస్తకాలు మీరు చదివి ఉండవచ్చు. అయితే ఈ పుస్తకం మనిషి జీవితాన్ని విజయవంతం చేయడంకోసం. జీవితమే విజయవంతమయితే, జీవితంలో విజయాలకు కొదవా!

కేవలం సమాచారం వల్ల మాత్రమే జ్ఞానం వస్తుందనుకోవడం భ్రమ. అలా అయితే పేపరు మొదటినుండి చివరి వరకూ చదివేవారు, టివి వార్తలను చూసిందే పది సార్లు చూసేవారూ గొప్పవారయిపోవాలి కదా! మనకు ఈ రోజు సమాచారం ఎక్కువయిపోవడం వల్ల చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం కూడా కష్టమయిపోతుంది. కొత్తది నేర్చుకోవడం, అలవరచుకోవడం పెద్ద కష్టం కాదు, అవసరం లేని వాటిని వదిలించుకోవడమే నూతన సృష్టికి నాంది పలుకుతుంది.

ఈ పుస్తకంలోని సమాచారం చదవడం వల్ల మీ హృదయం, మెదడులోని భారమంతా తొలగింపబడి, అంతరంగం ఆనందంతో నిండి ఒక ప్రశాంతమైన, శక్తివంతమైన, ధైర్యవంతమైన రాజ దర్పంతో తలెత్తుకుని తిరిగే జీవితాన్ని సృష్టించి, జీవించాలని కోరుకుంటూ, మీ జీవితంలో ఎన్నో మార్పులకు నాంది కావాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం మీకు అందిస్తున్నాము. జీవితాన్ని కొత్త కోణంలో దర్శించడానికి సంసిద్ధులై ఉండండి.

 


Comments

Post New Comment


bora.ramakrishna 27th Dec 2012 19:19:PM

naku chala baga nachhindi. edi chadivini tarvatha prati okkaru chakkani kadhalu chadavali.kadhalu manishi vyaktithvanni marchectundi.