పిల్లల ఉన్నతికి - తల్లిదండ్రుల పెట్టుబడి.....?

ఒక ఐదు సంవత్సరాల పాప ఒకసారి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న దేవుడు ఎలా ఉంటాడో తెలుసా అని  అడిగిందట. వాళ్ళ నాన్న నాకు తెలియదమ్మా  నేను ఎపుడూ చూడలేదుగా అన్నాడట. కాసేపయ్యాక తన కూతురు రంగు పెన్సిల్స్ తో  గీయడం చూసి పాప ఏమి చేస్తున్నావు అని అడిగాడు?

దానికి ఆ అమ్మాయి దేవుడు బొమ్మ గీస్తున్నాను నాన్న అన్నది.
దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కదమ్మా అన్నాడు నాన్న?
ఇపుడు తెలుస్తుంది నాన్న అని నిఖచ్చిగా జవాబు ఇచ్చింది  పాప....

ఇలాంటి  జవాబు  వింటే మీకేమనిపిస్తుంది. తెలియని పసితనం కావొచ్చు, తెలుసుకోవాలన్న ఆరాటం కావొచ్చు, తెలుసుకొని తెలియనివాళ్ళకి చెప్పాలన్న తపన కావొచ్చు.ఏదైతేనేమి జవాబు విన్నపుడు విభ్రాంతి కలగక మానదు. ఇలాంటి పాప పెద్ద ఐతే తప్పక జీవితంలో గొప్ప గమ్యాన్ని చేరుకుంటుంది అని అనుకుంటారు, తల్లి తండ్రులైతే తప్పక కలెక్టర్ అవుతుందేమో అని ఆశ పడతారు, అందులో తప్పేమి లేదు.

కాని ఈ అమ్మాయి 15 సంవత్సరాల వయసులో ఆత్మనూన్యతతో ఆత్మహత్యకి ప్రయత్నించిందని, 3 సంవత్సరాల నుండి సైక్రియాటిస్ట్ వైద్య పరిరక్షణలో ఉంది అని, తెలిస్తే మీకేమనిపిస్తుంది. పది  సంవత్సరాల్లో యిలా జరగడానికి కారణం ఏమిటి? ఎవరినీ తప్పు పట్టాలి? ఎవరికీ పెనాల్టి వేయాలి? అన్ని ప్రశ్నలే.. జవాబులు ఎలా వెతకాలి..

సమాజంలో వచ్చిన మార్పే ఇందుకు కారణం అనగలమా.. నిజంగా మార్పు సమాజంలో వచ్చిందా లేక మనం అరువు తెచ్చుకున్నదా, ఒక్కప్పుడు చదువుపై యింత ఒత్తిడి లేదు,  చదువులో ఆందోళన, బ్రతుకుపై భయం అనేవి తెలియకుండా గడిపిన బాల్యం  మరిచిపోయిన ఇప్పటి తల్లి తండ్రులు, మేము ఆడిన ఆటలు, మేము తిన్న తిండీ, మా బాల్యం ఇప్పటి పిల్లలకు ఎక్కడుంది అని అంటూనే, మా తల్లి తండ్రులు ఇవ్వని సౌకర్యాలు, ఉన్నత స్థాయి విద్య మేము మా పిల్లలకు అందిస్తున్నాము అని ఆనందిస్తూ, దాని కోసం ఖర్చుపెట్టిన డబ్బు గురించి  తరచుగా  ప్రస్తావిస్తూ పిల్లలలో మానసిక ఒత్తిడిని పెంచుతున్నారు.

పిల్లలకు  బంగారు  భవిష్యత్తు అందిచాలనే ఆశతో, ఆరాటంలో పిల్లల మానసిక స్థాయికి మించిన ఆందోళన కలిగిస్తున్నారు, పిల్లలకు స్ఫూర్తి నిస్తున్నమన్న అపోహతో వాళ్ళకి బ్రతుకు మీద భయాన్ని రేకెత్తిస్తున్నారు. మార్కులని కొలబద్దగా చేసి జీవిత గమ్యాన్ని నిర్దేసిస్తున్నారు. ఇది పెద్దలు తెలిసి చేసిన,తెలియక చేసిన పొరపాటు ఐనా, అందుకు రెండింతల మూల్యం చెల్లించేది తల్లితండ్రులే అయినప్పటికీ శిక్ష అనుభవించాల్సింది, జీవితం పోగొట్టుకునేది  పిల్లలే!

మీ ఇంట్లో పికాసో వర్ణ చిత్రం ఉంటే సరిపోదు,  అందుకు తగిన ఇల్లు, అది అలకరించడానికి సరియైన చోటు, వర్ణచిత్రం విలువ గుర్తించే మనుషులు ఉండాలి, అంతే కాదు ఆ వర్ణచిత్రం వెనకాల తడిచేరకుండా, చుట్టూ  బూజుపట్టకుండా, రోజు దుమ్ము చేరకుండా తుడుస్తూ తగిన సమయం పెట్టి జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ చిత్రం వన్నె తరగకుండా ఉండేది.

అలానే మన పిల్లలు తెలివైన వాళ్ళు ఐతే సరిపోదు, మంచి స్కూల్, కనీస వసతులు కలిగించడం, ఇవి రెండు డబ్బుతో ముడిపడి ఉన్నవి. అంతేకాకుండా స్కూల్ టీచర్స్ తో చక్కటి సయోధ్య,ఇంట్లో పోట్లాటలు లేని చక్కని వాతావరణం, పిల్లలపై సరియైన అవగాహనా, పిల్లలు అబ్బురపడే వ్యక్తిత్వం, వాళ్ళకు ఇష్టమైన వాటిలో మీ చేయూత ఉండాలి,  మీరు మీ పిల్లలతో కలసి అడుగులో అడుగు కలపాలంటే రెండోసారి బాల్యం అందుకోవాలనే తపన కావాలి, ఇందుకు కావాల్సిన పెట్టుపడి  మీ సమయం, మీ ఓపిక మాత్రమే.

ఇపుడు పిల్లలకు మంచి కార్పోరేట్  స్కూల్, ట్యూషన్, ఆడుకోడానికి కాస్ట్లీ ఎలెక్ట్రిక్  బొమ్మలు, బ్రాండెడ్ బట్టలు, తినడానికి ఫాస్ట్ ఫుడ్, డబ్బుతో కూడినవి మాత్రమే ఎక్కువగా అందిస్తున్నారు, ఇందుకు ఇద్దరు ఉదోగస్తులు కావడం కాకపోవడం అనే మినహాయింపు ఏమి లేదు. పిల్లలకు ఉన్నత స్థాయి  జీవితం అందించాలనే ఆరాటంలో, పిల్లలకు ఇవ్వకూడనివి  ఇచ్చి, ఇవ్వవలసినవి ఇవ్వలేకపోతున్న విషయం గుర్తించడానికి  కూడా ఈనాటి తల్లితండ్రులు సిద్దంగాలేరు. ఒకప్పుడు తల్లి పిల్లల బాధ్యత, తండ్రి పోషణ బాధ్యత తీసుకునేవాడు. ఇపుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, తల్లి స్థానం  సున్నాగా మారింది. అదీ భర్తీ చేయాలంటే తల్లి, తండ్రి ఇద్దరు తగిన సమయం పిల్లలకు పెట్టడమే పరిష్కారం. కాని తల్లి పోషణ బాధ్యత తీసుకున్నంతగా, తండ్రి పిల్లల బాధ్యత తీసుకుంటున్నారా...

సమయం పెట్టక పోగా, దానికి పరిహారంగా పిల్లలకు విలువైన బహుమతులు ఇవ్వడంతో తల్లితండ్రులు కొంతమేర సంతృప్తి పడుతున్నారు. ఇది ఉద్యోగస్తుల విషయంలోనే కాదు,  ఉద్యోగం చేయక పోయిన గృహిణిగా ఉన్న ఇంట్లో కూడా ఇదే పరిస్థితులు తలెత్తడం గమనార్హం. పిల్లలతో గడపడం అంటే సినిమా, షికారు తీసుకెళితే చాలదు.. పిల్లలతో కలసి వారి మనోభావాలు పంచుకునే స్థాయిలో ఉండాలి, వాళ్ళు చెప్పే స్కూల్ విషయాలు వినే ఆశక్తి ఉండాలి.

పిల్లల కోసం సమయం పెట్టక పోవడం అనేది సమస్యగానే గుర్తించడం లేదు, కాని ఇదే భావితరంలో సామాజిక సమస్యగా రూపుదిద్దుకోడానికి అతి పెద్ద కారణంగా మారబోతుంది. అలంకరణ కోసం డబ్బు, పిల్లల చిరునవ్వుకోసం మీ సమయం పెట్టుబడిగా కావాలి. అందరి దగ్గరా డబ్బు ఉంది, లేనిదల్లా  సమయం మాత్రమే.
 

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!