దేవి

'పద్దు' కాస్త స్వరం పెంచి పిలవగానే, రెండు నిమిషాలలో కాఫీ కప్పుతో ఎదురుగా నిలిచింది, కాఫీ కప్పు అందుకుంటూనే కాస్త చిరాకు తో మొక్కలకు నీళ్ళు పెట్టావా అన్నాడు ఈశ్వర్. తోటమాలి తో నీళ్లు పెట్టించాను పొద్దున్నే అంది.

ఓహో అంటే నేను పొద్దెక్కినా లేవని వెధవలా కనిపిస్తున్నానా అకారణంగా కోపగించుకున్నాడు. కోపం తెచ్చుకుంటే నిశ్శబ్దంగా వెళ్ళిపోయే పద్మా వెళ్ళకుండా అక్కడే నిలవడంతో ఏంటి అంటూ అడిగాడు ఈశ్వర్. మావయ్య గారి దగ్గరికి వెళ్ళాలి ఈసారి రావడం నాలుగు రోజులు ఆలస్యం కావచ్చు అండి నెమ్మదిగా, ఉవ్వెత్తున కోపం వచ్చినా ఎప్పుడో మూడేళ్లకు ఒకసారి వెళ్ళే, తన మీద అరవడం ఇష్టంలేక సరే త్వరగా రా! అని ముక్తసరిగా అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు.

పద్మ ఊరెళ్ళడంతోతో ఇల్లంతా ఒక్కసారి బావురుమనిపిస్తోంది, తను ఏ మాట మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నా ఇల్లంతా ఎంతో కళగా ఉంటుందనీ, ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చింది ఈశ్వర్ కి.

పద్మ తనని అద్భుతంగా చూడాలని, తన సంపాదన చూసి మురిసిపోతూ ఆశ్చర్యపోవాలి అని ఎక్కడో మినుకు మినుకు మంటూ ఆశ ఉండేది. మాట్లాడకుండా కళ్ళ తోనే జవాబు చెబుతున్నట్టు ఉండే పద్మని చూస్తూ ఉంటే ఎందుకో తనకు ఎక్కడ లేని ద్వేషం పుట్టుకొస్తుంది.

రాజభవనం లాంటి ఇల్లు, విదేశాల నుంచి తెచ్చిన ఫర్నిచర్, చేయడానికి కావలసిన నౌకర్లు, చక్కగా స్థిరపడిన పిల్లలిద్దరూ.. ఇంకేం కావాలి తనకు అయినా పాత జీవితంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. ఒక్కసారిగా తన గత జీవితమంతా కళ్లముందు కదిలింది.

తను ఒక పల్లెనుంచి పై చదువుల కోసం తల్లిదండ్రులతో పాటు పట్నం వచ్చాడు. కష్టపడి చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం తెచ్చుకునే నాటికి ఒంటరివాడిగా మిగిలాడు.

తనకు తెలిసిన దూరపు బంధువులు చెప్పారని అని పద్మ మావయ్య తనను వెతుక్కుంటూ వచ్చాడు. తల్లిదండ్రులు లేని పిల్లని, పై చదువులు చదవలేదని, ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని తనకోసం వాళ్ళ అమ్మ ఇచ్చిన బంగారం కొద్దిపాటిగా ఉందని, కుందనపు బొమ్మలా ఉంటుందని చెప్పిన ఆఖరి మాట నచ్చడంతో వెళ్లి పిల్లని చూడడం, పెద్దగా తన తరపు బంధువులు ఎక్కువ ఎవరూ లేకపోవడంతో ఆ నెలలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయని పెళ్లి చేసుకుని పట్టణంలో ఒక గదిలో కాపురం పెట్టడంతో ఒక గృహస్థున్ని అయ్యాను.

నాలుగు సంవత్సరాలు గడవకముందే పద్మ బంగారాన్ని అమ్మి బిజినెస్ మొదపెట్టడంతో జీవితం మరో మలుపు తిరిగింది. 10 సంవత్సరాల తిరక్కుండానే పేరుమోసిన ధనవంతుల జాబితాలో చేరిపోయాను.

ఇంటి అలంకరణ విషయంలో పిల్లల చదువు విషయంలో తనదే అజమాయిషీ, అయినా కూడా పద్దులో ఎప్పుడు నేను అసంతృప్తిని చూడలేదు.

నాకు ఎక్కడా మనశ్శాంతి అనిపించేది కాదు. వచ్చిన ప్రతి వారు, పద్మ పెట్టుబడి కొండంత అయినట్టు, ఆ ఇంటి అలంకరణ చూసి పద్దుని మెచ్చుకోవడం, ఇంటి మహారాణి ఆమె అయినట్టు ప్రతి వారు ఆమెను పొగిడేవారే.

తనకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన నాపై కృతజ్ఞతాభావం తన కళ్ళల్లో కనిపించకపోవడం, తనలో కనిపించే సంతృప్తి నాలో అసూయను పెంచడం నాకు ఎనిమిదో వింతగా కనిపిస్తుంది.

పద్మ వెళ్లి రెండు రోజులైంది, తను కూడా ఆ వూరు వెళ్లి పద్మ ని తీసుకొని వస్తే బంధువుల మధ్య గొప్పగా ఉంటుంది అనిపించి, అప్పటికప్పుడు అర్ధరాత్రి ప్రయాణమయ్యాడు. పద్మ వాళ్ళ మామయ్య ఇల్లు చేరే సరికి మధ్యాహ్నం అయ్యింది.

తన పెళ్లప్పుడు చూసిందే వాళ్ళ ఇల్లు, అప్పటికి ఇప్పటికి స్థితిగతులు బాగానే మారాయి అనిపించింది. పద్మ కోసం నా చూపులు వెతుకుతున్నాయి గమనించిన పద్దు అత్తయ్య! పద్మ లేదు నాయనా నిన్న వాళ్ళ మామయ్యతో కలిసి తిమ్మాపురం పోయారు కాలేజీ పని మీద, అటునుంచే మీ ఊరికి బయలుదేరుతాది అని చెప్పింది.

ఏం చెబుతుందో అర్థం కాక ...
తిమ్మాపురమా అన్నాడు అయోమయంగా..

అవును నాయనా దేవిది కూడా మీ ఊరే. దేవి స్థితి బాలేక మా పంచ చేరింది కానీ ఆంది గతం తాలూకు నీలినీడలు గుర్తుకు తెచ్చుకుంటూ..

దేవి అంటే జమీందారు గారి అమ్మాయి అంటే పద్మా... అని నోరు తడారిపోవడంతో మాటలాపేశాడు ఈశ్వర్.

అంధకారం నుంచి ఎగిసిన వెలుగురేఖలా జమిందారి గారి అమ్మాయి గుర్తుకొచ్చింది. తనకు అప్పుడు పన్నెండేళ్ళుంటాయేమో మామిడి తోట కి వెళ్లి కాయలు కోసం రాయి విసిరాడు.

కాయ సంగతి ఏమో కాని అమ్మా! అని అరుపు, చిన్నగా ఏడుపు వినిపించింది. నేను వేసిన రాయి ఆమె చెవిని తాగుతూ వెళ్ళింది ఏమో, ఎర్రగా కమిలిన చెవిని పట్టుకుని ఏడుస్తోంది. తన ఏడుపు చూసి వచ్చిన జమిందారుని చూసి నా పై ప్రాణాలు పైనే పోయాయి.

దేవి ఏమైంది.. ఏమైంది అని లాలనగా అడిగాడు.
నన్ను చూపిస్తుంది ఏమో అని భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాను.

ఆ అమ్మాయి మాత్రం కొమ్మ తగిలింది నాన్నగారు అంది. ఆమాట విన్నాక మెల్లగా కళ్ళు విప్పి దేవతల మెరిసిపోతున్న అమ్మాయిగారిని మొదటిసారి చూశాను. మరోసారి కనిపించినప్పుడు ఆమె నా వంక వేలితో బెదిరిస్తూ.. నవ్వుతూ వెళ్ళిపోయింది. దేవి అన్న పేరు, ఆమె జ్ఞాపకం మనసులో చెక్కుచెదరలేదు.

దేవి చదువంతా ఇంట్లోనే అని, తనకు పాఠాలు చెప్పడానికి చాలామంది మాస్టర్లు వస్తారని ఎన్నో విదేశీ భాషలు వచ్చని బోలెడు పుస్తకాలు చదువుతుంది ఎన్నెన్నో కథలు కథలుగా వినేవాన్ని. నేను ఊరు వదలడానికి ముందు ఒకటి రెండు సార్లు చూశాను దూరం నుంచి.

ఆ తర్వాత అప్పుడప్పుడు ఒకటి రెండు విషయాలు తెలిసేవి. జమిందారు గారి ఆస్తి అంత కోర్టు కేసులో ఇరుక్కుందని, జమీందారు హఠాత్తుగా మరణించడంతో దేవి పై చదువుల కోసం దూర దేశాలకు వెళ్లిపోయిందని.

ఏమీ తెలియదు అని ఎద్దేవా చేసిన పద్దునే, దేవీ పద్మిని అని తెలిసినప్పటినుంచి ఈశ్వర్ కి మనసు మనసులో లేదు. ఎప్పుడు పద్దుని చూద్దామా.. కాదు కాదు అమ్మాయిగారిని చూద్దామా అని ఆగమేఘాల మీద బయల్దేరు పోయాడు.

ప్రయాణపు బడలిక తీర లేదేమో రోజు కంటే కాస్త ఆలస్యంగా మెలకువ వచ్చింది పద్మకి.. గభాల్న లేవబోతున్న పద్మకి, అమ్మాయి గారు కాఫీ అంటూ, కాఫీ కప్పు అందిస్తూ.. కొమ్మ గీసుకుందా అంటూ చెవిని సుతారంగా తాకుతున్న ఈశ్వర్ వంక చూస్తూ నువ్వా! అన్నట్టుగా ఆశ్చర్యంగా కనులు విప్పార్చింది పద్మ.. కాదు దేవీ పద్మిని.

నువ్వు దేవి పద్మిని అని ఎప్పుడూ చెప్పలేదే అన్నాడు ఆమెను ఆరాధనగా చూస్తూ...

నీ కలల రాణి దేవి పద్మిని .. నీకు తెలుసని నాకు తెలియదు కదా అంటూ గలగలా నవ్వుతూ కొత్తగా దరిచేరిన స్వేచ్ఛను చవి చూస్తూ ఈశ్వర్ చేతిలోని కాఫీ కప్పు అందుకుంది రాజసంతో దేవీ పద్మిని.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!