సమన్వయం

తనకు జ్వరంగా ఉన్నప్పుడు అమ్మ ఎప్పుడు తన పక్కనే ఉండమనేవాడు కానీ అమ్మ మాత్రం  పక్కన ఒక్కరోజు కూడా ఉండకుండా సాయంత్రం వచ్చేటప్పుడు తనకోసం బన్ను,బిస్కట్లు తెస్తానని  చెప్పి వెళ్ళేది.

ఇపుడు మాత్రం తనని  బయట అరుగు  మీదకు కూడా పోనివ్వకుండా, పక్కింటి  రాజుతో కూడా ఆడుకొనివ్వకుండా, పనికి పోకుండా ఇంట్లోనే ఉన్న అమ్మని చూస్తుంటే ఎనిమిదేళ్ళ రవికి కోపంగా ఉంది.

పొద్దున  అన్నం కూడా పెట్టకుండా  గంజి నీళ్ళు ఇచ్చింది. మధ్యాన్నం ఎప్పటిలాగా రెండు బన్ను ముక్కలు ఇవ్వగానే నేలపై విసిరి కొట్టి... 

 

"నువ్వేందుకు ఇంట్లో ఉన్నావు"

"నాకు జ్వరం రాలేదు కదా" అని గట్టిగా అరిచి వీధిలోకి పరిగెట్టబోయాడు.

దాంతో వాళ్ళ అమ్మ రెండు దెబ్బలు వేయడంతో ఏడుస్తూ, ఏమి తినకుండానే అలానే నిదురలోకి జారి పోయాడు.

 

సాయంత్రం వాణ్ని నెమ్మదిగా బుజ్జగిస్తూ ఎందుకురా.. ఇలా మొండి చేసి దెబ్బలు తింటావ్ ..

లేచి బన్ను తిందువు గాని అని బుజ్జగించింది.

 

చేతులతో చుట్టేసిన అమ్మని విదిలించుకుంటూ ....అమ్మా నీకు నేను అంటే ఇష్టం లేదా!

నాకు జ్వరం రాలేదు కదా ! నువ్వు ఇంట్లో ఉన్నావెందుకు?  

నాకు ఎందుకు రోజు బన్ను పెడుతున్నావు?  అని ఉక్రోషంగా అడిగాడు.

 

అమ్మ  చిన్నగా నవ్వుతూ... రవిని  దగ్గరకు తీసుకుని  బుజ్జగిస్తూ..

రవి నీకు జ్వరం వచ్చినప్పుడు నేను కూడా బన్ను తినేదాన్ని కదా! 

‘అవును’ అని చిన్నగా తల ఊపాడు రవి. 

ఎందుకో తెలుసా నీకు సూదిమందు  డబ్బుల కోసం.. 

 

ఊ.. మరి ఇపుడు జ్వరం ఎవరికి రాలేదు కదా

అమ్మ వంక చూస్తూ అడిగాడు రవి.

 

అమ్మ ఒక్క క్షణం ఆలోచించి అన్నది కదా!

మరి ఇప్పుడు దేశానికి అంటే ఆకాశానికి భూమికి  జ్వరం వచ్చింది.

దానికి జ్వరం తగ్గాలంటే అందరం ఇంట్లోనే ఉండాలి... ఇలా అమ్మ పెట్టింది తినాలి 

కొన్ని రోజులు అని చెప్పింది. అర్ధమైయిందా రవి... నెమ్మదిగా అడిగింది.

 

ఆశ్చర్యంతో రవి మొహం విప్పారింది..

నిజంగా!! ఒట్టు అన్నాడు చెయ్యి చాపుతూ, నిజం అన్నట్టు తల వూపుతూ తన చేయి వేసింది.

నేను ఇంకా అల్లరి చేయను. నువ్వు ఏమి పెడితే అదే తింటాను

అమ్మా! నీ కెన్ని తెలుసో సంబరంగా అన్నాడు అమ్మ చేయి పట్టుకొని..

ఆకలేస్తుందమ్మా అన్నాడు అమ్మ ఒడిలో ఒదిగిపోతూ చిన్నారి రవి పెద్దరికం చూపిస్తూ .....

 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!