గుణాఢ్యుడి బేతాళ కథలు

క్రీ.శ. 1వ శతాబ్ధిలో గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్కథ అనే పెద్ద కథా కావ్యం వ్రాశాడు. కాశ్మీరదేశ గాథననుసరించి పైశాచీప్రాకృతమున బృహత్కథను రచించిన గుణాఢ్యుడు, ఆంధ్రరాజస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు. బృహత్కథ అనే పెద్ద తానులో బేతాళ పంచవింశతి ఓ ముక్కగా చెప్పవచ్చు. పంచవింశతి అంటే ఇరవై అయిదు. ఇది మూలంలో బేతాళ కథల సంఖ్య.

బృహత్కథ రాసి ఇప్పటికి 2 వేల సంవత్సరాలు గడిచాయి. శతాబ్దాలు, సహస్రాబ్దాలు గడిచినా గుణాడ్యుడి బేతాళ కథల అందం చెక్కుచెదరలేదు. వందల ఏళ్లు గడిచినా ఈ కథల గుబాళింపు తగ్గనే లేదు. చందమామ పుణ్యమా అని బేతాళ కథలు అనగానే అవి పిల్లల కథలు అని చాలామందికి అనిపించవచ్చు. వాస్తవానికి బేతాళ కథలు పిల్లల కథలు కావు. ఒరిజనల్ బేతాళ కథల్లో చాలావరకు శృంగార కథలే అంటే ఆశ్చర్యం వేస్తుంది.

అయితే బేతాళ కథలు పేరుతో గత 55 ఏళ్లుగా బాలల మాసపత్రిక ‘చందమామ’ వందలాది కథలను అందిస్తూ వస్తున్నందవల్ల బేతాళ కథలు అంటే పిల్లల కథలుగానే చాలామందికి స్పురిస్తున్నాయి. నిజం చెప్పాలంటే బేతాళ కథలు మార్చి రాయాలని తీసుకున్న నిర్ణయం చందమామ చరిత్రనే ఓ కొత్త దశకు మళ్లించింది. ప్రపంచ చరిత్రలో ఏ పత్రికా సాధించలేనంత అద్బుత రికార్డును చందమామకు కట్టబెట్టినవి కూడా ఈ బేతాళ కథలే మరి.

జీవితంలో ఎన్నో చిక్కుముడులు ఉంటాయని ఎన్నో ధర్మసూత్రాలు ఎదురవుతాయని, వాటిని పరిష్కరించడానికి విచక్షణ, విజ్ఞత అవసరమని బేతాళ కథలు మనకి తెలియజేస్తాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఈ మూల కథల్లో లభించే పరిష్కారాలన్నింటితో మనం ఏకీభవించవలసిన అవసరం లేదు.

త్రివిక్రమాదిత్యుడు లేక తెలుగులో బాగా ప్రాచుర్యంలో ఉన్న విక్రమార్కుడి విచక్షణ సర్వకాల సర్వావస్థల్లోనూ చెల్లిపోతుంది అని ఎవరూ భావించనవసరం లేదు. బేతాళ కథలులో దేవుళ్లూ, దెయ్యాలూ, మాయలూ, మర్మాలూ అన్నీ ఉన్నాయి. బలులున్నాయి. చచ్చినవాడిని బతికించడాలు ఉన్నాయి. వీటిని పాఠకులు విమర్శనాత్మకంగానే పరిశీలించాలి. మనదైన విచక్షణతోనే వీటిని స్వీకరించాలి.

ఈ మూలకథలు రాసిననాటికి ఇప్పటికీ ఎన్నో శతాబ్దాలు గడిచాయి. జీవితంలో మంచి చెడుల విచక్షణలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. మనందరికీ తెలుసు. ఒకనాడు మంచి అనుకున్నది ఈనాడు కాకపోవచ్చు. ఈ కథల్లో ఉన్న ఒక సుగుణం ఏమిటంటే ఏ విషయంలో అయినా మంచిచెడులనూ, ధర్మాధర్మాలనూ, ఉచితానుచితాలనూ వేరు చేసి చూడాలంటే ఎంతో వివేచనా, ఎంతో తర్కశక్తీ అవసరమని మనకివి తెలియజేస్తాయి. అనుకున్న పని సాధించాలంటే ఎంతో ఓపికా పట్టుదలా అవసరమని చెబుతాయి. ప్రమాదాల బారినుంచి తప్పించుకోవాలంటే కేవలం ధైర్యం ఒక్కటే చాలదు. తెలివి కూడా కావాలని బేతాళ కథలు మనకు బోధిస్తాయి.

ఇరవై అయిదు భాగాలతో కూడిన బేతాళ మూల కథలు గతంలోనూ వావిళ్ల వారి ప్రచురణల కింద వచ్చాయి. ఈ మధ్య కూడా తెలుగులో బేతాళ కథలు, ఆధునిక బేతాళ కథలు పేరుతో పలు పుస్తకాలు వచ్చాయి. ఈ కోవలో వచ్చిన మరో పుస్తకం ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’. ఎన్ని సామ్రాజ్యాలు కూలినా, వ్యవస్థలు అంతర్ధానమైపోయినా, జీవన విలువలు క్రక్కదలి పోయినా, ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా  గుణాఢ్యుడి బేతాళ కథలకున్న పటుత్వం సడలలేదు. రెండు వేల సంవత్సరాలుగా కాలపరీక్షకు తట్టుకుని నిలబడిన గొప్ప కథలివి.

తెలుగు పాఠకలోకానికి అనువాద మాంత్రికుడు సహవాసి అందించిన చివరి పుస్తకం ఇది. సహవాసి తన జీవితం చివరి దశలో అందించిన అరుదైన అనుసృజన ఇది. ఈ కథలను చదువుతుంటే జబ్బుపడిన మనిషి రాసినట్లుగా పాఠకునికి తెలీదని, అదే సహవాసి విశేషమని ప్రచురణ కర్తలు చెప్పారు. ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’ ను పీకాక్ క్లాసిక్స్ వారు 2008లో ప్రచురించారు.

చందమామలో బేతాళ కథలను గత నాలుగైదు తరాలుగా చదువుతున్న పాఠకులు, అభిమానులు ఈ పుస్తకాన్ని గుండెలకు హత్తుకోవచ్చు. బేతాళ కథలు మొదటి భాగం ఎలా మొదలైంది, విక్రమాదిత్యుడు బేతాళుడు సంధించిన చిక్కుముడిని విప్పలేకపోయినప్పుడు ఏమి జరుగుతుంది అనేదే పెద్ద ఉత్కంఠ భరితమైన అంశం.

బేతాళ కథలు కధాసాహిత్య చరిత్రలో, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఎలా నిలిచిపోయాయో తెలుసుకోవాలంటే ‘గుణాఢ్యుడి బేతాళ కథలు’ కొని చదవండి. 135 పుటల ఈ అపురూప పుస్తకం వెల 50 రూపాయలు. ఇది విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ వంటి పుస్తకాల అంగళ్లవద్ద ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి.

ఇప్పటికే కొని ఉంటే సరి. లేకపోతే ఇప్పుడైనా ఈ పుస్తకాన్ని కొని చదవండి. సాహిత్య అభిమానులు, చందమామ ప్రియులు కూడా కలకాలం దాచుకుని భద్రపర్చుకోవాల్సిన గొప్ప పుస్తకం ఇప్పుడు చక్కటి అనువాదంతో మీముందు ఉంది మరి.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!