బియాండ్ కాఫీ....ఖదీర్ బాబు.. 'టాక్ టైం' కథ

 

బోర్ ఈ పదం వినని వాళ్లు ఎవరూ ఉండరు.. ఎపుడో ఒకప్పుడు ఎంతోకొంత సమయం దీని బారిన పడని వారు కద్దు.కొందరు కోరి తెచ్చుకునేవారైతే..మరికొందరు అరువు తెచ్చుకునేవారు.. ఇందులో చిన్న..పెద్ద.. స్త్రీ..పురుష భేదాలతో సంబంధం లేదు...
ఎవరు ఎలా నిరాశక్త సమయము నుండి బయట పడి ఉన్నతంగా ఉండగలరో..ఎందరు పాతాళానికి జారగలరో .. అది వారి వారి విజ్ఞత బట్టి...వారి మనోభావాల బట్టి..చుట్టూ ఉన్న మనుషుల బట్టి... ఉంటుందేమో....
ఈ అంశాన్ని ఆలంబనగా చేసుకుని ఖదీర్ బాబు వ్రాసిన కథ 'టాక్ టైం....'
ఒంటరితనంతో నరకాన్ననుభవించే ఓ ధనిక కుటుంబ స్త్రీ ఆ 'బోర్' నుండి తప్పించుకోవడానికి అపరిచిత పురుషులకు ఫోన్ చేసి విసిగించే వైనం టాక్ టైం కథలో చూడవచ్చు.  An idle mind is devil's workshop అనే నానుడికి ఈ కథ ఒక ఉదాహరణ.
ప్రముఖ యువరచయిత మహమ్మద్ ఖదీర్‌బాబు రచించిన (ఆస్తి,ఘటన,టాక్ టైం,వహీద్, మచ్చ, ఏకాభిప్రాయం,పట్టాయ.ఇంకోవైపు.అపస్మారకం,బియాండ్ కాఫీ)10 కథల పుస్తకం.. బియాండ్ కాఫీ....

బియాండ్ కాఫీ....ఖదీర్ బాబు.. 'టాక్ టైం' కథ మీకోసం...

దూరంగా ఆమె రావటాన్ని చూసి, బంకులో ఉన్న కుర్రాడు, తన ఎదురుగా ఉన్న నాలుగైదు సెల్ ఫోన్లలో ఒక దానిని తీసుకొని టకటకా ఏదో నొక్కాడు.
ఆమె- ఎండకు నుదురు మీద చేయి అడ్డు పెట్టుకొని వస్తుండడాన్ని చూస్తూ- మళ్లీ సెల్ వైపు చూస్తూ ఉండే సరికే బీప్ వచ్చింది.
ఆమె కూడా వచ్చింది.
'చెసేశానక్కా' అన్నాడు.
'ఓ' అని ఆమె నవ్వింది.
చేతిలో ఉన్న డబ్బు అతనికి ఇస్తే టక్కున చిల్లర తీసి ఇచ్చాడు.
'టూ ట్వంటీ టూయేగా'
'అవునక్కా'
ఆమె తలాడించి అక్కణ్ణుంచి కదిలింది.ఆ కుర్రాడు ఆమెనే చూస్తూ ఉన్నాడు.మల్లీ వారం దాక ఆమె ఆ బంకు వైపు రాదు. కాని ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకో రెండు మూడు రీచార్జ్ సెంటర్లకు వెళుతుంది.ఈ లోపు ఒకేచోట  అన్నిసార్లు రీచార్జ్ చేయడం ఆమెకు నచ్చదు. ఆమె మిగిలిన చోట్ల ఆ పని చేస్తుందని ఆ కుర్రాడికి తెలుసు.
ఆమె- అక్కడకు రెండు మూడు ఫర్లాంగుల దూరంలో ఉన్న ఆమె ఫ్లాట్ చేరి-డోర్ ముందు మడత పడి ఉన్న మేట్ ను సరి చెసి- డోర్ తీసి లోపలికి వెళ్లి ఫ్యాన్ వేసింది. టివి చూడాలనిపించలేదు. ఆకలిగా ఉంది. కాని తినాలనిపించలేదు. చీర వదిలి నైటీ వేసుకోవాలనిపించింది.
ఫ్రిజ్ దాకా వెళ్లి డోర్ తెరిచి బాటిల్ తీసి తాగకుందా మళ్లీ పెట్టేసింది.
కర్టెన్లు నీట్ గా ఉన్నాయి. ఫ్లొర్ నీట్ గా ఉంది. దుప్పట్లు చాలా, కేన్ సెట్ ఆమెకు నచ్చిందో లేదో చెప్పలేముగానీ దానిని కూడా ఆమె చాలా నీట్ గానే ఉంచుతుంది. ఎక్కువ మందం లేని లైట్ బ్లూ కలర్ కుషన్స్ వాటితో.
టైం చూసుకుంది. బయట బాగా ఎండ ఉందని కాకి ఒకటి అరచి చెప్తూ ఉంది. పెళ్లయినప్పటి నుంచి ఇలా ఒకే కాకి తన వెంటబడి ఈ సంగతి చెప్తూ ఉందా అని అనిపించింది. ఎందుకంటే- పెళ్లయ్యాక ఆమెకు అలాంటి కాకుల శబ్దాలు తప్ప వేరేవి వినే చోటులో ఉండే భాగ్యం దక్కలేదు.
ఆమె భర్తకు అదేదో ఉద్యోగం. దాని లక్షణం ఏమిటంటే ఊరికి దూరంగా వాళ్ల సంస్థ తాలూకు టౌన్ షిప్ ఉంటుంది. అందులో ఉండాలి నివాసం. ఒకే లాంటి బిల్డింగులు. ఒకేలాంటి  బయటి గోడలు. ఒకే లాంటి పార్కింగ్. ఒకేలాంటి కాకి. ఏ బ్రాంచ్ కు ట్రాన్స్ఫర్ అయినా  అంతే.
కావ్... కావ్...
భర్త వచ్చే టైం అది. తనకూ కాకికీ ఇద్దరికీ తెలుసు.
బెల్ మోగింది. భర్త వచ్చాడు. సాధారణంగా ఇంటికీ ఆఫీసుకూ కిలోమీటరు దూరమే ఉంటుంది, అతడికి కారు ఉంది. తీసేం లాభం? ఆక్టివా ఉంది. అదీ దండగే. నడిచి వెళ్లి నడిచి వస్తాడు. మళ్లీ  నడిచి వెళ్తాడు.సాయంత్రం ఫ్రెండ్స్ తో బయటకు పోతాడు. కాని పది లోపల ఇల్లు చేరడనికి లోపం రానివ్వడు. ఆమెతో కలిసి తినడానికి తప్పకుండా ప్రయత్నిస్తాడు.
'నువ్వు తిన్నావా'
'మీరు రాందే'
'కాని మరీ'
ఆమె డైనింగ్ టేబుల్ మీదకు అన్నీ తెచ్చి పెట్టింది. శుభ్రమైన పాత్రల్లో పాలకూర పప్పు చేసింది. కొంచెం బఠాణి కూరా . పాలుబోసి చేసిన బీరకాయ కూర- రాత్రిదే- కాని ఈ మధ్యాహ్నానికే పాడవదు కదా... ఇంక ఆవకాయ...పొడులు...చల్ల మిరప కాయలు...పెరుగు...
'నువ్వు తినూ'
'ఆకలిగా లెదు. మీరెళాక...'
'ఈ మధ్య ఇలాగే అంటున్నావు నువ్వూ'
నవ్వింది.
'అసలు తింటున్నావా లేదా'
'అయ్యో.. మీరేమిటండీ.. తినకుండానేనా ఇలా వళ్లు చేశాను.'
చూశాడు. పరిపూర్ణంగా ఉంది.
'ఊ...' అన్నాడు.
'ఊ...' అంది.
'ఇంకేమిటి సంగతులు'
'ఏముంటాయండీ'
'టీవీ అన్నా పెట్టుకో'
'సరే'
భోంచేసి ఒక పది నిమిషాలు కునుకేసే టైమైతే ఉంటుందతనికి.పెళ్లయిన కొత్తళ్లో పదిహేను ఇరవై నిమిషాల వరకూ స్వతంత్రంగా ఆ టైము తీసుకునేవాడు. అప్పుడు ఆమె కూడా అతని పక్కన ఉండేది. కాళ్లు పట్టేది. అతడు నిద్రపోకుండా మెలకువగానే ఉండి వెళ్లేవాడు.
ఇప్పుడు అదేమి లేదు. పై ఆఫీసర్ అయ్యాడు కదా. వెళ్లాలి.
'తలుపేసుకో'
'సరే'
వెళ్లిపోయాడన్నట్లుగా కాకి కావ్ కావ్ మంది.
ఆమె తలుపు వేసింది. చీర విప్పి మంచం మీద వేసి కాసేపు అటూ ఇటూ నడిచింది. అలాగే ఉందామా అనుకొని, ఆగి నైటీ తొడుక్కుంది. సెల్ అందుకుంది. హాల్ తలుపు వేసి బెడ్  రూం లోకి వచ్చి దిండు మీద తల పెట్టి వెల్లికిలా పడుకుంది.సెల్ నొక్కింది. చెవి దగ్గర పెట్టుకుంది. మోగుతుంది. ఎడమ పాదం బొటనవేలిని కుడిపాదం బొటనవేలితో నొక్కుతుంది. ఎత్తలేదు.ఒక్కనిమిషం కూడా వ్యవధి ఇవ్వకుండా మళ్లీ చేసింది.మోగుతుంది. ఎత్తలేదు.అరనిమిషం కూడా వ్యవధి ఇవ్వకుండా మళ్లీ చేసింది. మోగుతుంది. ఎత్తలేదు. పావు నిమిషం కూడా వ్యవధి ఇవ్వకుండా మళ్లీ చేసింది.మోగుతుంది. ఎత్తాడు.
'రాక్షసీ'...బొబ్బరించాడు.
'ఎందుకు చేస్తున్నావే లం ...'
'మీరు గుర్తొచ్చారూ'
'ఎందుకు పీక్కుతింటున్నావే నన్నూ'
'మీరు గుర్తొచ్చారంతే'
'నిన్నూ... లం...'
హటాత్తుగా ఏడ్వడం మొదలుపెట్టింది.
'మీరు లేకుండా నేను బతకలేను... అయినా ఏం అడిగాను మిమ్మల్ని... కాస్త మాట్లాడండీ'
'నన్ను వదిలిపెట్టవే రాక్షసీ'....
'అయ్యో...నేనేమన్నానని ఇప్పుడు...నేనేమన్నాననీ...' ఏడుస్తొంది.
'నిన్ను చంపేస్తా'
'చంపేయండీ. చచ్చిపోతా. మీ చేతుల్లోనే చచ్చిపోతా. వద్దన్నానా. మాట్లాడండీ నాతో. అప్పుడు మాటడారే. ఆ మాటలు. అవి కాకపోతే ఏదో ఒకటి. మాట్లాడండీ'...
అవతల- వలలో చిక్కిన కౄరజంతువు పూర్తిగా బెదిరిపోయినట్టు- గస పెడుతున్నాడు.
'నన్ను వదిలిపెట్టవే. నీకు దండం పెడతాను....' ఏడుస్తున్నాడు.
మౌనంగా ఉంది. కట్ చేశాడు.
సరిగ్గా పావు సెకన్ కూడా వ్యవధి ఇవ్వకుండానే మళ్లీ చేసింది. మోగుతోంది.మోగుతోంది.మోగుతోంది.
హఠాత్తుగా ఆమె అందుక్కూడా సిద్ధంగా ఉన్నట్టుగా టక్కున చెవి దగ్గరి నుంచి సెల్ పక్కకు తీసింది. లేకుంటే చప్పుడుకి కొంచెం ఇబ్బంది అయ్యేది. అవతలి వైపు ఏదో బలమైన వస్తువుతో ఆ సెల్ ను బాదినట్టున్నాడతడు. సెల్ పిండి పిండి అయి ఉండాలి. ఆ సిమ్ ఇంక పనికి రాదు.
సెల్ ని కింద పెదవి మీద పదే పదే తడుతూ ఆలోచిస్తూ ఉండి పొయింది.
కావ్ కావ్...కావ్ కావ్...
అయ్యిందా వాడి పని అన్నట్టు కాకి అరుస్తూ ఉంది.
రెండు నిమిషాలు. తర్వాత మళ్లీ చేసింది. స్విచ్ డాఫ్ వస్తోంది. కాని తను ఊరికే ఉండదు. ఒకవేళ సిమ్ పనికి వచ్చి అతడు ఇంకో సెల్ లో దానిని వేస్తే? మెసెజ్ బాక్స్ లోకి వెళ్లి మెసెజ్ టైప్ చేసింది.
'ఐ వాంట్ టు డై. వితవుట్ యు ఐ కాంట్ లివ్. ఇఫ్ యు డోంట్ టాక్ టు మి... ఐ విల్ కమిట్ సూసైడ్'...
ఆ మెసెజ్ సెండ్ కొట్టాక ఆమెకు కొంచెం ఆకలి అయ్యింది. కొంచెం ఏమి బాగానే ఆకలయ్యింది.వెళ్లి ప్లేట్ లో అన్నీ పెట్టుకుని టివి ఆన్ చేసి చూస్తూ తింది. సింక్ లో ప్లేట్ పడేశాక నాప్ కీన్ తో చేతులు తుడుచుకొని సెల్ అందుకుంది. ఈ టైం లో... సరే... ఏ టైం లో మాట్లడింది కనుక. నంబర్ ప్రెస్ చేసింది. మోగుతుంది.మోగుతుంది.మోగుతోంది .
'అమ్మా'
'ఎంతసేపే?'
'ఏం...ఆగలేవా?'
'భోం చేశావా?'
'ఊ'
'క్లాసుల్లేవా?'
'ఎగ్గొట్టా'
'ఏం?'
'చెప్తే నీకేం అర్ధమవుతుందే?'
'గూబ పగులుద్ధీ
'సరే...ఉంటా'
'ఏమైనా మాట్లాడవే'
'ఫ్రెండ్స్ ఉన్నారు... సాయంత్రం బయటకెళ్లాలి... ఇంకా పన్లున్నాయ్'
'మాట్లాదవే దొంగమొకందానా'
'ఇంక పెట్టెయమ్మా'
'జాగ్రత్తే చిట్టితల్లీ
పెట్టేసింది.
మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకూ అంటే అదో నరకం లాంటి సమయం చదువు పూర్తయ్యాక- పెళ్లికి ముందు- రెండేళ్లు పడి ఉంది ఇంట్లో.అప్పుడు కూడా ఇలాగే మూడు నుంచి ఐదు వరకూ  నరకం. ఏం తోయదు.
'ఏమిటే నీ అపసోపాలు.. ఏదైనా పుస్తకం చదువుకో' అనేది అమ్మ.
'మా రోజుల్లో ఇవన్నీ ఎరగం.వేళెక్కడిదనీ. మీ నాన్నా మీ పెదనాన్నా మీ చిన్నాన్నా పదీ పన్నెండు మంది పిల్లలు...మీ నానమ్మ తాతయ్యా..గోల. పొయ్యి మీద ఎక్కే దబర దిగే దబర. అన్నాలు తిని చేతులు కడుక్కుంటామా మళ్లీ సాయంత్రం వంటకు పనులు.ఈ లోపు చిమ్ముకోవడం కళ్లాపి చల్లుకోవడం పిల్లలకు స్నానాలు బట్టలు ఆరేసుకోవడం...అందరు బంధువులూ ఒకే ఊళ్లో ఉండటమాయె. ఎంత దూరమని? నాలుగడుగులు. ఎవరో ఒకరు వస్తారు. ఏదో ఒక రామాయణం ఎత్తుతారు. పలానామె చేసిన రాద్దాంతం గుర్తుకు తెచ్చి అప్పుడెంత మనసు కష్టపెట్టుకున్నామొ చెప్తారు.లేకుంటే నవ్వుకుంటారు. చేయవలసిన పెళ్లిళ్లు...దాచవలసిన డబ్బు...పొలం పనులు...కట్టెలదొక గొడవ...గొడ్ల సంగతి సరేసరి...మీరు కొంచెం పెద్దయ్యారు పర్లేదనుకుంటే మీ బాబాయి పిల్లలు...కేర్ కేర్ మని ఒకటే గోల. కాని పిల్లలుంటే అదో కళలే.
అప్పటికే వెళ్లి మంచం మీద బోర్ల పడుకొని...మందంగా...ఏం తోచక...
టివి స్టాండ్ కింద పేపర్లు పెట్టడం ఆమెకు నచ్చదు. డబ్బునైనా నిర్లక్ష్యంగా పడేస్తుందిగాని పేపర్లు మాత్రం జాగ్రత్తగా పెడుతుంది. ఆదివారం పత్రికలూ... వీక్లీలూ...
ఫ్యాను వేసుకొని ఒక్కోక్కటి తీసి తిరగేస్తూ కూచుంది. తిరగేస్తూ...తిరగేస్తూ... ఒకచోట ఆగింది. పక్కనే ఉన్న ఫోన్ అందుకుని అక్కడ ఉన్న నంబర్ ని చూస్తూ జాగ్రత్తగా డయల్ చేసింది. మోగుతోంది..మోగుతోంది..మోగుతోంది..
'కావ్ కావ్..కావ్ కావ్ ' కాకి మొత్తుకుంటూ ఉంది.
'హలో' గొంతును ఎంతో వినయంగా మార్చింది.
'సార్..నమస్తే సార్ '
'ఎవరమ్మా'
'పేపర్ లో మీ ఫొటో చూశాను సార్. ఒక్క నిమిషమే'
'అయ్యో..దాందేముందమ్మా'
'సార్..మీతో మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది సార్. ఇది కలా నిజమా తెలియకుండా ఉంది సాఋ
'ఎక్కణ్ణుంచి?'
చెప్పింది.
'పేరు?'
చెప్పింది.
'మీ గొంతు బాగుందమ్మా'
'అయ్యో నిజమా సాఋ
'నిజమమ్మా'
'థ్యాంక్యూ సార్. చాలా థ్యాంక్యూ సార్ '
'ఏం చేస్తుంటారు?'
'హౌస్ వైఫ్ ని సార్ ఇద్దరు పిల్లలు. అమ్మాయి ఫస్ట్ ఇంజనీరింగ్. అబ్బాయి ఫస్ట్ ఇంటర్ '
'ఓ'
'సార్. మీతో అప్పుడప్పుడు మాట్లాడొచ్చా సార్ '
'దాందేముందమ్మా'
'భోజనం అయ్యిందా సార్?'
'లేదు పనిలో పడి '
'అయ్యో. మీరు మా ఊళ్లో ఉంటే ఎంత బాగుండు సార్. నేనే పెట్టుండేదాన్ని కదా '
'ఆ '
'మీలాంటి వాళ్లకు నాలుగు ముద్దలు పెట్టే భాగ్యం కంటే ఏం కావాలి సార్ '
'ఊ'
'నా దురదృష్టం మండిపోను. మీరు మా ఊళ్లోనే ఉంటే ఒళ్లో కూచోబెట్టుకునే నాలుగు ముద్దలు తినిపిద్దును కదా సార్ '
అటువైపు గొంతు నెమ్మదించింది. ఆమె గొంతు కూడా నెమ్మదించింది.
కావ్ కావ్.. కావ్ కావ్...
నేల మీద సోఫాకు వీపు ఆనించి కాళ్లు చాపుకొని మాట్లాడుతూ ఉంది. ఎడమకాలి బొటనవేలిని కుడికాలి బొటనవేలు నొక్కుతూ ఉంది.మరికాసేపటికి ఆమె గొంతు ఇంకా నెమ్మదించింది. అటువైపు తెలీదు. ఆమె ముఖం ఎర్రబడింది. బొటనవేలి మీద బొటనవేలు.
ఫోన్ కట్టయ్యింది.
లేచింది.
స్నానం చేయాలనిపించింది. కాని వాకింగ్ చేస్తే మళ్లీ స్నానం చేయాలి.చుడీదార్ వేసుకుంది. దోర్ ను లాక్ చేసి మెట్లు దిగుతూ ఉంటే దూరం నుంచి కొడుకు వస్తూ కనిపించాడు. ఆగింది. తాళం తీసుకున్నాడు.
'ఏదైనా తిను '
'ఊ'
'బట్టలు  మార్చుకో ముందు '
'ఊ '
'బట్టలు మార్చుకో ముందు '
'ఊ '
వీడు ఊలు కొట్టడం తప్ప ఏదైనా మాట్లాడి చాలా కాలం అవుతోంది.ఉదయం ఐదింటికి లేచి వెళతాడు. కాలేజీ. మళ్లీ కోచింగు, వచ్చాక చదువు. ఫేస్ బుక్,మొబైల్, ఫోన్లు.
'అమ్మా అన్నం '
'అమ్మా బట్టలు '
'అమ్మా డబ్బులు '
ఈ మూడు మాటలు మాట్లాడుతాడు. వాడి గది వాడికి ఉంది. ల్యాప్ టాప్, నెట్, ఎప్పుడైనా వెళ్లాలంటే కొట్టి వెళ్లాలి.పిల్లలకు సంబంధించి తనకు ఇలాంటి దశ ఒకటి వస్తుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. చిన్నప్పుడు పిల్లలిద్దరూ తనను క్షణం కూడా వదిలి ఉండేవాళ్లు కాదు. ఒళ్లో ఒకరు భుజాల మీద ఒకరు. వంటగదిలో ఉంటే వంటగదిలో. స్నానం చేస్తుంటే తలుపు బయట. కదలనిస్తేనా.  ప్రతిదీ అడగడమే. ప్రతిదానికీ సాయం పొందడమే. ప్రతిదీ చెప్పడమే. అప్పుడు అన్నీ ఆమెకు అర్థమయ్యేవి.అప్పుడు అన్నీ ఆమెకు తెలిసేవి. ఇప్పుడు ఏమడిగినా నీకు తెలీదులే అంటున్నారు ఇద్దరూ.
నడక మొదలెట్టింది.
రోడ్డు మీదకు వెళ్లక్కర్లేదు.
టౌన్ షిప్ లోనే ఇంటర్నల్ గా ఒక రౌండ్ వేస్తే మూడు కిలోమీటర్లు.
నడుస్తూ ఉంది కాకి ఎటుపోయిందో పోయింది. ఎస్ బ్లాక్ ఆమె ఎదురుపడింది. రోజూ వాళ్లిద్దరూ వాకింగ్ లో కలుస్తారు. ఏం మాట్లాడుకోరు. పక్కపక్కన నడుస్తారు. ఆమె గురించి ఈమెకు ఈమె గురించి ఆమెకు కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు.
'వంట ఏం చేశారు?'
'ఇవాళ ఎండ కొంచెం తక్కువ '
అంతకు మించి లేదు.
వాకింగ్ ముగించుకొని వస్తుంటే వాడు స్నానం చేసి బట్టలు మార్చుకొని ఎక్కడికో వెళుతున్నాడు. తాళం ఇచ్చాడు.
'ఎక్కడికి రా?'
'వస్తాలే '
వెళ్లిపోయాడు. పూర్తిగా చీకటి పడిపోయింది. ఆమె ఇంట్లోకి వెళ్లి షవర్ బాత్ చేసింది చాలా సేపు. స్నానం చేశాక మెడ మీద, బుగ్గలకు పౌడర్ అద్దుకుంది. చలువ చేసిన బట్టలు తొడుక్కుంది. తల దువ్వుకుంది. పువ్వులు పెట్టుకుంది. శుభ్రంగా తాజాగా  తయారయ్యింది.
ఫోన్ తీసుకుంది. ఇందాకటి నంబర్. జాగ్రత్తగా ప్రెస్ చేసింది. మోగుతోంది, మోగుతోంది. మోగుతోంది.
'ఏంటి?'
'ఊరికే చేశాను సార్. గుర్తొచ్చారనీ. ఆఫీసులోనే ఉన్నారా... ఇంటికి వెళ్లి పోయారా?'
'అలా చేయొద్దు ఎప్పుడు పడితే అప్పుడూ
'సారీ సార్.. మిమ్మల్ని డిస్టర్బ్ చేయను సార్ '
పెట్టేశాడు.
టీ పెట్టుకొని తాగాలనిపించి వంటగదిలోకి వెళ్లింది.మోడ్రన్ కిచెన్. చిమ్నీ నాలుగు బర్నర్ ల స్టౌ ఉడ్ వర్క్ చేసిన కప్ బోర్డులో  ఏం కావాలంటే అది. చిన్నప్పుడు వాళ్ల అమ్మ ఇలాంటి వంట గది ఎప్పుడూ చూళ్లేదు. ఊదురు గొట్టంలో ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ చీటికి మాటికి దినుసుల కోసం వెతుక్కుంటూ ఉండేది. ఒకోసారి ఉండేవి. ఒకోసారి లేక.
'ఎందుకు మా నాన్న అన్నీ తెచ్చి పడేయడు.'
'అన్నీ ఉండడం కూడా శిక్షేనా  '
అమ్మకు చిన్ని చిన్ని ఆశలు ఉండేవి. గులాబి మొగ్గల బంగారు గాజులు. ఆమె వాటి కోసం దాదాపు పదేళ్లు ఎదురు చూసింది. చిన్ని కోరికలతో నిజానికి దాని కోసమే బతికిందో ఏమో ఇవాళ తన దగ్గర డబ్బుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. కాని ఆసక్తి ఉంటే కదా -
టీ అయిపోయింది.
వీడు రాడు.
ఆయన రావడానికి టైం ఉంది.
మూడు బెడ్రూం ల ఫ్లాట్ పెద్ద హాల్ రెండు బాల్కనీలు. ఒక కారు పట్టేంత కారిడార్. మొక్కలు. బట్టలు.డబ్బులు సరుకులు.ఫోన్లు, కంప్యూటర్లు. ఒక్కతే మనిషి.
ఫోన్ తేసింది.. ఇందాకటి నంబరే. జాగ్రత్తగా ప్రెస్స్ చేసింది.మోగుతోంది.మోగుతోంది.మోగుతోంది.
'యూ.. స్టుపిడ్ చేయొద్దన్నానా?'
'సారీ సార్ గుర్తుకొస్తున్నారు. ఇల్లు చేరుకున్నారా? ఏమైనా మాట్లాడండి సార్ '
అవతల వైపు ఒకటి రెండు నిమిషాలు సైలెంట్ అయిపోయాడు.
'ఇప్పుడే స్నానం చేసాను సార్. ఎంత బాగుందో. మీరే గుర్తొచ్చారు. అయ్యో... మా ఊళ్లో ఉంటే నేనే వీపు రుద్ది స్నానం చేయిద్దును కదా...' నిలబడే మాట్లాడుతూ ఉంది. బొతనవేలి మీద బొటనవేలు.
'యూ... ఇడియట్ ఇంకొక్కసారి చేశావంటే పోలీసులకు పట్టిస్తాను '
సడన్ గా ఏడుపు మొదలెట్టింది.
'ప్లీజ్ సార్... అంత పని చేయకండి సార్. నేను మీరు లేకుండా బతకలేను. మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే చేస్తాను. రోజుకు ఒక్కసారి సరేనా? సారీ సర్ . వెరీ వెరీ సారీ. బై సర్ గుడ్ నైట్.
'ఊ '
పెట్టేసింది.
టివిలో ఏదో ప్రోగ్రాం వస్తోంది. యాంకర్ ఏదో చాలా వాగుతోంది. కాని ఒక్కమాటా తనకు సంబంధం లేదు. చూడలేక కాసేపు అవస్థ పడింది. ఇంట్లో మాట్లాడ్డానికి మనిషి ఉంటే బాగుండు అని ఒకసారి పనిపిల్లను తెచ్చి పెట్టుకుంది.కాని దానిని ఇరుగు పొరుగూ నుంచి కాపాడ్డానికి చచ్చే చావు వచ్చింది. ఆ పిల్లకు కూడా కాలు కుదురుగా ఉండేది కాదు. వయసొచ్చిన పిల్ల. ఇంట్లో ఎంతసేపని ఉంటుంది? పొతానంది. పో అని పంపించింది.
వాడొచ్చాడు. ఫోన్ మాట్లాడుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు.
మరి కాసేపటికి ఆయన.
'ఏంటి అప్పుడే?'
'అలసటగా ఉంది '
'రెండ్రోజులు లీవ్ పెట్టమంటే వినరు కదా'
'ఎలా పెడ్తాం. ఆఫీసులా అవి. మొసళ్ల మడుగులు. ఏమరుపాటుగా ఉంటే అయిపోతాం. ప్రమోషన్లు రానక్కర్లేదా? అందరూ ఒళ్లు హూనం చేసుకుంటున్నారు కెరీర్ కోసం. మనమంటే మన అమ్మానాన్నలు ఏమిచ్చారో అది తీసుకున్నాం. ఇప్పుడు పిల్లలే వాళ్లకు ఏం కావాలో ఫోర్స్ చేస్తున్నారు. రేపు దాని పెళ్లి. అదెంతవుతుందో. వీడు అది కావాలి ఇది కావాలని ఏమడుగుతాడో. మంచి సినిమా చూసి ఎంతకాలం అవుతుందో చెప్పూ
'తిరుగుతూనే ఉన్నారు కదండీ '
'ఏం తిరుగుతున్నాను? కాసేపు ఫెండ్స్ తో మందు. అది కూదా చేయకపోతే బతకను. లిమిట్స్ దాటడం చూశావా ఎప్పుడైనా?'
'భోజనం పెట్టేదా?'
'నువ్వూ '
'ముందు మీరు తినండి '
'వద్దు. స్నానం చేసి పడుకుంటాను. కాసింత మజ్జిగ ఇవ్వు చాలు '
'సరే'
స్నానం చేసి, ఏసి ఆన్ చేసుకున్నాడు. మజ్జిగ ఇచ్చింది. తాగాడు.
'గుడ్ నైట్ '
పడుకున్నాడు.
ఆమె అతణ్ణే చూసి డోర్ ముందరకు వేసి హాల్లోకి వచ్చింది.
ఆయన గదిలో నుంచి చడీ చప్పుడు లేదు. వాడి గదిలో నుంచి కూడా.ఎప్పుడు వచ్చి తింటాడో. ఇప్పటికే ఏదైనా తినేసి వచ్చాడో.
కూచుని కాసేపు ఆలోచించింది. భర్తకు ఇంక ఒకటి రెండు ట్రాన్స్ ఫర్లు మిగిలాయి. అవి కూడా ఇలాగే. ఫ్లాట్ కాకపొతే ఈసారి డ్యూప్లే. లేదంటే బంగ్లా. ఇలాగే ఊరికి దూరంగా టౌన్ షిప్. ఈ మధ్య హైద్రాబాద్ లో విల్లా ఒకటి తీసుకుందామని అనుకున్నాడు. రిటైర్ అయ్యాక ఉండటానికి. ఇలాగే. ఊరికి దూరంగా. ప్రశాంతంగా. గేటెడ్ కమ్యూనిటీ అట. సెక్యూరిటీ.ప్రైవసీ.  అనుమతి లేకుండా ఎవరింటికీ ఎవరూ రారు. ఎవరింటికీ ఎవరూ పోరు. తన మరణం ఎలా ఉండబోతోందో ఊహించింది. ఇలాంటి ఇళ్లలోనే ప్రశాంతంగా ఎవరి అంతరాయం లేకుండా.
టైం చూసింది.
తొమ్మిదిన్నర.
ఈ మధ్య నిద్ర ఎగిరిపోయింది. ఎప్పటికి పట్టాలి. ఎప్పుడు నిద్రపోవాలి.
ఫోన్ అందుకుంది. ఇందాకటి నంబరే. జాగ్రత్తగా ప్రెస్ చేసింది. మోగుతోంది. మోగుతోంది.మోగుతోంది. ఎత్తలా. ఒక్క నిమిషం వ్యవధి ఇచ్చి మళ్లీ చేసింది.మోగుతోంది.మోగుతోంది.మోగుతోంది.ఎత్తలా. అర నిమిషం వ్యవధి ఇచ్చి మళ్లీ చేసింది. మోగుతోంది. మోగుతోంది. మోగుతోంది. ఎత్తలా. పావు  నిమిషం వ్యవధి ఇచ్చి...
' ఎందుకు చేస్తున్నావే?' దిక్కులు పిక్కటిల్లాయి.
పిల్లి కంటే మెత్తగా, కుక్క కంటే వినయంగా, ఎలుక కంటే బెదురుపాటుగా మాట్లాడింది.
'సారీ సార్. గుర్తుకొస్థుంటే చేసాను సార్. డిస్టర్బ్ చేశానా సార్. డిన్నర్ అయ్యిందా? అయ్యో... మీరు మా ఊళ్లోనే ఉండి ఉంటే మీకు అన్నం పెట్టి, సేవ చేసి, మీ కాళ్లు నొక్కి... మీరు కబుర్లు చెబుతుంటే చాలా బాగుంటుంది సార్. కాసేపు కబుర్లు చెప్దామనే తప్ప నాకు వేరే ఉద్దేశం'.... బొటనవేలి మీద బొటనవేలు నొక్కుతూ ఉండగా...
అవతలి వైపు టపాకాయ పేలినట్టయ్యింది.
ఆమె చాలా అలెర్ట్ గా చెవి దగ్గరి నుంచి ఫోన్ తీసేసింది.
ఇంక ఆ ఫోన్ పనికి రాదు. విసిరి కొట్టాడు. సిమ్- చెప్పలేము.
ఆమెకు ఆకలేసింది. కొంచెం తిన్నంత పని చేసింది. ఇలాంటి టైములో మరీ నిద్ర పట్టకపోతే వాడొచ్చు అని డాక్టర్ టాబ్లెట్ రాసిచ్చింది. అది వేసుకుంటే నిద్ర వస్తుంది. కాని- దానిని దాదాపు రోజూ వాడుతోంది.
లేచి టాబ్లెట్ వేసుకుంది.
అరగంట గడిచింది.
ఇంట్లో దీపాలన్నీ ఆరిపోయాయి.
వాడి బెడ్ రూం. ఆయన బెడ్ రూం. తన బెడ్ రూం.
చాలా సేపు మంచం మీద దొర్లింది. సరే, ఏమో చెప్పలేము కదా అని- ఇందాకటి నంవర్ కే జాగ్రత్తగా ట్రై చేసింది. మోగలా. స్విచ్ డాఫ్ వస్తోంది.
ఎందుకు వదలడం? ఎస్ఎంఎస్ పెట్టింది.
ఇఫ్ యు డోంట్ టాక్ టు మి... ఐ విల్ కమిట్ సూసైడ్'..
సెండ్ నొక్కింది నిద్రపోయింది.
ఉదయం చెప్పక్కర్లేదు. క్రమశిక్షన కలిగిన సైనికుల్లా ముగ్గురూ పని చేస్తారు. ఆమె టిఫిన్ చేస్తుంది. వాళ్లిద్దరూ తినేస్తారు. వాడు కాలేజీకి. అతడు ఆఫీసుకు. మరి కాసేపటి తర్వాత అమె కూడా తయారవుతుంది. నిన్నటి ఫోన్ కొన్ని రోజుల పాటు వాడదు. తనకు ఇంకో నంబర్ ఉంది.
అది తీసుకొని ఆక్టివా వేసుకొని బజారుకి వెళ్తుంది.
దూరంగా ఈమెను చూసిన కుర్రాడు చకచకా సెల్ నొక్కి రీచార్జ్ చేస్తాడు.
ఇంటికి తిరిగి వచ్చి- ఇంటి ముందు బోర్లా పడి ఉన్న చెప్పుల జతను సరి చేసి- డోర్ తెరుచుకొని లోపలికి పోతుంది. గడియ పెడుతుంది. పేపర్లు, వీక్లీలు తెచ్చుకొని హాల్లో తీరికగా కూలబడుతుంది.
ఆమె వాటిని శ్రద్ధగా తిరగేస్తుంది.
అప్పటికే ప్రత్యక్షమైన కాకి దూరంగా కావ్ కావ్ మంటూ ఎవరో గొంతు తెగ్గోసినట్టుగా మొత్తుకుంటూనే ఉంటుంది.....మార్చి 30.2013.

Comments

Post New Comment


anonymus 02nd Dec 2013 22:36:PM

Appreciate your patience to present this story....