అద్భుత జెన్ కథలు....

జెన్ కథలు (స్టోరీలు) చాలా విచిత్రంగా ఉంటాయి. అర్థ అయ్యి కానట్లు ఉంటాయి. కానీ వాటిని చదివి నిధానంగా అర్థం చేసుకొన్నట్లైతే మంచి తాత్పర్యమే దొరుకుతుంది. సాధారణంగా ఈ జెన్ కథలు చదవడానికి బోర్ అనిపించినా..వీటిలో అర్థం కొంతైనా ఉంటుంది. జెన్ కథలంటే గురు శిష్యులకు మధ్య జరిగే కథలు. శిష్యల అమాయకత్వాన్ని గురువులు ఏవిధంగా అధిగమించేలా చేస్తారో ఈ కథలను చదడం ద్వారా తెలుస్తుంది. జెన్ కథలు ఒక్క గురు శిష్యుల మధ్య మాత్రమే కాదు బౌద్దమత కాలంలో బౌద్ద సన్యాసులు, అక్కడి నివషించే ప్రజల మధ్య కూడా కొన్ని విచిత్రమైన సంఘనలు మనకు ఆశ్చర్యాన్ని కలుగు జేస్తాయి.

అద్భుత జెన్ కథలు ...రచయిత సౌభాగ్య

ఇవి చదివి పారేసే కథలు కావు. అసలివి కథలే కావు..అనుభవ్వలు..అంతర్ముఖీన ప్రయాణ సూత్రాలు.ఇవి స్వచ్చ్హమైన పరమార్థ కథలు.మనిషిని మనిషి చేసే కథలు. మనిషిలోని జంతువును మనిషిని చేసే కథలు.ఒక్కోసారి ఒక్కో వాక్యం దగ్గర ఆగిపోతాం.ఇక కదలం.గుండె మీద పెంకు బద్దలవుతుంది.మనస్సు మీద తెర లేస్తుంది. --అంటున్నారు తనికెళ్ళ భరణి.

అద్భుత జెన్ కథలు

పవిత్ర పిల్లి...(జెన్ కథ)

ఆశ్రమ పెద్ద ఆశ్రమంలో అటూ ఇటూ తిరిగే పిల్లిని పరిశీలించాడు. మాటిమాటికీ అది మ్యావ్, మ్యావ్ అంటూ అరవడం, బోధనలు వింటున్న సన్యాసులకు తన శరీరాన్ని రాసుకుంటూ వెళ్ళడం చూసి, ఆయనకు చిరాకు కలిగింది. అప్పుడు ఆయన ప్రార్ధనా సమయంలో పిల్లిని ఒక గుంజకు కట్టి ఉంచాలని అదేశించాడు.
రెండేళ్ళ తరువాత ఆశ్రమ పెద్ద మరణించాడు. కానీ పిల్లి బ్రతికే వుంది. అయినా సన్యాసులు దాన్ని ఎప్పట్లా గుంజకు కట్టేసేవాళ్ళు.
కొన్నాళ్ళకు ఆ పిల్లి చనిపోయింది. వెంటనే సన్యాసులు ఇంకో పిల్లిని తీసుకొచ్చి వెనకటి పిల్లిలాగే దాన్ని కూడా గుంజకు కట్టేసేవాళ్ళు.
రెండువందల సంవత్సరాల తరువాత ఆశ్రమానికి ఒక అతిథి వచ్చాడు. అంతలో ఆశ్రమ పెద్ద ప్రార్ధనకు ముందు పిల్లిని గుంజకు కట్టెయ్యడం చూసి అతను "ఏమిటిది" అని అడిగాడు.
అప్పుడు ఆశ్రమ పెద్ద బోధనలకు ముందు పిల్లిని గుంజకు కట్టెయ్యడం అన్నది ఎంత లాభదాయకమో అన్న ఆచారాన్ని గురించి ఉపన్యసించాడు.

ఎదుటి వ్యక్తి ఆలోచన...(జెన్ కథ)

ముగ్గురు మిత్రులు సముద్రం దగ్గర ఉన్న ఎత్తైన ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తూ వుంటే అక్కడొక వ్యక్తి నిలబడి ఉండడం చూశారు.
మొదటి మిత్రుడు "బహుశా అతని పెంపుడు జంతువు తప్పిపోయివున్నట్లుంది. వెతుకుతున్నట్లున్నాడు" అన్నాడు.
రెండవ మిత్రుడు " అదేం కాదు. ఎవరో స్నేహితుడు వస్తానని వుంటాడు. అతని కోసం వచ్చినట్లున్నాడు" అన్నాడు.
మూడవ మిత్రుడు "అదేం కాదు, వేసవికాలం కదా! సిటీ వదిలి చల్లగాలి కోసం వచ్చినట్లున్నాడు" అన్నాడు.
ముగ్గురూ వెళ్ళి ఆ వ్యక్తిని "మీరిక్కడ ఎందుకు వున్నారు?" అని అడిగారు.
అతను "ఉట్టినే ఇక్కడికి రావాలనిపించింది. వచ్చాను. నిలబడాలని పించింది, నిలబడ్డాను" అన్నాడు.

జీవితం...(జెన్ కథ)

ఒక వ్యక్తి ఆ జెన్ గురువు దగ్గరికి వచ్చాడు. అతని ముఖం ఎంతో ఆవేదన, ఆందోళన కనిపిస్తున్నాయి. బాధలతో నలిగిపోతున్నత్లున్నాడు. సమస్యలు చుట్టుముట్టినట్లు కనిపిస్తున్నాడు.
"గురువు గారూ! దయచేసి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి" అని అభ్యర్థించాడు.
గురువు అతన్ని నెమ్మదిగా పరిశీలించి "నిన్ను శిష్యుడిగా చేర్చుకోవాలంటే నీకు ఓ పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. అదిగో ఎదురుగా కనిపిస్తున్న ఆ గదిలో పాత సామాన్లు, పగిలిన సీసాలు, గాజుముక్కలు, చీలలు వున్నాయి. తలుపు తీసుకుని నువ్వు ఆ గదిలోకి వెళ్ళాలి. అవి నీ కాళ్ళకు తగలకుండా గుచ్చుకోకుండా జాగ్రత్తగా గది చివరికి చేరితే అటువైపు ఒక తలుపు వుంటుంది. ఆ తలుపు తెరుచుకొని హాలు గుండా మళ్ళీ ఇక్కడికి రావాలి. అదీ నీకు పరీక్ష" అన్నాడు.
ఆ వ్యక్తి "సరే" అని అంగీకరించాడు.
తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. పదినిముషాలు అయింది. తరువాత మెల్లగా అటువైపు తలుపు తీస్తున్న శబ్ధం వచ్చింది. ముఖం వెలిగిపోతూ హాలు గుండా తిరిగివచ్చాడు.
గురువు ఏమి మాట్లాడకుండా ఆ వ్యక్తిని తనతో పాటు మళ్ళీ ఆ గదిలోకి తీసుకెళ్ళాడు చీకటిగా వుంది. ఆయన కాగడా ముట్టించాడు. కాంతిలో చూస్తే గది ఖాళీగా వుంది.
ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.
గురువు అతన్ని చూసి "ఇప్పటిదాకా నీ జీవితంలో ఇలాగే సాగివచ్చావు"
అన్నాడు.


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!