ప్రాణమిచ్చిన ఏనుగులు-faithful elephants

రెండవ ప్రపంచయుద్ధం చివరలో టోకియో పై నిత్యం బాంబుల  వర్షం కురిసేది. యుద్ధం కారణంగా పట్టణంలోని జంతుశాల అధికారులు అనేక జంతువులను చంపెయ్యవలసి వచ్చింది.ఆ సమయంలో యానో జంతుశాలలో చంపివేసిన మూడు ఏనుగుల విషాద కథ 'ప్రాణమిచ్చిన ఏనుగులు'. ఈ కథ ని మొదట (Faithful elephants..a true story of animals, people and war-by yukio tsuchiya)1951లో యుకియొ త్సుచియా వ్రాసారు. ఈ పుస్తకం ఇప్పటివరకు జపాన్ లో 70 ముద్రణలు పొందింది. దీనిని తెలుగులో కె.సురేష్ అనువదించగా జనవిజ్ఞానవేదిక ప్రచురించింది.

ప్రాణమిచ్చిన ఏనుగులు

జపాన్ లోని యూనో జంతుశాలలో చెర్రీ చెట్లు చాలా ఉన్నాయి. ఈ కాలంలో చెర్రీ చెట్లు గులాబి రంగు పూలతో నిండుగా మనసును దోచుకుంటాయి. పూలరేకులు ఎండకు మెరుస్తున్నాయి. గాలి అలలకు పూలు జలజలా రాలుతున్నాయి. ఈ రోజు శెలవు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. జంతుశాలకు చాలా ఎక్కువ సంఖ్యలో చూసేవాళ్ళు వస్తున్నారు.

లోపల రెండు పెద్ద ఏనుగులు ఉన్నాయి. చూపరులకు కనువిందు చేసేలా అవి రకరకాల విన్యాసాలు చేస్తూన్నాయి. ఏనుగులు పెద్ద చెక్క దూలాల మీద పడిపోకుండా నిలబడి తొండంతో బూరలు ఊదుతున్నాయి.

ఇక్కడికి కొంచెం దూరంలో రాళ్ళతో ఒక సమాధి ఉంది. టోక్యోలోని యూనో జంతుశాలలో చపబడిన జంతువులకు గుర్తుగా ఆ సమాధి కట్టారు. జంతుశాలకు వచ్చే సందర్శకుల దృష్టి సాధారణంగా దీని మీద పడదు.ఒక రోజున నేను జంతుశాలకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఈ రాతిస్మారక చిహ్నాన్ని ఎంతో ప్రేమతో తుడుస్తున్నాడు. అతడు చెప్పిన మూడు ఏనుగుల కథనే నేను మీకు మళ్ళీ చెబుతున్నాను.

ఈనాడు జంతుశాలకు వచ్చే వాళ్ళను వినోదపరచడానికి మూడు ఏనుగులు ఉన్నాయి.అయితే చాలా సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మూడు ఏనుగులు ఉండేవి. వాటి పేర్లు జాన్, టోకీ, వైన్లీ. అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నా రోజులు, జపాన్ కూడా ఈ యుద్దంలో పాల్గొంటుంది. జపానులో రోజూ ఎక్కడో ఒక చోట బాబులు పడేవి. ఒక్కొక్క రోజైతే బాంబులు వర్షం మాదిరి కురిసేవి.

ఏదైనా బాంబు జంతుశాల మీద పడితే ఏ ఆపద ముంచుకొస్తుందో ఏమో? జంతువుల బోను విరిగిపోవచ్చు. అప్పుడు ప్రమాదకర జంతువులూ తప్పించుకుని నగరంలో జోరబడవచ్చు. అప్పుడు అంటా భయం గుప్పిట బందీలవుతారు. ఈ ముప్పునుంచి తప్పించుకోటానికి అన్నీ ప్రమాదకర జంతువులను విషమిచ్చి చంపేయమని సైన్యం ఆదేశాలు ఇచ్చింది. సింహాలు, చిరుతపులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, పెద్ద పెద్ద పాములు - ఇలా ఒకటి తరువాత ఒకటి విషమిచ్చి చంపేశారు .

ఇక మూడు పెద్ద ఏనుగులు మిగిలాయి. చివరికి వాటిని చంపడానికి కూడా ఏర్పాట్లు చేసారు. అన్నిటికంటే ముందు జాన్ ని చంపటానికి ప్రయత్నిచారు. జాన్ కి ఆలుగడ్డలంటే చాలా ఇష్టం. అందుకనే జంతుశాల అధికారులు జాన్ కి ఇచ్చే ఆలుగడ్డల్లో కొన్నింటిలో విషం ఉంచారు. జాన్ చాలా తెలివైన ఏనుగు. అది ఏరుకుని మంచి ఆలుగడ్డలు తిన్నది.విషం ఉన్న ఆలుగడ్డలను ఒక్కొక్క దాన్ని దూరంగా విసిరేసింది.

"ఇప్పుడు మరొక దారిలేదు." జంతుశాల అధికారులు అన్నారు, " ఇక మనం జాన్ శరీరంలోకి నేరుగా విషం ఎక్కించాలి."

గుర్రానికి ఉపయోగించే ఇంజెక్షన్ తీసుకుని దాంట్లో విషం నింపాను. దాని సూది చాలా లావు. అయినా జాన్ చర్మం చాలా మందంగా ఉంది సూది లోపలి దిగబడకుండానే విరిగిపోయింది. సూది కూడా ఉపయోగపడకపోవటంతో ఆహారం పెట్టకుండా జాన్ ని చంపెయ్యాలని జంతుశాల అధికారులు అనుకున్నారు. పాపం జాన్ పదిహేడు రోజులపాటు ఆకలి, దాహంతో అలమటించి చివరికి చనిపోయింది.

ఆ తరువాత టోకీ, వైన్లీ వంతు వచ్చింది. ఆ రెండు ఏనుగులు ఎప్పుడూ మనుషులను ప్రేమతో నిండిన కళ్ళతోనే చూశాయి. శరీరం కొండంత అయినప్పటికీ అవి ఎంతో శాంతంగా ఉండేవి. వాటిది మంచి మనసు. జంతుశాల అధికారులు ఈ ఏనుగులను ఎంతో ఇష్టపడేవారు. టోక్యోకి ఉత్తరాన ఉన్న సెండాయి జంతుశాలకి ఈ ఏనుగులను పంపించాలన్న ఆలోచన చేశారు.

సెండాయిలో కూడా బాంబులు పడవచ్చుకడా? అక్కడ కూడా జంతుశాలలోంచి బైటపడి ఇవి నగరంలో జొరబడవచ్చు కదా? అటువంటప్పుడు ఏమవుతుంది? చివరికి మిగిలిన జంతువుల మాదిరిగానే టోకీ, వైన్లీ లను కూడా యూనో జంతుశాలలోనే చంపెయ్యాలని నిర్ణయించారు.

జంతుశాల అధికారులు టోకీ, వైన్లీలకు ఆహారం, నీళ్ళు ఇవ్వటం ఆపేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆహారం లేక ఏనుగులు సన్నగా, బలహీనంగా అయిపోయాయి. జంతుశాలలో పని చేసేవాళ్ళు వాటి బోనుల పక్కనుంచి ఎప్పుడైనా వెళితే ఆ ఏనుగులు వెనక రెండు కాళ్ళ మీద నిలపడేవి - "మేము ఏమి పాపం చేశాము? దయ చేసి మాకు తినటానికి  ఏమైనా పెట్టండి. తాగటానికి నీళ్ళు ఇవ్వండి" అని జాలిగా అడుగుతున్నట్లు ఉండేవి. ఆకలితో వాటి ముఖాలు పీక్కుపోయాయి. బక్కచిక్కిన దేహంతో పోలిస్తే చేటల్లాంటి వాటి చెవులు మరీ పెద్దగా కనబడుతున్నాయి. అడవిలో బలవంతులైన ఈ ఏనుగులు పరిస్థితి ఎవరూ చూడలేనంత దయనీయంగా మారిపోయింది.

ఆ ఏనుగుల శిక్షకులు, మావటీలు వాటిని తమ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించేవారు. వాళ్ళు రోజంతా బోనుముండు నిలబడి విధిని తిట్టుకునేవారు. "స్నేహితులారా! మీకు ఇంతకష్టకాలం వచ్చింది. మీ దయనీయ పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను."

ఒక రోజు టోకీ, వైన్లీ తమ శక్తినంతటినీ ఉపయోగించి వెనక కాళ్ళ మీద లేచినిలబడ్డాయి. అంతకుముందు ఇటువంటి విద్యలు ప్రదర్శించినప్పుడు వాటికి బహుమతిగా తినటానికి తాగటానికి ఏమైనా ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అటువంటి బహుమతి లభిస్తుందని వాటి ఆశ.
మావటి ఇది చూసి ఇక ఉండలేక పోయాడు. అప్పటికే అతను ఎంతో దుఃఖాన్ని దిగమింగి ఉన్నాడు. " నా టోకీ! నా వైన్లీ!" అంటూ అరుస్తూ అతడు ఆహార బుట్ట, రెండో చేతిలో నీళ్ళ బక్కెట్టు ఉన్నాయి. ఈ ఆహారం, నీళ్ళు తీసుకొచ్చి అతడు టోకీ, వైన్లీ ల ముందు ఉంచాడు.

"కావలసినంత తినండి, కడుపునిండా నీళ్ళు తాగండి. నా స్నేహితులారా! అంటూ అతడు బక్కచిక్కిన ఆ ఇందుగు కాళ్ళను పట్టుకుని ఏడవసాగాడు.

మావటి చేసినది మిగిలిన జంతువుల అధికారులు తమకు ఏమి తెలియదన్నట్టు ప్రవర్తించారు. ఎవరూ అతడిని ఒక్కమాట కూడా అనలేదు. జంతుశాల డైరెక్టరు కూడా పెదాలు కొరుక్కుంటూ తన బల్లను చూస్తూ ఉండిపోయాడు. ఏనుగులకు ఆహారం పెట్టడానికి ఎవరికీ అనుమతి లేదు. జంతుశాలలోని ప్రతీ ఒక్కరు ఏనుగులు  మరొక్క రోజు బ్రతకాలని కోరుకుంటున్నారు, ప్రార్ధనలు చేస్తున్నారు. మరుసటి రోజు యుద్ధం ముగిసి ఈ ఏనుగులు ప్రాణాలు దక్కుతాయని వాళ్ళ ఆశ.

చివరికి ఒక రోజు బలహీనత కారణంగా టోకీ, వైన్లీ కదలనేని, మెదలలేని పరిస్తితి వచ్చింది. అవి ఒక పక్కకి వరిగి పడుకుని ఉండిపోయాయి. జంతుశాల మీద ఆకాశంలో తేలియాడుతున్న తెల్లటి మబ్బులను అవి ఇప్పుడు చూడలేకపోతున్నాయి. అయితే వాటి ప్రేమపూరిత కళ్ళు ఇప్పుడు మరింత నిర్మలంగా, అందంగా కనబడుతున్నాయి.
తన ప్రియమైన నేస్తాలు ఇలా తపించి, తపించి చావుకు చేరువవు తుండటం చూడలేక మావటి గుండె పగిలి పోతుంది. బాధతో కూడిన ఆ చూపులని ఇక చూసి భరించలేనని అతడనుకున్నాడు, జంతుశాలలోని ఇతర సంరక్షకులకు కూడా అలాగే అనిపించేది. ఏనుగుల బోను వైపు ఇప్పుడు ఎవ్వరూ వెళ్లటం లేదు.

రెండు వారాల తరువాత టోకీ, వైన్లీ చనిపోయాయి. చనిపోయేముందు అవి బోను చువ్వల వైపుకు వచ్చాయి. వాటి తొండాలు చువ్వల నుంచి బైటికి వేలాడుతున్నాయి. బహుశా అవి చివరిసారిగా తమ తొండాలను గాలిలోకి లేపి తమ విన్యాసాలను చూపించాలని అనుకుని ఉంటాయి. ఒకప్పుడు తమకు ఆహారమిచ్చిన వాళ్లకి వినోదాన్ని ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటాయి.

"ఏనుగులు చచ్చిపోయాయి! రెండు ఏనుగులు  చచ్చిపోయాయి!" మావటి అరుస్తూ పరిగెత్తాడు. అతడు తలను రెండు చేతులతో పట్టుకుని పొగిలి, పొగిలి ఏడ్చాడు. కోపంతో కాళ్ళను నేలకు తన్నాడు.

జంతుశాలలోని మిగిలినవాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ బోను లోపలి వచ్చారు. వాళ్ళు టోకీ, వైన్లీలను నిద్రనుంచి లేపుతున్నట్లుగా వాటి బక్కచిక్కిన శరీరాలను గట్టిగా కుదపసాగారు. తరువాత అందరూ ఏడవడం మొదలుపెట్టారు. రెండు ఏనుగుల కాళ్ళు, తొండాలు నిమరసాగారు.

మెరుస్తున్న నీలాకాశంలో శత్రువుల యుద్ద విమానాలు వేగంగా ఎగురుతున్నాయి. తోక్యోపై మరొక్కసారి బాబులవర్షం కురుస్తోది ఏనుగుల మీద పది ఏడుస్తున్న మావటి, ఇతర సంరక్షకులు తమ చేతుల పిడికిళ్ళు బిగించి ఆకాశం వైపు ఎత్తి ప్రార్ధించసాగారు. "యుద్ధం ఆపండి! యుద్ధం ఆపండి! అన్ని యుద్దాలు ఆపండి!"

ఆ తరువాత ఆ భారీ ఏనుగుల శరీరాలను కోసి చూడగా వాటి పొట్టల్లో పిసరంత ఆహారం కూడా లేదు, చుక్క నీళ్ళు కూడా లేవు.

జంతుశాల సంరక్షకుడు ఈ కథను ముగించేసరికి అతడి కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. "ఆ మూడు ఏనుగులు ఇప్పుడు ఈ సమాధి కింద శాంతంగా నిద్రపోతున్నాయి"అన్నాడు.
అతడు ప్రేమతో ఆ సమాధి రాళ్ళను శుభ్రపరుస్తున్నాడు, పైనుంచి చెర్రీ పూలు వర్షిస్తున్నాయి.

 


Comments

Post New Comment


renu singh 15th Mar 2013 21:20:PM

Loved it ....completion of this story my eyes were filled with tearss