మంచుపూల వర్షం

ఇపుడు తన వయసు 23. అమ్మమ్మ ఎన్నో సంబంధాలు చూసింది..ప్రతీ సంబంధం వంక పెట్టలేని సంబంధాలే కానీ నేను కాదు అనగానే వేరే మాట మాట్లాడకుండా మరొక సంబంధం వెతికేది...కానీ ఈ మధ్యే మా మనసులోని ఆరాటం నీకేమి పట్టదా! అన్ని విధాలా తగిన సంబంధం ఆ రాజోలు అబ్బాయి వాళ్లది, నువ్వు ఏమంటావే అని పట్టుబడుతుంది..


అమ్మ ఇంకా తనతోనే ఉన్నట్టు ఉంది. జీవితం ఎన్ని ఆటలు ఆడింది తనతో,నాలుగు సంవత్సరాల క్రింద ప్రమాదంలో అమ్మ ప్రాణాలు కోల్పోవడం, ఆ తరవాత నాన్న తనకో తోడూ వెతుక్కొని, తనతో తీసుకెల్లలేని అసహయతని తెలుపుతూ నన్ను,ఆస్థిని ఆమ్మమ్మ చేతిలో పెట్టి, తండ్రిగా అనుపమకి ఏ అవసరమున్న నాకు తెలియజేయడం మాత్రం మరవద్దని చెప్పి వెళ్ళిపోయాడు....బాల్యం అంతా అమ్మ తోనే పోయిందా అని ఒక నిట్టూర్పు విడిచింది  అనుపమ.

అనుపమకి వర్షాన్ని చూస్తె ఆత్మీయులని చూసిన భావన,...ఎదురింటి చిన్న పాప,వర్షంలో తడవడానికి చేసిన పెంకి పేచీలతో అలసిపోయిందేమో కిటికీలోనుండి తుంపరలా తన చేతిపై పడే చినుకులతోనే సరిపెట్టుకొని ఆడుకుంటుంది. కిటీకీ లోనుంచి ధారగా కురిసే వర్షాన్ని చూస్తూ గతము తాలూకు జ్ఞాపకాల్లోకి జారుకుంది మెల్లిగా...

చిన్నప్పుడు ఎపుడు వర్షంలో ఆడుకోవాలన్న, అమ్మ అడ్డుచేప్పేది కాదు, ఎంత సేపు ఐనా ఆడుకో కానీ నీకు జలుబు, జ్వరం ఏమైనా వస్తే మటుకు పేచిపెట్టకుండా టాబ్లెట్స్ వేసుకొని నేను చెప్పినట్టు వినాలి అనేది. టాబ్లెట్స్ మాట వినపడగానే నాకు వానలో ఆడుకోవాలన్న కోరిక కంటే, ఎక్కడ జలుబు వచ్చేస్తుందో అన్న భయమే నన్ను వర్షానికి దూరం చేసేది. స్కూలు నుంచి వచ్చేపుడు వర్షం వస్తే చాలు కావాలని తడిచి వచ్చేసేదాన్ని, అలా రావడం వర్షంలో ఆడుకోవడం కాదు కాబట్టి అమ్మ చెప్పినట్లు వినక్కరలేదన్న నమ్మకం నాకు ఉండేది మరి...

అపుడు నేను 8వ తరగతిలో ఉన్నానేమో.. ఒకసారి అమ్మని అడిగా, నాకు నచ్చిన వర్షాన్ని ఎందుకు నువ్వు టాబ్లెట్స్ జ్వరం అని చెప్పి దూరం చేసావు అని,అప్పుడు అమ్మ! చిన్నగా నవ్వి  తన చిన్నప్పటి వర్షం సంగతులు చెప్పడం మొదలెట్టింది..

"నాకు చాల పెద్ద వర్షం అంటే ఎక్కువ ఇష్టం "
అలా ఇతే వర్షం ఆగిపోయాక చాల సేపటివరకు కూడా నీళ్ళు కాలువల్లా పారుతాయి ఎంచక్కా కాగితపు పడవలతో అడుకోవచ్చని.
ఎపుడు వర్షం వచ్చిన అమ్మ కాస్త తగ్గాకనే కాసేపు అడుకోనిచ్చేది, వర్షం వస్తే ఇంట్లో కిటికీ నుండి చూసి ఆనందించాల్సిందే, ఎంతో పేచీ పెట్టి వెళ్ళినా ఎలాగో బుజ్జగించడం మొదలెట్టేది, ఆఖరుకు రేపు ఆడుకో నీ ఇష్టం వచ్చినంతసేపు అనేది,అలా అనేసరికి నాకు ఏనుగు ఎక్కినంత ఆనందం వేసేది, రేపు నాదే కదా అని అమ్మతో వచ్చేసేదాన్ని లోపలికి ..కానీ రేపు వస్తుంది కానీ వర్షం రాదని తెలుసుకునే వయసు నాది కాదు, నిజం తెలిసిన అమ్మ నాకు చెప్పనే లేదు.
నేను నీ అంత అయ్యాక తెలుసుకున్నా  "మా అమ్మకి నాకు జ్వరం వస్తుందేమో అని భయం అందుకని వానలో అడనిచ్చేది కాదు అని" ఆ నిజమే నాకు చెప్పి ఉండొచ్చు కదా, జ్వరం రాకుండా చూసుకునేదాన్నిఅని నాకు నేను ఎప్పుడు అనుకునేదాన్ని....మా అమ్మకు నాకు ఎలా చెప్పి ఉంటె బాగుండేది అనుకున్నానో అదే నేను నీకు చెప్పాను అనూ!....అని ముగించింది...

ఒక్కసారిగా..జీవితం, అమ్మ, వర్షం అన్నీ ఒక్కటైనా భావం..అమ్మ తాలూకు జ్ఞాపకం మదినిండా అల్లుకుంది....టీ కప్పుతో వచ్చిన అమ్మమ్మ నా మంచం మీద ఉన్న కాగితపు పడవలను ఆశ్చర్యంగా చూస్తూ ఏమి చేస్తున్నావు అనూ అంది ... వర్షంలో ఆడుకునే కూతురికి ఏమి చెప్పాలా  అని ఆలోచిస్తున్నా....అహా! ఏమి లేదు.. ఇంతకీ రాజోలు సంబంధం వాళ్ళు ముహూర్తాలు ఎపుడు పెట్టుకుందామన్నారు అమ్మమ్మ అంటూ అడిగేసరికి..... నా బుగ్గలు పుణికి పుచ్చుకుని నా బంగారు తల్లి నీకు ఇష్టమే కదా అంటూ.... ఏమండీ! మాట అంటూ తాతయ్య కోసం తన వయసు మరచి పరుగులు పెట్టింది లోనికి అమ్మమ్మ ఆనందంగా.....

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!