లేట్ నైట్ డిన్నర్

ప్రదీప్ ఆలోచనలో పడ్డాడు. అమ్మ శుక్రవారం హైదరాబాద్ వస్తుంది, ఆదివారానికి రిటర్న్ టికెట్ కూడా తీసుకుంది. తన ఆరోగ్యం అంత బాగాలేదు, ఉన్న రెండు రోజులు అమ్మని బాగా చూసుకో జాగ్రత్తరా! అని అన్నయ్య గంట క్రితం చేసిన ఫోన్ మనసుని కలవరపెడుతుంది. ఒక్కసారిగా గతం తాలూకు నీలినీడ కళ్ళముందు కదిలింది.
అదే మొదటిసారి అమ్మ హైదరాబాద్ రావడం, అప్పటికి పాపకి రెండేళ్లు, బాబు ఆరునెలలు. సుగంధి స్కూల్ టీచర్ గా, నేను నిండుగా డబ్బు అందుకుంటున్న సాఫ్ట్ వేర్  ఉద్యోగిగా, ఇంటినిండా తగిన సదుపాయాలూ ఇవ్వడమే తప్ప సమయం మాత్రం కేటాయించలేనంత బిజీగా ఉన్నాం.
సుగందికి పాపని ప్లే స్కూల్ కి, బాబుని కేర్ సెంటర్ లో వదిలి తను తొమ్మిది అయ్యేసరికి స్కూల్లో ఉండాలి, తల్లిగా తను వాళ్ళకు ఏ చిన్నఇబ్బంది రాకుండా, మీరు ఏమి పట్టించుకోరు అని అనకుండానే అన్నీ చూసుకునే తనని, అమ్మని బాగా చూసుకో అంటూ తప్పుపట్టలేను.
ప్రాజెక్ట్ బిజీలో పొద్దున వెళితే మళ్ళీ వచ్చేసరి అర్ధరాత్రి దగ్గర పడుతుంది. అమ్మ వచ్చి పదిరోజులు అయినా ఒక గంట తనతో కూర్చొని మాట్లాడిందే లేదు.
ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి అమ్మ నిద్రపోకుండా నాకోసమే ఎదురుచూస్తూ కూర్చుంది, అప్పటికే టైం పదకొండు దాటింది. అమ్మని మాట్లాడనివ్వకుండానే నేనే అన్నాను, నాకు చాలా అలసటగా ఉంది, రేపు మాట్లాడుదాం నాకు సెలవే కదా అని.
బెడ్రూం లోకి వచ్చేసరికి సుగంధి తీరిగ్గా పుస్తకం చదువుతూ కనిపించేసరికి నాకు చెప్పలేనంత కోపం వచ్చింది, ఆ పుస్తకం ఎక్కడికి పారిపోదుగా, అమ్మతో కాస్త మాట్లాడుతూ కూర్చుంటే నీ స్టేటస్ ఏమి పడిపోదు, నీకు కావలసినంత స్వేచ్చ ఇచ్చింది నాకు నచ్చినట్టు ఉంటావని, ఇంకా ఏదో అనబోతు ఏమి పలకని తనని చూసి మాటలు ఆపేసి ముసుగుతన్నిపడుకున్నాను.
పొద్దున్న లేచేసరికి తొమ్మిది అవుతుంది, అప్పటికే పిల్లలు, సుగంధి తయారయ్యి ఎక్కడికో బయలుదేరుతున్నట్టు ఉన్నారు. అన్నయ్య కూతురికి బాగాలేదట వెళ్లి మధ్యాహ్నం వరకు వచ్చేస్తా అంది.
మరి అమ్మ..అనగానే, నావైపు వింతగా చూసి, అదేంటి పొద్దుటే వెళ్ళిపోయారు నేనే ట్రైన్ ఎక్కించి వచ్చాను, అలసటగా ఉంది పొద్దుటే లేవలేను అని చెప్పారట కదా అత్తయ్యకి అన్నది సుగంధి  నింపాదిగా.
ఒక్కక్షణం ఆగి చూడండి.. నాకు నా స్టేటస్ గురించి, బాధ్యత గురించి  గుర్తుచేయాల్సిన అవసరం లేదు, మీ అమ్మకు మీరు సమయం కేటాయించగలిగినపుడే రమ్మని పిలవండి, ఒకింత కటువుగానే చెప్పి, మీ కాఫీ, టిఫిన్ టేబుల్ మీద ఉన్నాయి, ఫ్రెష్ అయ్యి తినండి. కోపం వదిలి తిన్నాక తీరిగ్గా ఆలోచించండి అంటూ పిల్లలని తీసుకొని వెళ్ళింది.
వెళ్ళేపుడు లేపకుండా, చెప్పకుండా వెళ్లిందని నెపం వేసి, మళ్ళీ అమ్మని రమ్మని పిలవనే లేదు.

*****
అప్పుడు అమ్మ పదిహేను రోజులుంటే కూడా నాకు ఒక్క గంట కూడా తనతో గడపలేనంత బిజీగా ఉన్నానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను అప్పటినుండి..ఇప్పటివరకూ.
ఒక్కసారి తలవిదిలించాడు అమ్మ ఉండే రెండు రోజులు తనకు కుదురుతుందా అని, శనివారం సాయంత్రం క్లైంట్ తో మీటింగ్, డిన్నర్ ప్రోగ్రాం ముందుగానే ఫిక్స్ అయిపోయింది. ఆఫీషియల్ డ్రెస్ లో కాకుండా నార్మల్ డ్రెస్ లో వెళ్ళు అని బాస్ మరీ పిలిచి చెప్పడంతో వచ్చే పర్సన్ ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్ధమైంది. ఆ ప్రోగ్రాం నించి తప్పుకునే వీలు లేదు. ఏమి చేయాలి అన్నప్రశ్న, ఎలా చేయాలి అన్న ఆలోచనా తప్ప, సరియైన జవాబు మాత్రం దొరకలేదు.
ఇంటికెళ్ళాక అమ్మ ఊరి నుండి రావడం గురించి తన షెడ్యుల్ గురించి చెప్పి ఏమి చేయనూ అని బేలమొహం వేసిన ప్రదీప్ ని చూసి ఫక్కున నవ్వింది సుగంధి. శుక్రవారం నేను సెలవు పెట్టేస్తాను, శనివారము హాఫ్ డే కదా సరిపోతుంది. కానీ వచ్చేది మీకోసం అన్నది గుర్తుంచుకుంటే చాలు అంది. నవ్వుతూ.. సరే అన్నట్టు తలపంకించాడు.
అమ్మ ఇంకా రాలేదేంటి అంటూ పదోసారి  టైం చూసుకున్నాడు, అంతలో ఆటో చప్పుడు వినిపించడంతో ..
సుగంధా! అమ్మ వచ్చినట్టుంది అంటూ గబా గబా ఎదురు  వెళ్లాడు. అమ్మా! ఎలా ఉన్నావు అంటూ సూట్ కేసు లోపల పెట్టి ఇప్పటివరకు  నీకోసమే ఉన్నాను.
కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. సాయంత్రం త్వరగా వస్తానమ్మ అని ఆఫీసుకి బయలుదేరాడు ప్రదీప్ హడావుడిగా, కానీ వచ్చేసరికి రోజులాగే కాస్తంత ఆలస్యం అయింది.
****
ఈ రోజు సాయంత్రం కలిసే క్లయింట్ కోసం ఒకసారి నా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చూసుకుని, అమ్మని పలకరిద్దామని చూస్తె హోమ్ వర్క్ చేస్తూ పాప తప్ప ఎవరూ కనిపించలేదు ప్రదీప్ కి,... అమ్మ, నాన్నమ్మ కొత్తబట్టలు కొనుక్కురాడానికి వెళ్లారు నాన్న.. అడక్కుండానే చెప్పింది కూతురు .
ప్రదీప్ బయలుదేరేసరికి ఇంకా సుగంధి రానేలేదు. కూతురుని పక్కింట్లో వదిలి తాళం వేసుకొని షార్ప్ సెవెన్ కి క్లైంట్ దగ్గర ఉండాలి అన్న బాస్ మాటలు గుర్తుచేసుకుంటూ బయలుదేరాడు.
రిజర్వు చేసిన టేబుల్ దగ్గరకు వెళ్లేసరికి ఒక్కసారి త్రుళ్ళిపడ్డాడు ప్రదీప్ ఎదురు సీట్ లో చిరునవ్వుతో తనకోసమే  ఎదురుచూస్తున్నట్టు ఉన్న వాళ్ళ అమ్మని చూసి..
ఇదంతా సుగంధ ప్లాన్ అని తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాడు. అమ్మతో కబుర్లు చెపుతూనే సమయం అంత క్షణాల్లో కదిలిపోయింది. అమ్మతో కొన్ని సంవత్సరాలుగా కలిసే ఉన్నభావం.. మొదటిసారి లేట్ నైట్ డిన్నర్ మీద అభిమానం కలిగింది ప్రదీప్ కి, ఇంటికి వచ్చేసరికి తేదినే మారిపోయింది.
ఎలా ఉందండి మీ ప్రోగ్రాం చిరునవ్వుతో అడిగింది మగత నిద్రలో ఉన్న సుగంధ.. అన్ని జవాబులు మాటల్లో చెప్పలేక తనలో ఒదిగిపోతూ నుదుటిపై ముద్దాడుతూ ఈ లేట్ నైట్ డిన్నర్ జీవితమంతా కావాలి. నెలలో ఒక్కసారి ఫామిలీ ఇస్ మై క్లయింట్ అన్నాడు.

*****
మాటవరసకు కాకుండా మాట తప్పకుండా ప్రతీ రెండో శనివారం ఫ్యామిలీ తో లేట్ నైట్ డిన్నర్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో పాప, బాబు చెప్పే కబుర్లు, నాన్న మీద ఎపుడు ఎందుకు కోపం వచ్చిందో చెప్పడం, విషయాన్ని బట్టి అందుకు సారీ చెప్పడమో, పిల్లలను సరిదిద్దడమో, భార్య చెప్పే విషయాలు, వాళ్ళ ఇష్టాలు అన్ని కబుర్లతో డిన్నర్ పూర్తి అయ్యి ఇల్లు చేరేసరికి తేదీనే మారేది ఒక్కోసారి .. కుటుంబానికి తనకి మధ్య ఎంతో బలమైన బంధం అల్లుకోవడం గమనించాడు.
ఓ రోజు పొద్దుటే అన్నయ్య దగ్గరనుంచి ఫోన్ అమ్మ పోయిందని
అమ్మ ఇక్కడినుండి వెళ్లి అప్పటికి ఆరునెలలు అయ్యింది.
ఒక్కసారి .. నాలో అపరాధభావం నుండి తప్పించిన లేట్ నైట్ డిన్నర్ తళుక్కున మనసున ఆవరించింది.


ఉదయిని అంతర్జాల పక్ష పత్రిక 4వ సంచిక(1-4-24) లో నేను వ్రాసిన లేట్ నైట్ డిన్నర్ కథ ప్రచురింపబడింది.


Comments

Post New Comment


రమాదేవి 02nd Oct 2012 09:22:AM

కాలం వెనక్కి తిరిగివస్తే బాగుండు అని చాలా మంది ఆశపడతారండి శశికళగారు..అది సాధ్యపడదని తెలిసి కూడా..ఏదైనా మనచేతినుండి చేజారకముందే అందుకుంటే బాగుందన్న మనసులోని వేదనే ఈ కథకు స్ఫూర్తి అండి