నాకు నచ్చిన..సౌమిత్రి ...వడలి రాధాకృష్ణ

కథకుడి పేరు తెలియకుండా ఒక కథను చదివితే, అది నచ్చే మనసుకి ఆ కథ తన అభిమాన రచయిత రాసింది కావొచ్చు అని అనిపించి రచయిత పేరు కోసం వెతకడం అనేది అతి సామాన్య విషయం.మనకు తెలియని రచయిత అయితే అతని కథను మనకు తెలిసిన పాపులర్ రచయితలతో, అందరికి తెలిసిన యండమూరి, మల్లాదిలతో పోల్చడం కద్దు

ఒక కథ మనసుని తాకితే, మదిలోని భావాలు రాగారంజితాలే అవుతాయి. అందులోని పాత్ర జీవం పోసుకొని మనముందు నిలబెట్టుకోవాలన్న ఆశ ఊపిరి పోసుకుంటుంది. మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఆ పాత్రకు సరితూగగలరా అని జల్లెడ పట్టేస్తాం...ఇలా మనుషుల్ని ప్రేమించే మనసున్న ప్రతీ ఒక్కరు చేసే పనే....వడలి రాధాకృష్ణ రాసిన 'సౌమిత్రి'  కథ చదివి మీరు ఒక మనిషి కోసం వెతుక్కుంటారు అన్నది సత్యం....

అతి సామాన్య మంచి అలవాట్లు, అందరు ఆచరించే అతి సామాన్య కట్టుబాట్లు ఒక మనిషి మంచివాడు అని నిర్ణయించడానికి కొలబద్దగా పరిగణించడం పరిపాటి. కానీ ఒక మనిషి ఎంత ఉన్నతుడో గుర్తించే అవకాశం కానీ, సంఘటన కానీ మన కళ్ళెదురుగా జీవితమంతా జరగదు. ఒక మనిషిలోని వ్యక్తిత్వం గుర్తించగలిగితే, అలాంటి మనుషులు మనకు నిజంగా ఒక అద్బుతమే.... అలాంటి అద్బుతం ఈ 'ఆదిమూర్తి'.. ...వడలి రాధాకృష్ణ రాసిన 'సౌమిత్రి'  కథలో కనిపించే ఈ 'ఆదిమూర్తి'...... కథ ఎంత అద్బుతమో ..ఆ కథకు రచయిత పెట్టిన పేరు ఊహకు అందనిది.... నాకు నచ్చిన'సౌమిత్రి....'  మీ కోసం ......

సౌమిత్రి ...వడలి రాధాకృష్ణ (9985336444)

ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యం లేదు. అసలు టైముకే వస్తుందట!' ఎనౌన్స్ మెంట్ విన్న తర్వాత వాచీ చూసుకున్నాను. ఇంకా అరగంట టైముంది. కాసేపు స్టేషన్ లోకి వస్తూ పోతున్న వాళ్ళని చూస్తూ కూర్చున్నాడు. చాలా వరకు తెలిసిన ముఖాలే! తనకేసి అలా చూసి వచ్చీ రాని నవ్వు నవ్వి.. ఒక్కసారి తన ప్రస్థానం తనకే ఆశ్చర్యంగా అన్పిస్తోంది ఆదిమూర్తికి.
ఆ స్టేషన్ లో ఆగకుండా వెళుతూన్న గూడ్స్బండి చేస్తూన్న శబ్దానికి ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా హరి.
"ఎక్కడికి ప్రయాణం"
'తెలీదు!' కొంత నిర్లిప్తతగా మరికొంత నిఖార్సుగా అన్నాడు.
'నేను ముందే హెచ్చరించాను ఇదంతా జరుగుతుందని. ఇంతకాలం కనిపెట్టికున్న ఊరును ఇంత ఆస్థిని ఒదిలేసి అన్నింటినీ త్యజించి వెళ్లి పోతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికీ ఏమి మించిపోయింది లేదు. మీ నాన్నగారంటే ఎంతో గౌరవం ఉన్న లాయరు ఉన్నారు. ఇంతకుముందే నీ వివరాలు అన్నీ ఆయనకు చెప్పాను. పైసా ఖర్చు లేకుండా కోర్టులో కేసు వేసి నీవాటా నీకు ఇప్పిస్తానన్నారు'.
ఆదిమూర్తి చిన్నగా నవ్వాడు.
'నీకు ఆ రోజే చెప్పాను హరి! నా ఆస్తిని అనుభవిస్తున్నది నా వాళ్ళేగాని పరాయివాళ్ళెవరూ కాదు. వాళ్లనే అనుభవించి ఆనందించనీ!! నీ సలహాకు కృతజ్ఞతలు. నేను ఇక్కడి నుండి దూరంగా తరలిపోవాలని నిర్ణయించుకున్నాను' హరి మాట్లాడ లేదు. ఆదిమూర్తి భుజం మీద చేయి వేసి సముదాయించాడు.
'ఈ రైలు ఎక్కడికి వెళుతుంది సార్!' టికెట్ కౌంటర్లో అడిగాడు ఆదిమూర్తి.
'చివరి స్టేషన్ ఏదైతే దానికి టికెట్ ఇవ్వండి!' నెమ్మదిగా బయలుదేరిన రైలు క్రమంగా వేగాన్ని పుంజుకుంటుంది. కిటికీ లోంచి బయటకు చూశాడు. ఎరిగిన ప్రాంతం వీడ్కోలు పలికి క్రమంగా కనుమరుగవు తోంది. ఆలోచనలను ప్రక్కనపెట్టి కళ్ళు మూసుకున్నాడు ఆదిమూర్తి. నెమ్మదిగా కునుకు పడుతోంది.
'మీరు...' చల్లని చేయి ఒకటి ఆదిమూర్తి భుజం మీద పడింది. చటుక్కున కళ్ళు తెరిచాడు.
'నువ్వు సాంబమూర్తి కొడుకు ఆదిమూర్తివి కదూ!' వచ్చి ప్రక్క సీటులో కూర్చుంటూ పలికాడు. చూస్తుంటే ఆయన అరవై సంవత్సరాలు పైవడిన విశ్రాంత ఉద్యోగిలా ఉన్నాడు. కానీ అవిశ్రాంతంగా మాట్లాడుతున్నాడు.
'అవునన్నట్టు తలూపాడు ఆదిమూర్తి'.
'నా పేరు మురారి. సాంబమూర్తి నాకు మంచి మిత్రుడు. ఎలా ఉన్నాడిప్పుడు'
'.... ... ....'
'అడిగానని చెప్పు!'
'పోయి నాళుగేళ్ళయింది '
'అయ్యో!' నొచ్చుకోవడం మురారి వంతయింది.
'మీ నాన్న చేతివంట అమృతంలా ఉండేది. ఆ రోజుల్లో మీ హోటల్ కి రోజు వచ్చేవాడిని'.

*********

'చెప్పాలంటే ఆ హోటల్ లో రోజూ టిఫిన్ చేయడం ఒక వ్యసనమాయి పోయింది నాకు!
'నాన్నపోయిన తర్వాత హోటల్ పూర్తిగా మూసేశాం!.
'మరి అన్నలు'
చెప్పాడు.
'అల్పాహారం కానీ ఆహారం కానీ అక్కడ తింటున్నప్పుడు వ్యాపారంతో పెట్టినట్లు ఉండేది కాదు. తృప్తిగా విస్తర నుండి లేస్తూంటే, ఆనందంగా ఉండేది. ఒక్కొక్క సారి నేను నా భార్య కలిసి వచ్చేవాళ్ళం. దేవతలు తినే భోజనం అంటూ ఆమె ఎంతో ఇష్టంగా తినేది'.
'... .... ...'
'పెళ్ళయిందా!'
'లేదు'
'నిన్ను బాగా చదువుకోమని నేను కూడా చాలా సార్లు చెప్పిచూశాను. మొత్తానికి ఇందులో బాగా నిష్ణాతుడవయ్యావు. బాగా బ్రతికేందుకు మంచి ఉపాధినే ఎంచుకున్నావ్!'
'... ... ... '
'ఎక్కడి దాకా!'
చెప్పాడు.
'నిన్ను కలుసుకోవడం... ఈ విధంగా మీ నాన్నను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది' దిగాల్సిన తన స్టేషన్ లో దిగడానికి లేస్తూ అన్నాడు మురారి.
ఇందాకటినుండి ఈ సంభాషణను ఎదుటి సీట్లో కూర్చున్న పురుషోత్తం శ్రద్ధగా ఆలకిస్తూనే ఉన్నాడు. తన వేళ్ళకున్న ఉంగరాలను, చేతి బ్రాస్ లేట్ ను సరిచేసుకుంటూ లేచి వచ్చి ఆదిమూర్తి ప్రక్కన ఖాళీ అయిన సీట్లో కూర్చున్నాడు.
రైలు కదులుతోంది. చేయి ఊపుతూన్న మురారి క్రమంగా కనుమరుగవు తున్నాడు. 'నా పేరు పురుషోత్తం' కొంచెం దర్పంగానే అన్నాడు. ఆదిమూర్తికి అర్ధం కావడం లేదు.
'నాకెందుకు చెబుతున్నారు'
'ఒక మనిషి మరో మనిషితో మాట్లాడుతున్నాడంటే ఓ రీజనింగ్ తప్పని సరిగా ఉండి తీరుతుందని గట్టిగా నమ్మేవాణ్ణి నేను' ఫక్కున నవ్వాడు.
'ఇంతకు మీ రీజనింగ్ ఏమిటో!' బ్యాగ్ లోని వాటర్ బాటిల్ ని బయటకు తీస్తూ అడిగాడు ఆదిమూర్తి.
'మీ అవసరం మాకుంది. కావాల్సిన తీగకోసం ఎక్కడెక్కడో వెదుకుతున్నాను. ఇప్పుడు ఇలా రైల్లో దొరికింది' మంచినీళ్ళు త్రాగుదామని ప్రయత్నించిన ఆదిమూర్తి వాటర్ బాటిల్ ఖాళీ అయి పోవడంతో తన దగ్గరున్న సీల్డ్ బాటిల్ ని అందిస్తూ అన్నాడు.
'మా ఊరిలో కొత్తగా నేను ప్రారంభిస్తున్న కోమల విలాస్ లో కుకింగ్ సెక్షన్ కి మీ సారధ్యం....
'నా గురించి మీకేమిటి తెలుసు!'
'ఇందాకటి నుండి ఆ పెద్దాయనతో మీ సంభాషణలు వింటూనే ఉన్నాను. వేరే మాటలు ఇక అక్కరలేదనిపించింది' మరోమారు ఫెళ్ళున నవ్వుతూ అన్నాడు.
'నేను ఎక్కడ పనిచేసినా కొన్ని నియమాలు, షరతులు... అదీ నా ఇష్టానుసారంగా ఇమడగల్గితేనే....'
'మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మంచి జీతభత్యాలు... నివాసం... మీ వ్యక్తిత్వానికి ఏ మాత్రం భంగం కలగని వాతావరణం....'
పురుషోత్తం మాటలు అభ్యర్థిస్తున్నట్లున్నాయి.
ఎటూ తేల్చుకోలేని ఆదిమూర్తి ఓ విధమైన మౌన ముద్రలో మునిగిపోయాడు.

*********

అప్పట్లో సాంబమూర్తి మొదటిసారి పట్టణంలోకి ప్రవేశించినప్పుడు రోజూ పళ్ళెం నిండా ఇడ్లీలను తీసుకొని అమ్మకానికి ఊరంతా తిరిగేవాడు.ముగ్గురు కొడుకుల్లో చివరివాడైన ఆదిమూర్తి తండ్రి వెంట చట్నీ కేరియర్ తీసుకొని వెళ్ళేవాడు.
'నీకు ఎలాగూ తప్పదు. వీడిని బడిలో చేర్పించక  చిన్నతనంలో ఏమిటిది చెప్పు!' తన బాగుకోరే కొందరు సాంబమూర్తికి సలహా ఇస్తూనే ఉన్నారు.
ముగ్గురు కొడుకులు, కూతుళ్ళు...అందర్ని తానే కష్టపడి పోషించాల్సిన పరిస్థితీ. వేరే ఆధారం లేని సాంబమూర్తి తన రెక్కల్ని నమ్ముకొని జీవన యానాన్ని భారంగా కొనసాగిస్తూనే ఉన్నాడు.
ఉదయాన్నే నిద్ర లేవడం పిండి రుబ్బుకొని వేడి వేడి ఇడ్లీ వాయిలను సత్తుపళ్లెంలో నింపుకొని అమ్ముకొని రావడం అతగాడి దినచర్య.
ఆదిమూర్తి తండ్రి వెంట తిరిగి రావడానికి బాగా ఇష్టపడతాడు. చదువుకోమని రోజూ పోరు పెడుతూన్న ఆ మాటలు అతగాడి బుర్రకు పెద్దగా పట్టినట్లు లేవు. మొత్తానికి కొడుకును బడికి పంపడానికి అతికష్టం మీద ఒప్పించగలిగాడు సాంబమూర్తి.
అయినా శలవు రోజులు, ఆదివారాలు తండ్రి వెంట ఇడ్లీల అమ్మకానికి వెళుతూనే ఉన్నాడు. ముగ్గురు కొడుకులకు చిన్నతనం లోనే రోజుల వ్యవధిలో ఉపనయనం చేసినా, ఆ ధర్మాన్ని త్రికరణ శుద్దిగా ఆచరిస్తున్న వాడు ఒక్క ఆదిమూర్తి మాత్రమేనని చెప్పొచ్చు.
క్రమంగా పట్టణం పెరుగుతోంది. దానితోపాటు సాంబమూర్తి కూడా ఒక స్థాయికి చేరుకుంటున్నాడు. ప్రజల అవసరాలను గ్రహించి పెద్ద హోటల్ ని ప్రారంభించాడు. తర్వాత అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది.
పెద్దకొడుకులు పై చదువులు చదివి ఉన్నత స్థాయి కెదిగారు. కానీ ఆదిమూర్తి మాత్రం పదవ తరగతిలోనే చదువు ఆపేశాడు. తండ్రికి వంటగదిలో సహాయపడటం అలవాటు చేసుకున్నాడు. ఎదుగుతూన్న వ్యాపారం వస్తూన్న ఆర్ధిక రాబడి పెద్ద వాళ్ళిద్దరిని ఆలోచనలో పడేశాయి క్రమంగా ఆదిమూర్తి పాడ వాళ్లకి స్వంత తమ్ముడయినా సరే గిట్టకుండా పోయింది, కారణం ఆస్థికి వాటాదారుగా ఉండటం వాళ్ళకు రుచించలేదు.
ఆడపిల్లలకు మంచి మొగుళ్ళను వెదికి తెచ్చి వైభవంగా పెళ్ళిళ్ళు చేసేశారు.
పగలంతా వంటగదిలో కష్టపడే ఆదిమూర్తికి అతని కష్టాన్ని మరిచి పోవడానికి ఇది మంచి అలవాడు అని అన్నలు ఇద్దరూ మందును అలవాటు చేశారు.
సాంబమూర్తి ఆకస్మాత్తుగా కన్ను మూశాడు. ఈ వ్యాపారం ఇక మనకు అచ్చిరాదు. పైగా పట్టణంలో నాగరికత హోటల్స్ వెలుస్తున్నాయి. వాటితో మనం పోటీపడలేమంటూ బలవంతంగా హోటల్ వ్యాపారాన్ని ఆపేశారు.
పైగా తండ్రి సంపాదించిన ఆస్థి మొత్తాన్ని తమ ఇరువురి పేరా అనుకూలంగా మార్చేసుకున్నారు. ఆదిమూర్తికి ఏమి అర్ధం కావడం లేదు. ఇన్నాళ్ళు తనకు తెలిసింది పగలంతా వంట గదిలో కష్టపడడం చీకటిపడిన తర్వాత మందు బాగా త్రాగేసి పరుండడం.
హరి ఆదిమూర్తి జీవితంలో ఓ మంచిమిత్రుడు...స్నేహితుడు. తాను కూడా మందును ఎక్కువగా ఇష్టపడటంతో సహజంగానే వాళ్ళిద్దరూ దగ్గరయ్యారు.
'ఈ ఆస్థి నీకు కాకుండా పోతుంది! నీ అన్నలు నిన్ను నడి బజారులో నిలబెడుతున్నారు' హరి చాలాసార్లు హెచ్చరిస్తూనే ఉన్నాడు.
ప్రతిసారి ఆదిమూర్తి చిరునవ్వే సమాధానంమయ్యేది. 'పంచుకున్నా వాళ్ళు నాకు అన్నలే కదా! అనుభవించనీ! వాళ్ళకు భార్యా పిల్లలు ఉన్నారు. మా అక్కయ్యలందరికీ వాళ్ళే పూనుకొని పెళ్ళిళ్ళు చేశారు. నాదేముంది చెప్పు. ఓ వంటరితనం తప్ప, ఆకలి తీర్చుకుందుకుఒక ముద్దా...విశాంటికి కాసింత నీడ...త్రాగేందుకు ఇంత మందు ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. ఇక చాలు నాకు'.

*****'

ఎవరమ్మా నాన్నతో వస్తున్నాయిన' సుమనను కొడుకు అడిగాడు.
ఆమెకు అర్ధం కాలేదు.
'ఇతను ఆదిమూర్తి, మన హోటల్ కి కుక్ గా కుదుర్చుకొచ్చాను' గేటు తీసుకొని లోపలి వచ్చిన పురుషోత్తం ఆదిమూర్తిని భార్యకు పరిచయం చేశాడు.
లిప్తకాలం ఆదిమూర్తి నరాలలో సెగలు రాజుకుంటున్నాయి. సుమనను చూడగానే మత్తుగా మంద్రంగా మారిన కళ్ళను బరువుగా క్రిందకు దించుకున్నాడు.
సుమనది కోలమొహం. పెద్దకళ్ళు, చెప్పాలంటే మంచి స్పురద్రూపి...ఆదిమూర్తికి కోలమొహం అంటే చాలా ఇష్టం. అప్పట్లో డాక్టర్ కోర్సు చదువుతూ రోజూ టిఫిన్ చేయడానికి హోటల్ కి వచ్చే రేష్మి ది కోలమొహం. కళ్ళు పెద్దవిగా చేసి చూడటం గుండెల్లో బొమ్మను నిలుపు కోవడం చేసేవాడు.

చెప్పాలంటే పురుషోత్త్తానికి వ్యాపారం చేయడం అనే కళ బాగా తెలుసు. బాగానే చదువుకున్న అతగాడిది విలక్షణమైన ధోరణి. అతి తక్కువ కాలంలో వ్యాపారంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న తాపత్రయం... ఆ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ హద్దులైనా చెరిపేసే నైజం కలవాడు.

ఒకసారి నరసింహం అన్నాడు. ' నీ మేనమావ కూతురు ఉంది. దాన్ని చేసుకో...నీకున్న లక్షణాలకు సరిపోయే ఆడపిల్ల. చుట్టరికం కలిసి అందరూ ఒకటిగా ఉంటారు.పురుషోత్తం హేళనగా నవ్వాడు. తాను చేసుకొనే పెళ్ళిలో కూడా కొంత లాభాన్ని ఆర్ధిక పరిపుష్టితను ఎంచుకునేవాడు. అందుకనే శాస్త్రిగారు తెచ్చిన సంబంధాన్ని ఓకే చేశాడు.
తల్లిదండ్రులు కాదన్నారు. చివరికి తల్లిని తండ్రిని బెదిరించే వరకు వెళ్లాడు. మీ బంధుత్వం మీ అవసరం మాకు లేదన్నట్లు మాట్లాడాడు. అలా సుమన పురుషోత్తం జీవితంలోకి ప్రవేశించింది.
అది పెద్దగా పట్నమూ లేదు . పల్లెటూరు కాదు. చుట్టూ పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తున్న జీవనది. ఊరికి రైలు, బస్సుల సౌకర్యం ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం అన్ని విధాల లాభాదాయకమన్న నిర్ణయానికొచ్చేశాడు.
ఊరులో చిన్న హోటల్స్ రెండు ఉన్నాయి. కానీ మరో రెండింటినైనా భరించగల్గిన స్థితిని గమనించాడు. పురుషోత్తం పైసాకు పైసా లాభమని లెక్కలు వేశాడు. అతని మనసులో హోటల్ వ్యాపారం మంచి లాభదాయకమన్న భావన గట్టిగా నాటుకోంది.
ప్రారంభించిన వేళా విశేషం ఏమిటో గాని పురుషోత్తం హోటల్ ఎప్పుడు జనాలతో కిటకిటలాడి పోతోంది. లాభాలకు లాభాలు వచ్చి పడి పోతున్నాయి. ఊరిలోని మిగిలిన హొటల్స్అన్నీ దాదాపుగా మూతపడి పోయాయి.
రుచికి శుచికీ మారుపేరుగా కోమల విలాస్ వెలిగిపోతోంది!
పగలంతా ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు ఆదిమూర్తి. రాత్రి అయ్యేసరికి తన లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. ఊరు బయట నదిని దాటి బోటు మీద ఆవలి తీరం చేరుతున్నాడు. తనను తాను మరిచిపోయే వరకు పీకల దాకా త్రాగడం... తన శరీరం లోని వేడిమినంతటినీ దొరికిన స్త్రీ ద్వారా తీర్చుకోవడం... ఏ అర్ధరాత్రో లారీ పట్టుకొని ఇంటికి చేరడం... ఇచ్చిన తన వసతి గదిలో సేదదీరడం ఆదిమూర్తికి దినచర్యగా మారిపోయింది.
వేకువజామునే స్నానం చేయడం, రాత్రి తన చీకటి జీవితాన్ని ప్రక్కన పెట్టి నుదట విభూది రేఖల్ని ధరించి భక్తితో సంధ్యావందనం చేసుకోవడం... మరలా మనిషిగా మారడం... తర్వాత తను, తన వంటగది వ్యాపకం... ఇదీ ఆదిమూర్తి పగటి పూట పని.
చెప్పాలంటే ఏ ద్యాసలో ఉంటే అదే తప్ప మరో ధ్యాసలేని ఆదిమూర్తి వాళ్ళు పెట్టె అన్నం తింటాడు. సాయంత్రం చీకటిపడి ఏడు గంటలయితే చాలు తన మరో ప్రపంచం వైపు తరలిపోతాడు.
ఆదివారం మద్యాన్నమే బయటపడిపోతున్నాడు.
పురుషోత్తం దగ్గర పనిలో చేరడానికి ముందే 'నా దైనందిన జీవితంలో మరొకరి ప్రమేయం గాని, బాసిజాన్ని కానీ అంగీకరించేది లేదు' అని పెట్టిన షరతుల్ని పురుషోత్తం పాటించక తప్పడం లేదు.
తన పెరటి గదిలోని మనిషిని సుమన గమనిష్తూనే ఉంది. తప్పనిసరి పరిష్టితులలో అతనికి భోజనం పెట్టక తప్పడం లేదు. రోజూ రాత్రిళ్ళు తాగి రావడం గమనిస్తూనే ఉంది. చిన్నపాటి జ్వరం ఒకటి రెండు సార్లు వచ్చి నప్పుడు డాక్టర్ ను పిలిపించి ఇంజక్షన్లు ఇప్పించింది.
ఆదిమూర్తిని చూస్తుంటే సుమనకు... ఎక్కడలేని అసహ్యం కలుగుతోంది. కానీ తప్పత్రాగేసి వచ్చినా తన ప్రపంచంలోనే తప్ప ఏ మాత్రం హద్దులు దాటడం లేదు. ఆ వింత మనిషిని చూసి నిత్యం సర్దుకోక తప్పడం లేదు.
పురుషోత్తం పెట్టిన హోటల్ దినదిన ప్రవర్ధమాన మవుతోంది. ప్రక్క ఊర్ల నుండి కూడా ప్రజలు ఇక్కడి భోజనానికి ఎగబడుతున్నారు. పురుషోత్తానికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతోంది. కారణం ఆదిమూర్తి ఏ పదార్ధం వండిన రుచిగా శుచిగా తయారు చేస్తాడు. పెద్ద పెద్ద హొటల్స్ కూడా దీని ముందు దిగదుడుపు అన్న పేరు ఆనతికాలంలోనే సంపాదించేశాడు పురుషోత్తం.
కొంతకాలం బాగానే సాగిపోయింది. అంచనాలకు మించి డబ్బును సంపాదిస్తున్న కారణమో లేక తన అహంకార పూరిత ధోరణియో తెలీదు కానీ తెలియని ప్రతి ఘటనను కొంతకాలంగా పురుషోత్తం నుండి ఎదుర్కోతూనే ఉన్నాడు ఆదిమూర్తి.
ఏ బాసిజాన్ని అంగీకరించని అతను క్షణాలలో దూరమైపోవడం...తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఊరిలోని శాంతి నివాస్ హోటల్ యజమాని మరో నాలుగు వేల రూపాయలు జీతం పెంచేసి పనిలోకి తీసుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.
ఏ వేళా విశేషమో గాని ఆదిమూర్తి వెళ్ళిపోయి, వారం రోజులు కూడా కాలేదు. పురుషోత్తం హోటల్ లో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. కష్టమర్స్ అందరూ శాంతినివాస్ వైపు మరలిపోతన్నారు.
పురుషోత్తంకి ఏమీ పాలు పోవడం లేదు. రెండు వారాలు తిరిగాయో లేదో రెండు లక్షల రూపాయల నష్టం కన్పిస్తోంది.
ఆదిమూర్తిని తిరిగి రప్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. జీతం పెంచుతానని తెలిసిన మనుషుల ద్వారా కబుర్లు పెడుతున్నాడు. నయాన భయానా ఎలాగైనా సరే మరల తన వైపు అతన్ని తిప్పుకోవాలన్న తపనలో ఉన్నాడు పురుషోత్తం.
తనమీద తనకు పూర్తిగా విశ్వాసమున్న ఆదిమూర్తి ప్రతిసారీ తిరస్కరిస్తూనే ఉన్నాడు. 'అతగాడి బలహీనతల్ని పట్టుకుంటేనే గాని వ్యవహారం చక్కబడదు!' తెలిసిన స్నేహితులు ఇచ్చిన సలహా సహేతుకంగానే అనిపించింది పురుషోత్తానికి.
ఎప్పటిలాగే ఆదిమూర్తి రాత్రి ఏడు గంటలయ్యే సరికి పనులు ముగించుకొని బయటపడుతూనే ఉన్నాడు. నది మీద బోటు దాటుతూనే ఉన్నాడు. ప్రక్క ఊరు బార్ లో పీకలదాకా త్రాగుతూనే ఉన్నాడు. నచ్చిన అమ్మాయి పొందులో ఒంటి వేడిమిని చల్లార్చుకుంటూనే ఉన్నాడు.
'నువ్వు ఈ కంపెనీలో....'
పురుషోత్తాన్ని చూసి విస్తుపోయాడు ఆదిమూర్తి. కొంత అసహనం ఫీలయ్యాడు.
'ఇంత రాత్రి వేళ లక్షణమైన భార్యను ఒదిలేసి నువ్వు కూడా ఇక్కడికి....' పురుషోత్తం ఫెళ్ళున నవ్వాడు. ఆ నవ్వులో కోటి వ్యంగ్యార్ధాలు కన్పిస్తున్నాయి.
వాటన్నిటినీ ఆదిమూర్తి చాలా మాములుగా తీసుకుంటున్నాడు.
'వచ్చింది అందుకోసం కాదు.. నాకు కావాల్సిన నీ కోసం..' స్వరం తగ్గించి అటూ ఇటూ పరికించి చూస్తూ మెల్లగా అన్నాడు పురుషోత్తం.
ఆ మాటలు వింతగా ఉన్నాయి. అవి సహేతుకంగా అన్పించడం లేదు.
'ఇప్పుడు మనం పలకరించుకునే సమయం లేదు. అన్నివిధాల అలసి పోయి ఉన్నాను' ఆదిమూర్తి చిరునవ్వు పురుషోత్తాన్ని సవాలు చేస్తున్నట్లుగా ఉంది.
మాటలు లేకుండానే ఇద్దరూ మౌనంగా కలిసి నడిచారు. బోటు దాటారు. పురుషోత్తం దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అతగాడి బలహీనతల్ని బేరీజు వేసుకుంటున్నాడు.
'మందు... మగువ...' ఈ రెండు మాత్రమే ఈ ప్రపంచంలో ఆదిమూర్తిని కట్టడి చేయగలిగేవి.
' నీ హోటల్ కి వచ్చిన పేరు నీ ప్రతాపం వాళ్ళ కాదయ్యా...అది ఆదిమూర్తి వాళ్ళ!'
'.......'
'ఈగలు తోలుకున్న శాంతినివాస్ చూశావా! ఇప్పుడు ఎలా  నీలో అశాంతిని నింపుతుందో! కారణం అది ఎవరి గొప్పకాదు. ఆదిమూర్తి నిబద్ధత. అతన్ని కోల్పోయి హోటల్ మూతవడిపోయిన తర్వాత ఎదురవుతున్న మనుషుల అవహేళనలు, సానుభూతి ధోరణులు పూర్తిగా పురుషోత్తాన్ని కృంగదీస్తున్నాయి.
రాత్రనక పగలనక పథకాలు రచిస్తున్నాడు.
'ఆ రెండు ఆదిమూర్తికి సమకూర్చగల్గితే తననుండి ఇక బయటకు పోలేడు' స్థిరమైన నిర్ణయానికి కొచ్చాడు పురుషోత్తం.
సుమన మొహం మీద ఎవరో బలంగా మోదినట్లయింది. ఒక్కసారిగా షాక్ కు గురైయింది. భర్త మొహం లోకి సూటిగా చూసింది. ఆయనగారి ఉద్దేశాలు చాలా దుర్మార్గంగా తోస్తున్నాయి.
'ఏమిటి మీరనేది!'
'అవును....నేను నా వ్యాపారం కోసం....'
ఆమె కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. కోపంతో ఎర్రబడ్డాయి. అంతలోనే కన్నీళ్ళు వర్షిస్తున్నాయి.
'నేను చెప్పింది చేసి తీరాల్సిందే!' హుకుం జారీ చేస్తున్నాడు. ఆమెను మారు మాట్లాడనీయడం లేదు. తన భర్త ఎంత దుర్మార్గుదో సుమనకు తెలియంది కాదు.
తమ పెళ్లి అయిన దగ్గర నుండి డబ్బుకోసం, ప్రాపకం కోసం తనను తన పుట్టింటి వారినీ ఎంతగా వంచనకు గురిచేసింది ఒకొక్కటిగా ఆమెకు గుర్తుకు వస్తున్నాయి.
'ఆదిమూర్తి నువ్వంటే బాగా ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒప్పుకు తీరాల్సిందే! నువ్వు అతనితో సఖ్యంగా ఉంటే రోజూ బోటు దాటి పొరుగూరు పోవాల్సిన అవసరమే ఉండదు' భర్త నీచమైన ఆలోచనలు సుమనను కలవరపెడుతున్నాయి.
'కొన్నిటికోసం మరి కొన్నిటిని వదులుకోక తప్పదు. పోనీ త్యాగం చేశావనుకో....' గట్టిగానే అన్నాడు.
'......'
'ఇది వ్యాపార రహస్యం!'
భార్య మౌనం, కంట కన్నీరు పురుషోత్తానికి కొంత అర్ధమవుతూనే ఉన్నాయి. మౌనాన్ని అర్ధాంగీకారంగా భావించే వ్యక్తి అతను.
ఆదిమూర్తికి తాను ఇవ్వదలుచుకున్నవన్నీ టేబులు మీద పరిచాడు పురుషోత్తం.
'నాకేమి మొహమాటం లేదు, సుమన కూడా నీదే! అన్నీ నీ ఇష్టం!! రాత్రిళ్ళు బోట్లు దాటి రోగాలు తెచ్చుకోవడం చూడలేక నీకు ఈ ఏర్పాటు, నీ బాగు కోరుకునే వాణ్ణి నేను'. పురుషోత్తం మాటలు ఆదిమూర్తిని పులకింతకు గురిచేస్తున్నాయి. శాంతినివాస్ నుండి యధాస్థానానికి చేరిపోయాడతను.
ఉదయాన్నే సంధ్యావదనం చేసుకుంటున్న అతగాడిని నవ్వులతో పలకరించాడు.
'రోజూ వేకువజామున చేసే పూజలు ఎవరికి? వదిలే నీళ్ళు ఎవరికీ?'  అడిగాడు సుమన కొడుకు......
'చెప్పాడు ఆదిమూర్తి' అలా చెప్పడంలో కొంత నిబద్దత అగుపిస్తోంది.
'ఇన్నాల్లయింది ఎప్పుడూ నువ్వు ఈ గడివైపుకు రాలేదు!'
'మా అమ్మ మీ దగ్గరకు వెల్లొద్దంది!.'
'ఎందుకట'
'మీరు బాగా త్రాగుతారని...చెడ్డవాళ్ళని!'
'త్రాగడం తప్పు అని చెప్పిందా!'
'అవును తాగడం తప్పే!
తెలిసి మరెందుకు త్రాగుతున్నారు'
'బలహీనత!'
'అవును...బలహీనత అంటే' ఆ కుర్రాడి ప్రశ్నకు ఆదిమూర్తి దగ్గర లేదు.
'ఎవరు అలవాటు చేశారు...ఇప్పుడు ఎందుకు మానేశారు.
'మా అన్నలు....'
'.... .... .... '
'అమ్మా... ఆయన చెడ్డవాడేమో గాని నాకు మంచి వాడేనమ్మా!' కొడుకు మాటలు అర్ధం కావడం లేదు సుమనకు.
పురుషోత్తం విధించిన షరతులు ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బ్రతుకు చాలా అసహ్యంగా అన్పిస్తోంది.
'పరాయి మనిషితో తనను...' ఏడుపు ఎగిసిపడుతోంది.
ఎప్పుడూ వీధి తలుపు తీసి ఉంచే సుమన ఎందుకో తలుపువేసి నిద్రకు ఉపక్రమించింది. ఒక రాత్రి వేళ తలుపు చప్పుడయినట్లు అనిపించింది. చటుక్కున పైట చెంగును సర్దుకొని వెళ్లి తలుపు తీసింది.
అప్పుడే వస్తున్న ఆదిమూర్తి.
'మీ విషయంలో నేను కలుగ జేసుకుంటున్నాననుకోకండి. ఇది మీ స్వంత విషయం అని తెలియని దాన్ని కాదు కానీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ అలవాటు మీ జీవితాన్ని సజావుగా ఉండనీయదు'.
'... ... ...'
'ఏదైనా అయితే ఆదుకునేందుకు మీకు ఎవరూ లేరు కూడాను'
తన గదివైపు నడుచుకుంటూ వెళుతున్న ఆదిమూర్తి ఒక్క క్షణకాలం అలా ఆగిపోయాడు. ఆ నిమిషంలో సుమన.. ఆమె మంచితనం...వ్యక్తిత్వం ఓ మనిషిగా తనపై కురిపిస్తున్న ఆత్మీయతాభిమానాలు.
ఆదిమూర్తి తన్మయత్వానికి లోనవుతూనే ఉన్నాడు తలుపు దగ్గర అలికిడి అయింది. లేచి తలుపు తీశాడు ఆదిమూర్తి. ఎదురుగా హరి. నమ్మశక్యంగా లేదు. చాలా కాలం తరవాత కనిపించిన స్నేహితున్ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
'నిన్ను వెతుక్కోవడానికి ఎన్నిరోజుల నుండి కష్టపడుతున్నానో తెలుసా!' గట్టిగా కౌగిలించుకుంటూ అన్నాడు హరి. ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఉండి  వచ్చేసిన ఊరి సంగతులు.... అయిన వారి విషయాలు...కుశల ప్రశ్నలు ఆత్మీయత నిండిన పలకరింపులు, పులకింతకు గురిచేసి కాలాన్ని కొంత వెనక్కి తీసుకుపోతున్నాయి.
'నువ్వు మటుకు త్రాగి త్రాగి ఎక్కడో పతనమై పోయి ఉంటావనుకున్నాను. కానీ ఇప్పుడు ఇలా అస్త్రసన్యాసం చేసేసి....
'చెప్పాలంటే ఇప్పుడు చాలా బాగున్నావ్ ఆది!' ప్రాణ స్నేహితున్ని అభిమానంగా చూస్తూ అంటున్నాడు హరి.
'........'
'రావోయ్, గ్లాసుకు వేళయిపోయింది'
'ఆ ఆదిమూర్తి చచ్చిపోయాడ్రా హరీ!'
'ఏంటి జోకా!... లేక యుగాంతమా!!'
హరికి విషయం ఏమీ అర్ధం కావడం లేదు. ఆ గదిని పరికించి చూశాడు. ఆ వాతావరణం ఏమీ కానరావడం లేదు. చాలా శాస్త్రబద్దంగా ఉంది. చాలా ఆశ్చర్యంగాను ఉంది. ఆదిమూర్తి త్రాగుడు మానేశాడంటే నమ్మశక్యంగా లేదు.
'జులాయిలా ఉండే వాడు, మారిపోయాడంటే ఒప్పుకునేది లేదు. నువ్వు ఈ రోజు నాతో రావాల్సిందే!' హరి పట్టుపడుతున్నాడు.
'నీ విషయం ఏమీ అర్ధం కానీ వింతగా ఉంది. ఎందుకిలా జరిగింది. ఎందుకు ఇలా మారిపోయావ్!'
'తాను పురుషోత్తం హోటల్ లో చేరడం...ఆతగాడితో విభేదించి మరోచోట పని కుదుర్చుకోవడం...మరల కొద్దికాలం లోనే తిరిగి ఇక్కడికి రావడం..'
ఆదిమూర్తి మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి హరికి
"హరీ...'
'... ... ...'
'ఈ పురుషోత్తం పరమనీచుడు. అతడికి డబ్బు తప్పితే మరే పరమావదీ లేదు. ఇక్కడకు మరల వచ్చి అతగాడి దగ్గర పనిచేయడం నాకు ససేమిరా ఇష్టం లేదు. ఇక్కడికి తిరిగి రావడానికి ఇవన్నీ నాకు ప్రతిఫలంగా ఇస్తానన్నాడు.'
'... ... ...'
'అయితే సుమన...' అతని నోటిమీద చేయివేసి చెప్పడం మొదలు పెట్టాడు ఆదిమూర్తి.
'నేను ఆతగాడిని కాదని బయటకు వెళ్ళినా అన్నింటినీ తెగించిన పురుషోత్తం నా స్థానంలో మరొకరిని తీసుకువస్తాడు. వాడికి తన భార్యను ఎరవేయడానికి కూడా వెనకాడడు. మనిషిని లోబరచుకోవడానికి అన్నిటినీ ఆశగా చూపించే నైజం గల దుర్మార్గుడు.
కానీ సుమన... అమాయకురాలు.. పవిత్ర  స్త్రీమూర్తి... అన్నిటినీ మించి ఓ మంచి ఆడది. ఆమె పతనం కావడం... మరొకడి చేత చెరచబడటం నేను జీర్ణించుకోలేను. అందుకే ఇది నా ఇల్లు అనుకున్నాను. చివరి క్షణం దాకా ఆమెకు రక్షణగా ఈ గడప దాట కూడదని నిర్ణయించుకున్నాను.
బయటనుండి ఆదిమూర్తి మాటలు సుమనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె కళ్ళు ఆశ్రుధారలవుతున్నాయి. ఎన్నడూ లేనిది ఆదిమూర్తి పట్ల అచంచలమైన గౌరవ భావన ప్రోది అవుతుంది. అప్రయత్నంగా ఆమె చేతులు దగ్గరవుతున్నాయి. అవి కంపించని భగవంతుడికి... దూరంగా కనిపిస్తున్న ఆదిమూర్తికి నమస్కరిస్తున్నాయి.
హరి కంట కారుతున్న కన్నీటిలో ఆదిమూర్తి నిరుపమాన వ్యక్తిత్వం మరోమారు ప్రస్పుటమవుతూనే ఉంది.

రచయిత పరిచయం

పేరు:వడలి రాధాకృష్ణ
విద్యార్హతలు:ఎం.ఎ. పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్, ఎం.బి.ఎ. ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ (బిట్స్ పిలాని)
ఉద్యోగం: ఐటిసి లిమిటెడ్ - ఐయల్‌టీడి డివిజన్, చీరాలలో ఉద్యోగం.
సెల్ : 9985336444

రచనలు:
250 కథలు మరియు 200 పైగా కవితలు అన్ని ప్రముఖ పత్రికలు, సంకలనాలలో ప్రచురితము.
ప్రచురించిన పుస్తకాలు:'జీవనది' ,'గూటిపడవ','మనసు మూలల్లోకి' కథా సంకలనాలు ,'జలఖడ్గం' కవితా సంకలనం', అంతర్నేత్రం' కథల సంపుటి,'వట్టివేళ్ళు' నానీల సంపుటి మొదలైన వాటిని ప్రచురించి పలువురు ప్రముఖుల ప్రసంశలు అందుకున్నారు.

పొందిన పురస్కారాలు ....

క్షీరపురి సాహితీ సాంస్కృతిక సంస్థ,(పాలకొల్లు)వారు 'క్షీరపురి' విశిష్ట సాహితీ పురస్కారంతో,వెలది వెంకటేశ్వర్లు యువచైతన్య విజ్ఞానవేదిక, ఒంగోలువారి సాహితీ పురస్కారం,లక్కోజు కనకదుర్గాచార్యులు సాహితీ సంస్థ, విజయవాడ వారి సాహితీ సత్కారం. డా|| వల్లభనేని నాగేశ్వరరావు విశిష్ట సాహితీ పురస్కారం - 2007, కుర్రా కోటిసూరమ్మ స్మారక విశిష్ట సాహితీ పురస్కారం - 2008,పోగుల వెంకటరత్నమ్మ స్మారక విశిష్ట పురస్కారం, ఆంధ్ర సారస్వత సమితి (మచిలీపట్నం)వారి జి.ఉమాకాంతం, అన్నపూర్ణమ్మ స్మారక సాహిత్య ప్రతిభాపురస్కారం అందుకున్నారు.
వీరి సాహితిసేవకు ప్రతిభకు గుర్తింపుగా పి.ఎం.కె.ఎఫ్ సంస్థ (ఒంగోలు) వారు  'కవిమిత్ర ' బిరుదుతో,'సెట్ ' సంద్థ (చీరాల)వారు 'సాహితీ మిత్ర ' బిరుదుతో...శ్రీ చైతన్య భారతి సాహితీ సమాఖ్య (మార్కాపురం)వారు 'కథావిరంచి ' బిరుదుతో,భావతరంగిణి (మచిలీపట్నం)వారు 'కథారత్న'  బిరుదు ప్రదానం చేసి గౌరవించారు.. గుఱ్రం జాషువా కళా సమితి, దుగ్గిరాలవారి 'కధాప్రపూర్ణ ' బిరుదు ప్రధానం. కళాలయ సాహితీ సంస్థ, పాలకొల్లువారి 'కథాసుధానిధి ' బిరుదు,ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, పశ్చిమగోదావరి జిల్లా వారు  'భావా కవిత భారతి' బిరుదు ప్రదానం చేశారు.విశ్వభారతి (ఒంగోలు) వారిచే 'కథా బ్రహ్మ' బిరుదు ప్రధానం వంటి అనేక సత్కారాలు పొందారు కవి, రచయితా వడలి రాధాకృష్ణ ....

ముఖ్యమైన ఘట్టాలు:
'జీవనది ' కథా సంపుటి బులుసు సీతాకుమారి సాహితీ ఫౌండేషన్, మచిలీపట్నంవారి విశిష్ట సాహితీ పురస్కారం 2004కు ఎంపిక అయినది...'అంతర్నేత్రం ' కథల కధల సంపుటికి 'జగన్నాధ సాహితీ సమాఖ్య - నల్లజర్ల' వారి పురస్కారం లభించింది.

ఆరాధన సాహితీ సంస్థ, హైదరాబాద్‌వారి కథల పోటీలో 'శ్వేతసౌధం' అనే కథకు, పులికంటి సాహితీ సంస్కృతి, తిరుపతివారి కథలపోటీలలో 'రేపు ' అనే కథకు, అమ్మ, బాపుపత్రికలు, విజయవాడవారు నిర్వహించిన కథల పోటీలలో 'ముస


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!