పలకరించి చూడు

అప్పుడప్పుడు నేనంటూ లేనట్టు
నా ఉనికే మరిచినట్టు
నా నుండి తప్పుకుని పోతావు

నీవు వెళ్లిన క్షణం నుండి
క్షణం అరక్షణం పోగేస్తాను
దిక్కుతోచక కొన్నివేల
క్షణాలతో గుణిస్తాను...

లెక్కలు తెలియక 
లెక్క తేలక వాటినంతా ..
నా కంటి ముందర పోగేస్తాను

క్షణాల పోగుకు ఆవల వైపు
నీవున్నావన్న భ్రమతో, తెగని ఆశతో
క్షణం క్షణం మృదువుగా తొలగిస్తున్నా
ఆవల ఉన్న నీకు నొప్పి తగలకుండ

లెక్కలు రాని నేను
తపనగా .. తడబాటుగా
కొన్ని కోట్లక్షణాలు కుప్పగా పోసానేమో
తరిగిపోయేదెపుడో
నీవు ఈ వైపుకు నడిచి వచ్చేదెపుడో

అలసిపోతున్నాను..రాలిపోతున్నాను
అణువణువు కరిగిపోతున్నాను
క్షణాల గుంపులోకి చేరిపోతున్నాను

ఓయ్
నీకు ఎదురయ్యే ఏదైనా క్షణంలో నేనున్నానేమో
అప్పుడప్పుడు కాస్త వెతికి చూడు
కనబడితే పలకరించి చూడు...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!