అతనెంత మృదువైనవాడో
అరచేత దాచుకొని ముద్దాడాలని
ఎవరి కంట పడకుండా దాచాలని
లోలోపల నా చెంత బంధించాలని
ఎన్నెన్ని ఆశలో.. ఊహల ఉయ్యాలలో
అదేంటి
బంధించాలని ఊహ మదిని తాకి తాకకముందే
ఉగ్రజ్వాలలు చెరరేగి చెంపపెట్టు తగిలినట్టు
మనసు చిగురాకులా వణికిపోతుంది
అందుకోలేనంత ప్రేమించానంటూ
నీవు అతని బంధించరాదంది...
అతన్ని భద్రమైన చోట దాచమంది
అతనిపై యిసుమంత కోపాన్ని పెంచుకోమంది
ఒక అడుగు వెనక్కు వేయ సులువంటూ
కొత్త కొత్త పాఠాలు ఎన్నో చెప్పింది...
చివరాఖరుకి
నీకు నీవుగా బందిచబడే విద్య
మరింత పదునుగా నేర్చుకోమని..
నా వైపు కఠినమైన చూపులు సారిస్తూ
తరగని జ్ఞాన బోధ చేసింది...
ఓయ్ చూసావా
నా మది నన్ను వదిలి
నీకు కంచె కడుతుంది...
మీ ఇద్దరి మధ్యన
రాయబారం ఎప్పుడు నడిచింది??
సంధి ఎలా కుదిరింది...