సందేశం పంపాడు..

త్వరలో కలుస్తాను అంటూ
సందేశం పంపాడు అతను...

ఇప్పుడు
నా చుట్టూ రంగురంగుల ఇంద్రధనస్సు వెల్లువిరియాలి కదా ...
నా మనసు సంతోషంతో ముక్కలైపోవాలి కదా
ఆకాశాన పక్షి ఈకవలే మనసు తేలికై ఎగిరిపోవాలి కదా

ఇదేంటి మరి..
పదేపదే 'ఆకాశమంత ప్రేమిస్తున్నాను' అనే నేను
'నీలోని నేను అంటూ ' అతని అడుగుజాడలు వెతికే నేను..
అతడి ఎదురుపడడాన్ని నిర్దయగా తిరస్కరిస్తున్నానెందుకో.....

ఏమని చెప్పను...
నా మనస్సు స్తబ్దుగా
ఆలోచనలో పడిపోయింది...

నాలోనే మృదుత్వం అంత అతని మోహపుగీతాలు
ఆలాపనకి అంకితమయ్యిందేమో..
ఇప్పుడు నా చెంత ఉన్న కఠినత్వం అతనికి
ఎదురవుతుందని గుబులు కాబోలు..

అతని ఊహలతో నిండుకున్న నా మది
ఎదురైన అతని గుణగణాల తూకం
వేస్తుందని ఆరాటం కాబోలు....

అద్భుతంగా మెరిసే నా ఆలోచనలోని అతని రూపు
కనుమరుగు అవుతుందేమోననే
అనుమానం కాబోలు..

చివరాఖరికి
అతనికి సందేశం పంపాను
నీవు విడిచిపోయిన చోట
నేను లేనని
నాలా లేనని...


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!