చాలా సేపైంది..

చాలా సేపైంది
ఎంత సేపని కూర్చోను...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..

చీకట్లు కమ్మే సంజెవేళ ఎంతసేపని నిరీక్షించడం
ఆశనిరాశల తక్కెడకి ఎటుమొగ్గాలో తెలీని సందిగ్ధం
గెలుపుఓటమిల నడుమ మనసు ఆడుతోంది కోలాటం
రేపైనా వస్తావన్నది ఒక రిక్త నమ్మకం..

జీవిత చక్రాల క్రింద నలుగుతున్న రేయీపగళ్ళు..
చూస్తూండగానే పేజీలు మారిపోతున్న కేలెండర్లు !
జ్ఞాపకాల మాటున కదలాడే నీ ఊసులు
అలుపెరుగని కెరటాల లాస్యాలు
ఎంత దూరం పరుగులెట్టినా వద్దని
మళ్ళీ నీ దరికే చేరుస్తాయినన్నవి !!

ఎదురుచూపులు నావరకే ఎందుకు
నువ్వూ నాకోసం కలవరించకూడదూ..
అని తహతహలాడుతుంది మనసు
వెర్రిది.. దానికేమి తెలుసు
నీ మనసు రాయి అని
ఈ జన్మకు అది జరగని పని అని
అయినా ఎందుకో ఈ ఎదురుచూపు..
నాకోసం నువ్వొస్తావని... కలలు తెస్తావని..

చాలా సేపైంది..
ఎంతసేపని కూర్చోనూ...
వెళ్పోతే వస్తావేమోనని
ఎదురుచూస్తే రావేమోనని
ఆలోచనలోనే పొద్దుగూకింది..


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!