నువ్వు ఎప్పుడెదురుపడ్డావో
మాటెప్పుడు కలిపావో
అంతగా గుర్తులేదు కాని
నిన్ను చూశాక
అనేక ఇష్టాలు కలిపితే నువ్వని
సత్య ప్రమాణకంగా నమ్మకం కుదిరింది
అంతేనా
చికాకు పరిచే చింతలేమి లేవు
ఆరడి పెట్టే ఆలోచనలు అసలే లేవు
ఇంకా చెప్పాలంటే
నువ్వు వదిలి వెళతావని
నేను మిగిలిపోతానని
కించిత్తు అనుమానము లేదు
ఓయ్
అసలు యే రేయి
ఇంతటి నమ్మకాన్ని పంచిపోయిందో
ఈ ముగింపులేని కథ
నిజమేనని
గుర్తుకోసం కాస్త గిల్లి వెళ్ళకూడదూ