ఇటు వచ్చావెందుకు
అధాటున వచ్చావా.. అదమరచి వచ్చావా
అలజడిరేపవచ్చావా.. ఆశ్చర్యపరచవచ్చావా
ఏమనుకోవాలని వచ్చావో మరి...
అది...సరే కాని
ఇష్టం ఇష్టం అంటూ పలవరించేదానినేగా
అప్పుడు ఇప్పుడూ నీ ఆలోచనపు నీడనేగా
అద్దం వెనుక నీడలో, కన్ను దాచిన కలలో
అక్కడ ఇక్కడా అని ఏముందిలేగాని
నీ జాడ ఎరుకే కదా!
అయినా
పంతాలు ఎన్ని ఉన్నా
రాయబారాలు ఏమీ లేకున్నా
నిశ్శబ్దపు సముద్రం ఎగిసిపడుతున్నా
ఓయ్
నీకంటే ముందు
నీ రాక గుసగుసగా నన్ను చేరుతుందని
ఎలా మరిచావోయ్ రాకుమారా...