ఎవరితో పని లేదంటూ
ఒంటరినడక మొదలెట్టి చాలా కాలం అయ్యింది
నా చుట్టూ దిట్టంగా అల్లుకున్న బంధాలు
ఏ గాలికి చెదిరాయో, ఏ వానకు తడిసాయో
పలచబారి, పెలుసుబారి గాజుముక్కల్లా అయ్యాయి
మాటలనే వెల్లవేసి అంతా సరిచేద్దామనుకుంటి
అలవాటు తప్పిన పని మొదలెట్టబోతే
కరువుకాలంలో నీళ్ల మాదిరి మాటే రాకపోయే...
దగ్గర అనుకున్న వారు, దూరమై రాలుతుంటే
కంటనీరు కరువయ్యి, తప్పేదో జరిగిందని
వెనక తిరిగి చూసుకుంటే..
విడిచి వచ్చిన కాలిబాట
ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించింది...