నువ్వు నాకు పరిచయమే కదా
నాలుగు సార్లు కలిసినట్టు
నాలుగు మాటలు మాట్లాడుకున్నట్టు గుర్తు
గత జన్మలో జరిగింది కాదు కదా
కాసింత దగ్గరితనం ఉండే ఉంటుందిలే
ఎన్నెన్నో మాటలు చెప్పుకోలేదు సరే
మాట మాట కూడా అనుకోలేదుగా
మడత పేచీలు అసలెపుడూ లేనేలేవుగా
నీపై హక్కు
మొత్తంగా నాదన్న మాటే రాలేదుగా
ఎంతనో తెలియకున్నా నువ్వు నాకు దగ్గరే కదా
అప్పుడప్పుడు
మాటల నిడివి తగ్గితేనేమి
మాట వరసకైనా
ఒకసారి కనిపించమని అడగవచ్చుగా
లోలోపల చింత
మనసును పొరలు పొరలుగా చీలుస్తోంది
నీ నీడేదో నా నుండి తప్పుకుపోతున్నట్టు
ఓయ్
తప్పంతా నీదని నెపం వేయలేను
కాస్తంత అడుగ అటువైపేసి
పేచీ పడని తప్పు కాసింత నాదేనేమో