నువ్వు
రంగులేని ఆకాశం చూపిస్తావు
నిశ్శబ్దంగా ఉన్న గాలిని పలకరిస్తావు
తప్పిపోయిన ఊరిని తెచ్చి నిలబెడతావు
అంతేనా
ఎంతో మందిని కూడేసుకుని
అంతులేని కబుర్లు చెప్తావ్
వదిలి వెళ్ళిన మనుషుల్ని
వదిలి వచ్చేసిన మనుషుల్ని
తెలియని మనిషిని ...తెలుసుకోలేని మనిషిని
ఒకరా ఇద్దరా .. లెక్కే తేలదుగా
ఇవన్నీ
ఎక్కడ నేర్చుకొచ్చావ్
నది లోతుల్లో నుంచా ... సముద్రపు నురగ నుంచా
నా
కంటికి కనిపించని నలుసు కూడా
ఆకుపచ్చని కొండలా నీకు కనిపిస్తుంటే
ఏడేడు వర్ణాల ఆకాశమంత ఆశ్చర్యం వేస్తుంది నాకు....
నిజం చెప్తున్నా...
నాకు కనిపించని దేవుడు
నీ పక్కన ఉన్నట్టుంటుంది
ఎప్పుడో ఒకసారి
నాతో కూడా మాట్లాడమని చెప్పవూ
ఓయ్
అసలు...
నువ్వు లేకపోతే
ఏమైపోయేదాన్నో...