ప్రణాళికలేమి వేయను

నిను చూడాలనో ...మాట్లాడాలనో
నీతోనే పూర్తిగా ఉండిపోవాలనో
పనిగట్టుకుని ప్రణాళికలేమి వేయను

అధాటున
కాస్తంత పలకరించాలనిపిస్తుంది
చెప్పుకోదగ్గ కారణాలేమీ ఉండవు

అనిపించిందే తడవు
నీవు వచ్చి వెళ్లిన దారి కొలతలు వేస్తాను
మాట్లాడని సమయపు ఎత్తుకొలుస్తాను
సరితూగని కొలతలను అకారణంగా ద్వేషిస్తాను

పొద్దుతిరుగుడు పువ్వులా
నా చుట్టూ నేనే గీతలు గీసుకుంటూ
తిరకాసు లెక్కలు కుప్పగా పోసి
అన్నిటికీ చెల్లుగీతలు గీస్తాను

ఓయ్
సమయము లేదనే నీకు
ఊరకనే
ఓ దరఖాస్తు వేస్తాను
బుట్టదాఖాలు చేసుకో

పనిలేని పనిమంతురాలినే కదా
మరో దరఖాస్తు వేస్తానులే


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!