పనులన్నీ
అయిపోయాయి కదా
ఆశగా ఆరాగా అడుగుతానెపుడూ
అప్పుడేనా..
సంచిలో దాచుకున్న
జవాబులా గబాల్న విసురుతాడు
ఎంతకూ
తెగని పనుల చిట్టా
చెప్పకుండానే
వెనుదిరుగుదామనుకున్నా
ఇంతలో
ఎర్రచీరకు
చిన్నంచు నల్లరంగు
భలేగా ఉందంటూ మెరుపు చూపుల
ఓ మాట విసురుగా తగిలింది
హ...
అతని సమయంలో
నల్లపూసలా నను దాచుకుంటాడన్న నమ్మకం
ఇపుడు మరింత బిగుసుకుంది
ఆకాశమంత ప్రేమ మరోసారి రెక్కలు విప్పింది
పాలపుంతలోని నక్షత్రాలన్నీ ఒక్కసారిగా నేల రాలినట్టు
ఓయ్
ఇంతకూ
సమయమే లేదనే నీ పాటలో
నన్నెలా బంధించావో కాస్త చెప్పరాదూ