నల్లమబ్బు ఒకటి దారి తప్పి వచ్చింది
ఒంటరిగా ఉన్నావంటూ తోడుంటానంది
వద్దు పొమ్మంటే
సముద్రపు తీరాన గవ్వలు
తాయిలమంటూ అందించింది
ఊ అంటే
ఇంటి ముందు రాచకొలను కడతానంది
ఉండి పొమ్మంటే చాలు
మబ్బుల రాజ్యాన్నే ఇస్తానంది
ఏ ఊరు మబ్బో
మంకు పట్టు
విడవకుండా మారామూ చేస్తుంది
అప్పుడప్పుడు
మొండితనం కూడా బాగుంటుంది
అచ్చంగా నీలాగా...