వెన్నెల దుప్పటి కప్పుకుందాం - స్వాతి పంతుల

'వెన్నెల దుప్పటి కప్పుకుందాం ' అందుకున్నాను. మండు వేసవిలో వెన్నెల దుప్పటి కప్పుకోవడం  బావుంది. R. Rama Devi  గారి కవితల సంపుటి ఇది. చక్కని ప్రేమ కవిత్వం. ప్రత్యక్షంగా ఆమెని ఒకసారి కలిసేను. బ్నిం గారి ఇంట్లో. చల్లని వెన్నెల లాంటి చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడుతారు. అంతే చక్కని కవిత్వం ఆమెది. భలే ఉన్నాయి వీరి కవితలు.
కవితల నిండా 'అతడు'  ' ఆమె' వారి మధ్య ప్రేమ. 'నా మాట'లో అంటారు - ప్రేమించడం అన్నది ఏ బంధంలోనైనా కావచ్చు కానీ అవతల వైపు 'అతను' అన్న భావన తెలియని మృదుత్వాన్ని దోసిట్లో అందిస్తుంది. అందుకే కవితల్లో  ' అతను' అని . ఎన్ని వేలసార్లు అయినా ఇసుమంతైనా విసుగు లేక పదేపదే ప్రేమ ప్రశంస చేస్తూనే ఉంటాను' నేను' ,' నువ్వు ' అనే అక్షరాలు చెరిగిపోయే వరకు అని కూడా అంటారు.

ఈ కవితలలో' ఆమె'
'అతని'ని నిలదీస్తూ ఉంటుంది ,ప్రశ్నిస్తూ ఉంటుంది. తిరిగి 'ఆమే ' సమాధాన పడుతుంది. పరుషంగా ఓ రెండు మాటలు అంటుంది. తర్వాత అయ్యో ఎందుకిలా అన్నాను అని బాధా పడుతుంది.  ఎక్కడికి పోతాడులే అన్న పొగరు ప్రదర్శిస్తుంది ఏమైపోతాడో అన్న బెంగా ఉంటుంది. పసిపాపలా గారాలు పోతుంది ,అమ్మలా లాలిస్తుంది.  ఏమైనా కానీ నువ్వు నా వాడివే అన్న ధీమా 'ఆమె'లో ఉంటుంది.కానీ , ' అతని ' కోసమై 'ఆమె' అంతు తెలియని నిరీక్షణ ఉంటుంది.

ఎప్పటికోయ్ విడివడేది

నీ బొమ్మ గీయాలని మొదలెడతాను
అదేమి చిత్రమో గీసిన ప్రతిసారి
కొత్త రూపు గీయబడుతుంది
ఒకసారి అంతులేని నక్షత్రాలు

మరోసారి అందుకోలేని శిఖరాలు
ఎన్నిసార్లో అంతు తెలియని సముద్రాలు
కొత్త కొత్త రంగుల కలయికతో
గీయబడుతుంది అలవికాని గీతలతో

ఎన్నోసార్లు
చిత్రము పూర్తయిందన్న మరుక్షణం
మరో చిత్రానికి రూపకల్పన మొదలవుతుంది

అంతేకాదోయ్
నీవు అణువణువు తెలుసు
అనుకున్న ప్రతిసారి
అంతులేని పాలపుంతలు
అనుకోని సముద్రపు అగాధాలు అల్లకల్లోలం సృష్టిస్తాయి
మరో కొత్త రూపుకు జన్మనిస్తాయి

ఎప్పటికోయ్
నీ రూపం మది నుండి విడివడేది
అపురూప చిత్తరువుగా మలచబడేది!

'వెన్నెల దుప్పటి కప్పుకుందాం. అందించిన మీకు...అభినందనలు రమాదేవి గారు - స్వాతి పంతుల 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!