దుప్పటి' కప్పుకున్న - ఆర్ రమాదేవి కవిత్వం - ఎ.రజాహుస్సేన్.

*కొత్త పుస్తకం…114 - వెన్నెల దుప్పటి' కప్పుకున్న ఆర్ రమాదేవి
కవిత్వం….!!

*పచ్చ బొట్టు సాక్షిగా..ఆమె మృదుత్వపు పదాలను ఎవరో దొంగలించారు..!
*అతను వస్తే బాగుండు..వెన్నెల దుప్పటి తెస్తాడు..!!
*అలికిడి చేయక ఆకాశ నక్షత్రమై దడికడతా!
*నేనో చెదరని రంగయ్యే వరకు కాస్త వేచివుండు..!!
*కాలం అంచున ఎదురు చూపు ఇపుడు నా వంతు…!!
*ప్రేమను తూకం వేయడం అంటే…? నీకు నువ్వు ఖరీదు కట్టుకోవడమే'!!
*ఆకాశం కింద,ఆరుబయల్లో పున్నమి వెన్నెల దుప్పటికప్పుకుంటే ఎలావుంటుందో.. " రమాదేవి" కవిత్వం అలా వుంటుంది...

ఫేస్బుక్ లో విస్తృతంగా రాస్తున్నారు రమాదేవి.ఈమె.. 'ప్రేమ' కవయిత్రి..ప్రేమ ఖవిత్వం రాయడంలో దిట్ట..ఇన్నాళ్ళు రాసిన కవిత్వంలో కొన్ని కవితలను యేర్చి కూర్చి "వెన్నెల దుప్పటి కప్పుకుందాం" శీర్షికతో తొలికవితా సంపుటి తెచ్చారు.తెలుగుదనం ఉట్టిపడే శీర్షిక..ఈ కవిత్వానికి చక్కగా అతికినట్లుంది..!

సృష్టిలో ప్రేమ..విశ్వజనీనమైంది.ఈ కవయిత్రి ప్రేమజీవి..ప్రేమించడం గొప్పా? ప్రేమించబడటం గొప్పా? అంటే
'ప్రేమించడమే గొప్ప' …అంటుంది రమాదేవి.ఆకాశమంతగా ప్రేమిస్తూనే‌ వుండాలన్నది ఆమె కోరిక. ప్రేమ అంటే ఇద్దరి మధ్య వుండేది.లోక వ్యవహారంలో అయితే స్త్రీ పురుషుల మధ్యవుండే ప్రేమ. ఇది లౌకికం. అయితే అలౌకికమైన ప్రేమ కూడా వుంది.ఇందులో కూడా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వుంటుంది..కానీ అది అలౌకకికం. శారీరక లౌకిక  కలయికలతో సంబంధం లేని అలౌకిక ప్రేమ ఇది.పూర్తిగా మనోవీథిలో సంచరించే ప్రేమ భావన, ప్రేమైక జీవనం దీనికి మూలం..ఈ కవిత్వంలో కనబడే అతను… 'ఊహా' జనితుడు.అలౌకిక ప్రేమ'రసైక' జీవి..
ఇక ఆమె..సాక్షాత్తు కవయిత్రే.. అందుకే ఈమె...ఎన్నిసార్లయినా ఇసుమంతైనా విసుగు లేకుండా  పదే పదే ప్రేమ ప్రకటన చేస్తూ వుంటుంది. లౌకికమైన 'నేను', ' నువ్వు' అనే అక్షరాలు …చెరిగిపోయేవరకూ ప్రేమను పంచుతూనే వుంటుంది. "ప్రేమించడమంటే….నన్ను నేను కోల్పోవడం కాదు.నాతో 'అతడి'ని కూడా దాచుకోవడం. నేనుంటే అతనూ వుంటాడు.నేను తనతో లేకపోతే అతను వుండడు. అతడు అన్న భావన ఆమెతో మాత్రమే..ముడిపడివుంది. చాలా మంది అంటుంటారు. ప్రేమ ఏం చేస్తుందని? ప్రేమ మానసికమైంది. అది ఒక్క మనసుకే తెలుస్తుంది"అంటారు ఈ కవయిత్రి ఆర్.రమాదేవి.‌!!

రమాదేవి ఓ ప్రత్యేక డిక్షన్ తో  ప్రేమ కవితల్ని రాస్తున్నారు..ప్రేమ కవిత్వమంటే చులకనగా చూసే వాళ్ళకు రమాదేవి కవిత్వమే సమాధానం.ఓ సున్నితమైన భావాన్ని అంతే  సున్నితంగా చెప్పి మెప్పించడం అంత తేలికేం కాదు.చేయితిరిగినచిత్రకారుడు గీసిన బొమ్మలా… అందంగా‌ చెప్పగలగాలి.అలా  చెప్పింది నేరుగా పాఠకుడి ❤️ గుండెను తాకాలి. అప్పుడే ప్రేమ కవిత్వం '‌ రస ' స్థితిని పొందుతుంది..!

రమాదేవి ప్రేమ కవితల్లో ఓ గమ్మత్తైన మత్తు వుంటుంది.అది భ్రమరం పూల తేనె‌ తాగితే‌ కలిగే పరవశం. పున్నమిలో వెన్నెల దుప్పటి కప్పుకున్నఅనుభూతి...వేసవిలో మల్లెలతో సావాసం. ఒక్క మాటలో చెప్పాలంటే యేళ్ళ తరబడి నిరీక్షణ ముగిసిన ఆ క్షణంలో అతను కళ్ళముందు ప్రత్యక్షమైతే మనసు మొగ్గతొడిగిన‌ సంపెంగవుతుంది. ప్రేమ పరిమళం గుప్పుమన్న ఫీలింగ్ కలుగుతుంది..రమాదేవి కవిత్వం ఇంచుమించు ఇలానే వుంటుంది..!! ఈ కవితా సంపుటిలో 90కు పైగా కవితలున్నాయి.దాదాపు అన్నీ రమాదేవి ప్రేమ కవితలే.. ;

"ప్రేమ ఏం చేస్తుందని
ఆశ్చర్యంగా అడిగే మనుషులు
నాకు ఎప్పుడూ వింతేనోయ్
ప్రేమిస్తూ ప్రేమిస్తూ
మనసు మరింత సున్నితత్వం
అద్దుకుంటుందని
ఈర్ష్య అసూయ ద్వేషం
ముళ్ళ చిక్కులు విడదీసుకొని
గంధపు లేపనం అద్దుకుంటుందని
ప్రేమ తెలీని వారికి తెలిపేలా?
ప్రేమకు అలవికాని
రంగులు అద్దుతూ అద్భుతాలు
సృష్టిస్తూనే ఉంటుందని
ప్రేమ తెలియని వారికి వివరించేదెలా?
ఒక్కసారి ప్రేమించి చూడు
నీవు నీవుగా వుండి
ఆకాశమంత ప్రేమించు
కంటి ముందు
రూపం నిలవనంతగా
సముద్రమంత ప్రేమించు
ప్రేమ లోగిలిలో అడుగుపెట్టి చూడు
నీ…నా…రేఖలు చెరిగిపోతాయి
ప్రేమ తప్ప మరొకటి కనిపించిందని
ఆత్మసాక్షిగా చెబుతున్నా
అనుసరించి చూడు"!  - -(రమాదేవి)

ఈ ఒక్క కవితా చాలు రమాదేవి ప్రేమ కవిత్వాన్ని తూచడానికి…ఒక్కసారి ప్రేమించి చూడు.. ఆకాశం కూడా ఒంగి నీ ముందు సలాం చేస్తుంది.‌ లోకమంతా ప్రేమమయ మవుతుంది. ప్రేమగురించి తెలిసినవారికి చెప్పొచ్చుగానీ,తెలియని వారికి ఎలా చెప్పాలన్నది ఆమె ప్రశ్న?

*అతడు..ఆమె..
ఇదో.. ప్రేమకథ..!!
ఇదో ప్రేమకథ.అంతులేని కథ‌.వాళ్ళిద్దరి కథ. ఇద్దరూ కలిసినట్టే వుంటారు.కానీ,....కలిసిన దాఖలాల్లేవు.వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు.తడబాటుతో పాటు ప్రేమ కూడా వుంది.కాకపోతే, అది ఇంకా ఒక రూపానికి రాలేదు..ఎప్పుడొస్తుందో తెలీదు.అయితే..,ప్రేమకు మార్పు…. ముగింపేదీ లేదన్నది ఈ ప్రేమ కథ పిండితార్థం..

"ఏమోయ్..!
ఓ కథ చెప్పుకుందామా?
అనగనగా ఒక ఊరు
అక్కడ
ఒక నువ్వు
ఒక నేను
మరొక నేను
ఇంకొక నేను
అలా అలా
అనేక అనేక నేను ఓ నువ్వు"!!

ఆమె అనేక రూపాలు..అతడు మాత్రం ఒక్కడే.(ఏకత్వం)అతడికోసం ఆమె నిరీక్షణ..అన్వేషణ..!

"నా చెవి లోలాకు నీ మాటకై
నా కాలిపట్టా నీ అడుగుల జాడకై
నా చేతి గాజులు నీ రాకకై
వెతుకుతుంది
నీ మౌనం తెలిసి కూడా
దరిదాపుల్లో లేని నీకోసం
నా నీడ  వేచి ఉంది...
బహుశా
నీ రంగుల జ్ఞాపకాల్లో బందీనై
నన్ను నేను మరిచానేమో"!!
             *ఆర్.రమాదేవి.!!

అతడామెప్రియుడు.అతడంటే ఆమెకు ఎనలేని ప్రేమ.ఎంతంటే? మాటల్లో చెప్పలేనంత. ఆమె అణువణువేకాదు..చివరకు  ఒంటిమీద ధరించిన ఆభరణాలు… కూడాఅతడి రాకకై ఎదురు చూస్తుంటాయట.అతని మాట వినాలని 'చెవిలోలాకు' అతనిఅడుగుల జాడకోసం ఆమె ' కాలిపట్టా'అతడి రాక కోసం ఎదురు చూస్తూ 'చేతగాజులు'ఎదురు చూస్తున్నాయి.అంతే.. కాదు.అతడి మౌనం తెలిసి కూడా దరిదాపుల్లో లేని అతడికోసం ఆమె ' నీడ ' వేచి ఉంది.అంతెందుకు.?అతని రంగుల జ్ఞాపకాల్లో బందీయై తన్ను తాను మరిచిపోయింది.!

*దిగంతాల ప్రేమ ఆమె సొంతం..!!
*కలడో! లేడో? కలనైనా రాడో..?
అన్న సంశయం ఆమె  సొంతం..!!
దిగంతాల ప్రేమను తమలో ఇమడ్చుకోవడం,
కవిత్వంలో ప్రేమ రసభావనను మిస్ కాకుండా చూసుకోవడం వల్ల రమాదేవి కవిత్వంలో
'ప్రేమముడి' కనిపిస్తుంది.. ప్రేమ తడి తగులుతుంది. చెలిమికోసం స్నేహ హస్తం అందిస్తుంది.స్వప్నంలా సాక్షాత్కరిస్తుంది.ఓ‌ మధురాను భూతిలానిలుస్తుంది.భావనాత్మకమే అయినా ప్రేమ శేషం ఆత్మాశ్రయంలా భ్రమింప జేయడం ఈ కవయిత్రి కవనంలోని విశేషం.!!

రమాదేవి ఇతర కవితల్లో మాదిరిగానే,ఇందులో కూడా ప్రియసఖుడి కోసం ఎదురు చూసే ప్రియురాలు‌  కనిపిస్తుంది.చూడ్డానికి ఆత్మాశ్రయంలా అనిపిస్తుంది.అదే ఈమె ప్రేమ కవితల్లో‌ వున్న మత్తు‌…గమ్మత్తు..!
"ఎవరెవరో ఎదురుపడతారు
మరెవరో పలకరిస్తారు
నువ్వు రావని తెలుసు
ఇక్కడ లేవని తెలుసు
కంటికి ఆనవు .. మదిని తాకవు
అయినా  తెలిసి తెలిసి
అందరిలో నిన్ను వెతుకుతా
అలసిపోతానేమో .అణగారిపోతానేమో
ఆక్రందనలు చేస్తానేమో ...
అయితేనెం....
ఓడిపోయానని ఒప్పుకోలేను
నిన్ను వదిలి నేను తప్పుకోలేను
నీవున్న తావుకు నిదురనై వస్తా
ఆకాశపు రెక్కల పక్షినై
నీ కలలో విహరిస్తా....
ముడుచుకున్న నత్తగుల్లవోలె
నీలోలోపల దాగిపోతా...
నిజంగా నిజం చెబుతున్నా
తడియారిన నా కన్నుల సాక్షిగా."!!

మనసు పిచ్చిది. మాటవినదు‌.ఎంత సంబాళించు కుందామనుకున్నా..కుదరడంలేదు… తాను ఓడిపోయానని ఒప్పుకోలేదు..అలాగని అతడ్ని వదిలి  తప్పుకోనూ లేదు.. ముడుచుకున్న నత్తగుల్లలా,అతడి లోలోపల దాగిపోవాలని పిస్తుంటుందట. జీవితం ఎంత చిత్రమైంది..జీవన యానంలో ఎవరెవరో ఎదురుపడతారు ..మరెవరో పలకరిస్తారు..కానీ అతడి జాడమాత్రం తెలీదు… అతడు  రాడని  తెలుసు.. ఇక్కడ లేడనీ… తెలుసు..అసలు కంటికి ఆనడు. మదిని తాకడు.. అయినా  తెలిసి తెలిసి అందరిలో అతడినే వెతుకుతూ వుంటుంది..ఈ వెదుకులాటలోఅలసిపోతుందో ...అణగారిపోతుందో ..లేక ఆక్రందనలే చేస్తుందో తనకే  తెలీడం లేదు.‌ ఏమీ తెలియని ఓ అస్పష్టత.తనకే తెలీని ఓ మాయపొర తన చుట్టూ కప్పేసివుంది..

అయితేనేం..?
ఓడిపోయానని మాత్రం ఒప్పుకోదు. అతడ్నివదిలి తను  తప్పుకోనూ లేదు..తీరాన్ని చేర లేక..సముద్రాన్ని వీడలేక సతమతమయ్యే 'అల '  పరిస్థితి ఆమెది.‌ ఇప్పుడు ఆమె… మానసం కల్లోల జలధి.గమ్యం తెలీని సారధి.అంతమేలేని వారధి. అతడున్న చోటికి  నిదురగానైనా వెళ్ళాలని.. ఆకాశపు రెక్కల పక్షై అతడి కలలో విహరించాలనుకుంటోంది…

అంతేనా?
ముడుచుకున్న నత్తగుల్లలా అతడి లోలోపలే దాగిపోమనుకుంటోంది..ఇదేదో సొల్లు కబుర్లు
అనుకుంటాడేమో అతగాడు‌.. నిజంగా నిజమే  చెబుతున్నా సఖా ! అంటూ తడారిన కన్నుల సాక్షిగా చెబుతోంది…

అయినా…
తన గోడు అతడు వింటాడా?
తనకోసం తిరిగి వస్తాడా..?
తమ ప్రేమకు శుభం కార్డు పడుతుందా?
ఏమో…?
రమాదేవి కవిత్వంలోభ్రాంతి కనిపిస్తుంది...
‘కలడో..! లేడో ? అసలు  వస్తాడో! రాడో..? అన్న భావన చుట్టే రమాదేవి కవిత్వం కూడా  చక్కర్లుకొడుతుంటుంది.అదే  భ్రాంతిలో కనీసం ఒక్కసారి కలలోఅయినా కనిపిస్తే.‌చాలు అనే స్థితి ఆమెది. లేనిది  వున్నట్లు వూహించుకుంటూ..ఆ ఊహల్లోనే..ఆ ఊసుల్లోనే బతికే మనో విభ్రాంతే రమాదేవిది కూడా…

మనుషులు వేరైనా….
దేహాలు రెండైనా…..
గుండె మాత్రం ఒక్కటే…
స్పందన కూడా సేమ్ టు సేమ్..
అదే ప్రేమ..అదే భావన..అదే నిరీక్షణ
అవే ఎదురు చూపులు…
ఒక్కసారి ప్రేమించి చూడు..నీకేతెలుస్తుంది.
ఆ ఎదురుచూపులు,నీరీక్షణలో వున్న మజా.
అయినా..వెతుకులాట ముగిసినప్పుడే కదా?
లెక్క ప్రేమ తేలేది.!

"ఏదో ఒకనాడు అతడొస్తాడు..అతడు ఎదురైతే ఏడేడు సముద్రాలు కనిపిస్తాయి. (ఆమె కోసంఅవన్నీ దాటివచ్చాడతడు.) అందులో అతడి ఆనవాలుకోసం వెదుకుతుందామె....
అతడి ఆనవాళ్ళు ఒడిసిపట్టిన ప్రతీ చోటా ఆమె హృదయం  కొంచెం,కొంచెంగా కరిగిపోతుంది…ఇంకా ఒక్క ముక్క కూడా మిగలకుండా..!

అతడెప్పుడూ‌ ప్రియ శత్రువే.అతడ్ని రాతిగోడల మధ్యన వదిలేసి వెళ్లింది. మనుషులు తిరుగాడని చోట రాల్చేసి వెళ్లింది.చివరాఖరికి పూలవనంలోనే పాతేసి వెళ్లింది..
అయినా …
తాను వెళ్ళిన ప్రతి చోటికి తనకంటే ముందు చేరిపోతాడతడు
అయ్యోపాపం అని నన్ను అందరూ అంటుంటే సరదా పడతాడతడు
తనుంచి తప్పుకోమని ఎన్నిసార్లు చెప్పినా. సిగ్గుమాలినతనం అరువు తెచ్చుకున్నాడేమో
తనచుట్టూ లక్ష్మణరేఖలు గీస్తుంటాడు…
అయినా ఎవరడతడు?
ఓ రాలిపోయిన జ్ఞాపకమే కదా!
వీడి వెళ్ళననే తలబిరుసుతనం,పెంకితనం ఎందుకు?" ఏది ఏమైనా ఇటు అడిగేయకు
నా దరిచేరకు..ఓ ప్రియశత్రువా నన్ను ఇలా ఉండనివ్వు కొంతకాలం మరి కొంతకాలం" అంటోందామె..!!

అయినా…
"ప్రేమను తూకం వేయడం
ఎక్కడ నేర్చుకున్నావ్?
నాతో నడిచిన అడుగు చెబుతుందా
గడిచిన గతం చెబుతుందా!
నీవు వినే మాట చెబుతుందా!
నేను అనే మాట చెబుతుందా!
నీ ఊహ చెబుతుందా !
నా భావం చెపుతుందా!
మరులుగొన్న మది చెబుతుందా !
మరిచి పొమ్మనే మధువు చెబుతుందా!
ఏది చెపుతుంది...
ప్రేమలోని నాణ్యతను
ప్రేమను పంచడం కష్టం
బంధించడం మరింత కష్టం
...........
తూకం వేయడం అంటే
నీకు నువ్వు ఖరీదు కట్టుకోవడమే!!
ప్రేమంటే ఏమిటి? దానికి కొలమానం వుంటుందా?వుంటేదాన్ని తూకం వేయడం ఎలా?ప్రేమలో  నాణ్యత వుంటుందా? వుంటే దాన్ని నిగ్గుతీయడం ఎలా? అయినా…ప్రేమకు  తూకం,నాణ్యత లేమిటీ? పిచ్చిగాకపోతేను? ప్రేమను పంచడం కష్టం.బంధించడం మరింతకష్టం. అంచనా వేయడం ఇంకా కష్టం.
అయినా…
ప్రేమను తూకం వేయడం అంటే…?
'నీకు నువ్వు ఖరీదు కట్టుకోవడమే' అంటున్నారు రమాదేవి.!!

ఈ కవిత్వం మొత్తం అతగాడి చుట్టే తిరుగుతుంది.అసలతగిడున్నాడా!అంటే..ఉన్నాడు..లేడు కూడా.నిజానికతడు ఓ ఊహాజనితుడే. కానీ ఆమె గుండెలో తిష్ట వేసుకొన్నాడు.
"అందుకే జీవితంపై నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు...అది ఏది ఇచ్చినా నా దోసిట ఒడిసి పడతాను...అది ఇచ్చేది నా దోసిట పిడికెడు ఇసుకే కావొచ్చు, గులాబి మొగ్గేకావొచ్చు, తుమ్మముళ్ళే కానీ,గులక రాయేకానీ,రంగుల నెమలీకలా నామనసంతా  జ్ఞాపకాలై నిండిపోతాయేమో..ఇది నేను నమ్మే నిజం .మిమ్మల్ని నమ్మమని అడగలేను నమ్మొద్దని శాసించ లేను.

"ఏదో ఒకసమయం.. నేను ఏమి ఆలోచించడం లేదనుకుంటూనే ఉన్నపుడు.నా మనసు ఉల్లాసంగా పడవ ప్రయాణానికి వెళ్తుంది…అందుకు సాక్ష్యం తనతో తెచ్చే ఇసుకరేణువులు.. దోసిట ఉన్న ఇసుకతో ఈ తడి ఇసుకని కలిపి పిచ్చుక గూడు చేస్తాను.....అలసిన మనసు వడలిన ఆకుతో వస్తే గులాబీ మొగ్గని తోడుగా చేసి జీవం పోస్తా!.. చెమ్మగిల్లిన మన
సు తడితో  తుమ్మ ముల్లునే గులాబి ముళ్ళుగా మారుస్తా...ఏదైనా చేయగలను జీవిత మిచ్చిన ఇన్ని బహుమతులు ఒదిగి ఒదిగినా దోసిలి నిండుగా ఆ బహుమతులకు నేను రంగుల కాగితంతో అలంకరిస్తున్న… నెమలీక లాంటి నువ్వు ఎదురైతే అందిద్దామని"..అంటోంది ఆమె...ప్రేమ పట్ల రమాదేవి గారికి ఓ స్పష్టమైన అవగాహన వుంది.

అందుకే…,
"ఇలా నువ్వుండిపోవా!

నుదుటి మీది కుంకుమల్లె నువ్వుండిపో!
పెదవిమీది నవ్వల్లె నువ్వుండిపో
బుగ్గమీది చుక్కల్లె నువ్వుండిపో...
ఎదలోని బాధల్లె నువ్వుండిపో!
ఒడిలోని పాపల్లె నువ్వుండిపో...
వెలలేని నీడల్లే నువ్వుండిపో
చెంపమీది దెబ్బల్లె నువ్వుండిపో...
మేను మీది తళుకల్లె నువ్వుండిపో..
కొండ మీది దేవుడల్లె నువ్వుండిపో..
కంటిలోని తడిలా నువ్వుండిపో...
కలలోని కథలా నువ్వుండిపో
గుడిలోని దీపంలా నువ్వుండిపో...

అంటూ‌ ఆమె అతడ్నివేడుకుంటుంది.'..
మరి అతడు అనుగ్రహిస్తాడా?
అంటే…..,
"అతను రోజు ఎదురు పడతాడు. కరకు మనసుకరిగించాలని కాబోలు.. రోజూ చిరునవ్వే బదులేమి అందకున్నా,అతను
ఎదురుపడని రోజు రహదారి అంచుల్లో చిరునవ్వులు తన నీడలో ఒదిగిన అడుగుజాడలు కరకు మనసుకుకబుర్లు వినిపించేవి. తన ఊహలకు రంగులు వేసే అలవాటు కాబోలు,అనుమతి లేని అతడు  ఆక్రమించాడు"

స్వప్నాలు వెతుక్కునే దారిలోఎన్నో మలుపులు..  ప్రతీ మలుపులో అతిదగ్గరగా అతడే..‌ అందనంత దూరంలో..  ఆకాశమంత అతడే అయినా అతగాడి ధోరణి సరిగా లేదు.ఆమెతో పరుషంగా మాట్లాడాడు.ఇది ఆమె ఊహించని పరిణామం. అతని పరుషపు మాటలకుమనసు చిద్రమై ముక్కలుముక్కలై ఎక్కడో రాలాయి..అయినా...ఆమె గిజిగాడు గూడు లాగా...అతని చుట్టూ అల్లుకుపోతూనే వుంది. అది ప్రేమో ఆరాధనో వెర్రో..తెలుసుకునే తెలివిరానేలేదు..
అతడికోసం ఆమె  దాచిన మాటలు విసిగి వేసారి కరిగి నీరైపోయాయి.అవసరానికి ఒక్కటి కూడా మిగల్లేదు.నిన్నఏమయిందో? రేపు ఏమవుతుందో? అయినా ఆమెఅతడి కోసం కాలం లెక్కింపు కొనసాగిస్తూనే ఉంది.
అతడుబంధం తెంచుకుంటే...ఆమె ప్రేమ మరుగునపడుతుందా?అతడ్ని మరిచి
పోతుందా?.అతడి జ్ఞాపకాలకు కొత్తరంగులద్ది....మరువలేని బంధంతోమది నింపుతా నంటోంది .ఆమె.!!

అతడు ఎప్పటినుంచో  తెలుసు.అయినా ఆమెకు అతడు"మొదలు పెట్టిన ఉత్తరమే ఇప్పటికీ " దాగుడుమూతలు ఆడే మనసుకి కళ్లెం వేయాలంటే ప్రణయమో?ప్రళయమో? దరి చేరాలి.లేదంటే యోగినో,భైరాగినోఅయ్యితీరాలి కాబోలు అంటూ..తనను తాను ఓదార్చుకుంటోంది.!!

అతడంటే ఆమెకు ఎంతో  ఇష్టం.ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా ఆమెకు అలుపు రాదు.
బహుశా  ఆ ఇష్టంలో అతడు..ఆమె..అతడిలో ఆమె...ఆమెలో అతడు ఉన్నందుకు కాబోలు…!
చివరకు….ఆరోజు రానే వచ్చింది…!!
ప్రతి చినుకు ఓ సంద్రమై కోటి సముద్రాలగా మారి ఆమెను తనలో కలుపుకున్నాడు.
ఇప్పుడు ఆమె  లేదు.  అతడు కూడా లేడు
ఓ ఉదృతి  ఓ విస్పోటం...నిశ్శబ్దం.నిశ్చలమైన. ఓ నిశ్శబ్దం..!

ప్రేమికుల మధ్య ఎడబాటు,తడబాట్లు సహజమే అయినాఅవి ఎంతోకాలం నిలవవు.ఇప్పుడీ ప్రేమ ఈక్వేషన్ మారింది..ఒకటి ఒకటి ఈజ్ ఈక్వల్ టు ఒకటే..ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే గొంతుకతో పాడుకునే యుగళ గీతం.అదండీ సంగతి.‌.ఈ ప్రేమకథకు ఇలా శుభం కార్డు పడింది.

రమాదేవి ప్రేమకవిత్వం ఇది.ప్రేమకు వర్ణముందో తెలీదు కానీ..ఆమె ప్రేమ మాత్రం ఏడురంగుల ఇంద్ర ధనుస్సు…అది ఒయాసిస్సుల్లో సైతం తుపానుల్ని తెప్పించగలదు..అమవాస రోజున వెన్నెల్ని కురిపించగలదు. ప్రేమలో నిజాయితీ వుంటే ఏదైనా సాధ్యమే అన్నది రమాదేవి సిద్ధాంతం..

ఎండలు మండిపోతున్న ఈ సమయంలో ఇలాంటి కవిత్వం చదివితే మల్లెపూల వాసన చూసినట్టు మనసుకు కాస్తంత ఊరట లభిస్తుంది..రాత్రిపూట ఈ కవిత్వాన్ని వెన్నెల దుప్పటిగా కప్పుకొని చూడండి .ప్రేమంటే…ఏమిటో? దాని అవసరం ఏమిటో తెలుస్తుంది.అదొక అలవికాని అద్భుతం..మరి ఆ అద్భుతం ఎలా వుంటుందో చూడాలంటే వెంటనేరమాదేవి ' వెన్నెల దుప్పటిని కప్పుకోండి'అదేనండీ…చదవండి..

*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!