మీకేమైనా తెలుసా

నేను నా పాత కంపెనీ లో పని చేసేప్పుడు , విజయ్ కుమారు గారని ఉండేవారు . ఆయన స్వతః తమిళుడు . చిన్నపుడే వచ్చి వరంగల్ లో స్థిరపడ్డారు. ఆయన చుట్టాలు అంతా తమిళనాడు లో ఉన్నారు.

అవి పోయిన ఏడాది జనవరి రోజులు. తెలంగాణా ఉద్యమం రాజకీయ నాయకుల నుంచి విద్యార్ధులకి పాకుతున్నది. కెసిఆర్ గారు ఆంధ్రులని(తెలుగు వాళ్ళని కాదు కోస్త ఆంధ్ర వాళ్ళని) మాటలతో నరకడం , బొంద పెట్టడం చేస్తున్నారు.ఆ పిచ్చి ని (బహుశా పిచ్చి మాకేనేమో ) చూసి అంతా నవ్వుకునే వాళ్ళం. విజయ్ గారు కూడా “ఎంటండి వీళ్ళు చెప్పేది , ప్ర్రత్యేక రాష్ట్రము వస్తే చదువు లేని వాడికి ఉద్యోగం ఇస్తారా , పెట్రోలు ,రెంట్లు తగ్గిస్తారా . మద్య తరగతి , బీదవాడి బ్రతుకులు ఎప్పటికి మారవు ” అనే వారు.ఆయన ప్రతి వారాంతం హైదరాబాద్ నుంచి వరంగల్ కి రైల్లో ప్రయాణం చేసేవారు.ఓ సోమ వారం అందరం భోజనం చేస్తున్నాం. ఆ రోజు వార్తల్లో “తెలంగాణా కోసమని ఓ విద్యార్ధి బలి ”అని చదివాను.మనసు వికలమైంది. వీళ్ళని ఎందుకు ఉద్యమం లోకి లాగారండి అన్నాను.విజయ్ గారి గొంతులో మార్పు “మాది మాకు కావాలండి.తెలంగాణా ఇవ్వల్సినదే.” ఎందుకు సర్ అంటే అదంతా తెలీదు కావాలి అంతే. అన్నారు.పోను పోను ఆఫీసు లో మనం అనే మాట కన్నా మీరు మేము అనే మాట వినపడడం సాధారణం అయింది.

నాకు ఓ స్నేహితుడు ఉన్నాడు. తను నల్గొండకి చెందినవాడు. మమ్మల్ని సరదాగా ఆట పట్టించే వాడు “మీరంతా అన్నీ సర్దుకొని ఉండండి రోయ్” అని. తను అప్పుడు బెంగుళూరు లో ఓ పెద్ద కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాడు.

ఓ రోజు విజయవాడ లో రైలు ఎక్కాము . వైజాగ్ నుంచి కిక్కిరిసి వస్తుంది. వరంగల్లు రాగానే ఓ ఆమె ఎక్కి “ఈ ఆంధ్ర , సీమ వాళ్ళని దిన్చేస్తే సరిపోద్ది ఫ్రీ గ వెళ్ళ వచ్చు ” అంది. ఎవ్వరు కిక్కురుమనలేదు.

గొడవ జరిగేప్పుడు , ఎవ్వరు బండి ఆపి AP అని చెరిపి TG అని రాస్తారో అని భయం. మళ్ళి traffic వాడు పట్టుకుంటే చలానా కట్టలిగా.

నిన్న శనివారం బయటకి వెళ్తున్నా. ఓ ౩౦ మంది విద్యార్దులు నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. “తెలంగాణాకి అడ్డం వస్తే అడ్డం గ నరికేస్తం ”అని . “ఆంధ్ర వాళ్ళని ” అని తగిలించాడో పసుపు చొక్క వేసుకున్న విద్యార్ధి.

కొబ్బరి బొండం తాగాలని ఓ బండి దగ్గర ఆగాను.భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళది రాజమండ్రి ల ఉంది,యాస అలానే ఉంది. ఒక తాగు  బోతువాడు వచ్చి విసిగిస్తున్నాడు.ఒక సారి  ఇక్కడే తాగుతాను, ఇంటికి తీసుకెళ్త అని. సర్ది చెప్పేందుకు ఇబ్బంది పడుతుంది ఆమె.పక్కన ఉన్న ఓ కుర్రవాడు “ఎందుకయ్య గొడవ వెళ్ళు ” అని సర్ది చెప్పబోయాడు. “జై తెలంగాణా వస్తుంది, మీరు మొత్తం వెళ్లి పోతారు, నాకు ఇక్కడ MLA తెల్సు  ” అన్నాడు. పాపం ఆ దంపతులు  తమ భాష దాచుకునేందుకు పడే బాధ చూసి జాలనిపించింది.

“అయ్యా, మా ఊర్లో మంచి ఆసుపత్రి లేదు, మంచి కాలేజి లేదు , ఉద్యోగం చేయడానికి పెద్ద కంపెనీ లు లేవు, వ్యవసాయం చేస్తే గిట్టు బాటు ధర లేదు.పొట్ట చేత బట్టుకుని వచ్చాం.

ఏం చేస్తే మేము తెలంగాణా వాళ్ళం అవుతామో చెప్పండి.అలానే మారిపోతాం.”

ఏం చెప్పాలో తెలీక ఓ నిట్టూర్పు విడిచి వచ్చేశా. దయచేసి సమాధానం ఉంటె చెప్పండి.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!