పిల్లలు ఎందుకు? (అమ్మ..నాన్నా..ఓ జీనియస్ ! -వేణు భగవాన్ )

ఈ రోజు చాలా సంసారాలు నిలబడి ఉన్నాయంటే దానికి కారణం పిల్లలు. పిల్లలు లేకపోతే ఏనాడో వదిలేసేదాన్నండి అంటూ ఉంటారు. అంటే పిల్లలు పెళ్ళికి భీమా వంటి  వారా? కాదు. మరేదో ఉండి ఉంటుంది. మానవాళిని రెండు విషయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. అవి ఒకటి భయం, రెండు ఆశ, చివరి దశలో నన్నెవరు చూసుకుంటారు అన్నది భయమైతే, పిల్లలు వల్ల అయినా నా రాత మారుతుందేమో అన్నది ఆశ.

పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అసలు పిల్లలు ఎందుకు? ఈ ప్రపంచంలో 650 కోట్ల మంది జనం ఉన్నారు కదా! వారందరికీ తగిన ఆహారం కూడా దొరకట్లేదే. పిల్లలు ఉన్నవారందరూ తెగ సంతోషంగా ఉన్నట్టూ కనపడుట లేదే. అయినా ఎందుకు మన నర్సింగ్ హో౦లు డెలివరిలతో కిక్కిరిసి పోతున్నాయి?

మానవ శరీరం 45 యూనిట్ల బాధ వరకూ తట్టుకోగలదట. కాని శిశువుకు జన్మనిచ్చే సమయంలో ఏ స్త్రీ అయినా 57 యూనిట్లు వరకూ నొప్పిని  భరించవలసి ఉంటుందట. ఇది ఇంచుమించు 20 ఎముకలు ఒక్కసారి విరిగితే వచ్చేంత నొప్పితో సమానమట. మరీ యింత బాధ భరించి కూడా రెండో, మూడో కాన్పుకు కూడా ఎందుకు సిద్దమవుతారు? తల్లికి ఇష్టమయ్యా, తండ్రి కోరికా, లేక అబ్బాయి కోసం ఎదురుచూపా తెలియదు కాని, తమలో ఉన్న జీన్ కు, 'తనలో ఉన్న సమాచారం (మేధస్సు)' జీవించాలనే తీవ్ర కోరిక వలన పిల్లలు కావాలనే తపన కలుగుతుందని రిచర్డ్స్  డాకిన్స్ తన  'ద సెల్ఫిష్ జీన్ ' అనే పుస్తకంలో వివరించాడు. ఈ సత్యాన్ని అర్ధం చేసుకున్న వారెవరైనా తమలోని సకల కళలకు మూల విత్తనాన్ని (డి.ఎన్.ఏ ను) అందించిన తల్లి తండ్రులకు ఋణపడి ఉంటారు.

తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన త్యాగమూర్తులు. వారికి మనం ఋణపడి ఉండాలి. పిల్లలు మనం జన్మనిచ్చిన మొగ్గలు. వారు వికసించడానికి మనం దోహదపడాలి. పిల్లలు మనకు కృతజ్ఞతగా ఉండాలా లేదా అన్నది వారి విజ్ఞతకే వదిలేయాలి. గౌరవమైనా, ప్రేమైనా అడిగితే వచ్చేది కాదు. నేను నీకు ఫలానా చేసాను అందుకు నీవు నాకు ఋణపడి ఉండాలి అని అంటే ఎలా? పిల్లలకు జన్మనిచ్చాను అని అందరూ అనుకుంటారు. కాని పిల్లల్లు కూడా పెద్దలకు జన్మనిచ్చారు. వారు పుట్టకపోతే తండ్రి ఎలా అవుతారు? తల్లి ఎలా అవుతారు? పిల్లలు ఇంటికి వచ్చిన అతిధులు. వారు భౌతికంగా చిన్నవారు కాని ఆత్మ పరంగా ఉన్నతులై ఉండవచ్చు కదా!

పిల్లలు పుట్టినపుడు ఒక విత్తనం వంటివారు. ఒక జాతి  విత్తనం మొలకెత్తి మహావృక్షం కావడానికి దానికి సారవంతమైన, అనువైన నేల కావాలి. అలాగే పిల్లలు పెరగడానికి సరైన భౌతిక వాతావరణాన్ని, మానసిక స్వేచ్ఛను తల్లిదండ్రులే కల్పించాలి. మనిషి యొక్క విజయం పెంచిన తీరుపై ఆధారపడి ఉంటుందా లేక తన సహజ ప్రవృత్తికి అనుగుణంగా ఉంటుందా అంటే, విజ్ఞులు మనిషి ఎంచుకునే 'ఎంపిక' లను బట్టి ఉంటుందంటారు. ప్రతి వ్యక్తిలోనూ ఋషికి, రాక్షసునికి ఉండే ఆలోచనలు రెండూ ఉంటాయి. మనం దేనిని 'చైతన్యం' చేస్తామన్నదానిపై ఆ వ్యక్తీ గమనం, గమ్యం ఆధారపడి ఉంటుంది.

ఒక సందర్భంలో మిత్రుడు గజల్ శ్రీనివాస్ ను ఇదే ప్రశ్న అడిగాను. మీ పాప కూడా గజల్స్ పాడుతుంది. అంటే జీన్స్ ఎఫేక్టా లేక మీ శిక్షణ ఫలితమా అంటే, మీ పిల్లల్ని మా ఇంటి వద్ద వదిలేసినా వారికి గజల్స్ పాడడం వచ్చేస్తుందన్నారు. మనం ఏ రోజు ఐ.ఏ.ఎస్ పిల్లలు ఐ.ఏ.ఎస్ లు అవడం, డాక్టరు పిల్లలు డాక్టరు అవ్వడం, పారిశ్రామికవేత్తల పిల్లలు తండ్రిని మించిన తనయులవడం చూస్తూనే ఉంటాము. ఈ విజయానికి కారణం nature(సహజ ప్రతిభ)+ nurture (పెంచే తీరు)+ information of resources (ప్రతిభను పెంచుకునే వనరుల సమాచారం) కారణమని అభిప్రాయం. ఏ రంగంలో విజయం సాధించాలన్నా, సరైన సమాచారం,సరైన సమయంలో 'సరైన నిర్ణయాలని' తీసుకోవడానికి సహకరిస్తుంది.

మన లోని డి.ఎన్.ఎ మన ప్రతిభకు ఆధారం. మనలోపల సాధించాలన్న డిజైర్ కూ ప్రతిబింబం. నాలుగున్నర కోట్ల ట్రిలియన్ల డి.ఎన్.ఎ లు మనలో ఉంటాయి. ఆ డి.ఎన్.ఎ లో ఉన్న సమాచారమంతా మనలను ఏ విధంగా ప్రోత్సహిస్తుందో! ఏది సాధించామని అడుగుతుందో! వింటే ఏ వ్యక్తీ అయినా 'జీనియస్' కావొచ్చు. మరీ ఎంతమంది తమలో ఉన్న ఈ 'ఫైర్' ను గుర్తించారు? ఎంతమంది తమ పిల్లలను తమ 'అంతరంగ పిలుపుకు' అనుగుణంగా జీవించే స్వేచ్ఛను ఇవ్వగలరు?

సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న
ముత్యాలను మనం కనుగొనగలుగుతున్నాము.
పర్వతాలలో ఉన్న బంగారాన్ని,
భూగర్బంలో ఉన్న బొగ్గు గనులనూ కనుగొంటున్నాం
కాని ప్రతి శిశువు తనను తానూ ఆవిష్కరించుకోవడానికి
ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు,
తనలో దాచి ఉంచిన
ఒక క్రియేటివ్ జీనియస్ ను గురించి మాత్రం
మనం ఏమాత్రం తెలుసుకోలేకుండా ఉన్నాం.
--డా. మాంటేస్సారి

 

వేణు భగవాన్ గురి౦చి...

ఆటుపోట్లు..అవమానాలు, సమస్యలు, ప్రతికూల వాతావరణం...యిలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదగాలన్న తపన, కొత్తదనం కోసం నిరంతర అన్వేషణ ఓ కుర్రాడిని విజయతీరాలకు నడిపించింది... ఆర్దిక ఇబ్బందులతో ఐ.టి.ఐ వరకే చదవగలిగినా, బ్రతుకు పోరాటంలో రూ.12 రోజు కూలితో కెరీర్ ని ప్రారంభించాడు. తనలో ఉన్న ఆత్మనూన్యతను అధిగమించేందుకు మొదలైన ప్రయత్నం...కొత్త ప్రపంచాన్ని సృష్టించాలన్న సంకల్పానికి దారితీసింది. అంతే...వ్యాపారాన్ని వదిలి వ్యక్తిత్వ వికాస నిపుణుడు అయ్యాడు. ఒక విజయం నుంచి మరో విజయానికి అతని ప్రస్థానం కొనసాగుతుంది. అనతికాలంలోనే 700 పైగా ప్రసంగాలిచ్చి లక్ష్యం కోసం తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు..ఆ స్ఫూర్తి కెరటమే హైదరాబాద్ నగరానికి చెందిన వేణు భగవాన్.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!