మీరు మీరుగా ఉండండి! (ది ఫైర్ - వేణు భగవాన్)

దమ్ముందా - ఆ మధ్యన ఒక కూల్ డ్రింక్ కు సంబంధించిన ప్రకటనలో ఈ పదం తరచు వాడేవారు . ఆ కూల్ డ్రింక్ త్రాగడానికి దమ్ము - ధైర్యం అవసరం లేదు. కానీ మీరు మీలా బ్రతకడానికి దమ్ము-ధైర్యం అవసరం. ఒక గొప్ప కార్యం కోసం, ఒక సుఖవంతమైన జీవితాన్ని వదులుకోవడానికి మనిషికి ధైర్యం అవసరం. మనం మనని మోసం చేసుకోకుండా నిబద్దత కలిగిఉండటం అనేది జీవితంలో అత్యంత ప్రధానమైన ధర్మం. ప్రపంచంలో ఎవరినైనా మోసం చేయగలరు కానీ, తనని తాను ఎవరూ మోసం చేసుకోలేరు కదా!

"నేను ఒకసారి, ఒక పిచ్చివాళ్ళ ఆశ్రమ గార్డెన్ లో పచార్లు చేస్తుండగా, అక్కడ ఒక ఫిలాసఫీ పుస్తకం చదువుతున్న యువకుడిని కలవడం జరిగింది. అతని ప్రవర్తన, ఆరోగ్యవంతమైన అతని తీరు మిగతావారి కంటే భిన్నంగా ఉంది. నేను అతని ప్రక్కనే కూర్చొని - ఇక్కడ ఏమి చేస్తున్నావు? అని అడిగాను. అతడు నా వంక ఆశ్చర్యంతో తెరీపార చూసి, నేను ఆ ఆశ్రమంలోని వైద్యుడిని కాదని నిర్ధారించుకుని - "ఏమి చెయ్యను సార్! మా నాన్న గొప్ప లాయర్, నన్నూ తనలాగే లాయరును కమ్మంటాడు. మా మామ్మయ్య పెద్ద బిజినెస్ మాన్, నన్ను బిజినెస్ మాన్ చెయ్యాలనుకుంటాడు. ఇక మా అమ్మ, వాళ్ళ నాన్నలా నేను రాజకీయ నాయకుడవ్వాలనీ, మా చెల్లి తన భర్తలా నేనూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని, మా అన్నయ్య తనలా ఒక అథ్లెట్ అవడం మంచిదని చెప్తాడు.

ఇక స్కూల్లో నయితే మా పియానో, ఇంగ్లీష్, లెక్కల టీచర్లు వాళ్లనే ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను ఫాలో అవ్వాలని నిర్దారించేసారు! ఎవరూ నన్ను నన్నులా, ఒక మనిషిలా చూడటంలేదు. అందరూ తమ అద్దంలో  నన్ను చూస్తున్నారు. అందుకే ఇక్కడికి వచ్చాను. కనీసం ఇక్కడైనా నేను నాలా ఉందామని....అన్నాడు". -ఖలీల్ జిబ్రాన్ వ్రాసిన ఒక కథ.


మీరు కోరుకున్న వ్యక్తిగా అవడానికి, మీ వాళ్ళనుండీ, పరిస్థితుల నుండీ పారిపోనక్కరలేదు. మనస్సులో 'నో' అని చెప్పాలనిపించినపుడు,'నో' అని  చెప్పడంలోనే మనిషి అంతర్ముఖంగా ఉన్నతంగా జీవించగలుగుతాడు. అవతలి వారు బాధపడతారనో లేదా ఉన్న సౌఖ్యాలు పోతాయనో 'యస్ ' అని చెప్పి తనను తను మోసం చేసుకోవడం కంటే, తాత్కాలికంగా బాధ కల్గినా, మనస్సులో ఉన్నది మనస్సులను తాకేలా వివరించి ఒప్పించువారే ధన్యులు.

మీరు కోరుకునే విధంగా రూపొందడం అనేది మీ జన్మహక్కు , మీరు జన్మించింది అలా రూపొందడం కోసమే. మీరు కోరుకునే ఆ వ్యక్తి కావడం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అలా అవ్వడానికి కావలసిన ధైర్యం, సంకల్పం , పట్టుదల కలిగి ఉండడమే విజయం అంటే.

మనలో ప్రతి ఒక్కరికీ జీవితం "ఇలా" ఉంటె బావుంటుందనే ఒక కల ఉంటుంది. నేను ఈ పని చేస్తే ఆనందిస్తాను అన్న విషయం కూడా తెలిసే ఉంటుంది.ప్రపంచం తనను ఏ విధంగా గుర్తిస్తే అత్యంత ఆత్మానందం కలుగుతుందో అప్పుడప్పుడు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మీలో మీరు కోరుకునే ఆ అత్యుత్తమ "మీరు" మీ రాకకై ఎదురు చూస్తుంది. మీరు ఎలా ఉండాలో అలా ఉండడానికి మీరు ఏది అవసరమైతే అది చేయమని కోరుకుంటుంది.

అసలు మీరేమి కావాలనుకుంటున్నారో అప్పుడప్పుడు మనోనేత్రంలో చూడడం అవసరం. మీరే ఒక అడ్వర్టయిజ్మెంట్ కంపెనీ యజమాని అయితే, ఒక ఉత్పత్తిని మార్కెట్ చేయడానికి, చాలా వివరాలు తెలుసుకుంటారు. ఆ ఉత్పత్తి ఏమిటి? అది ఎవరికీ ఉపయోగపడుతుంది? ఆ ఉత్పత్తికున్న ప్రత్యేకతలేమిటి? ఏ రకంగా ప్రచారం చేస్తే అది వినియోగదారునికి అందుతుంది అని ఎలా అలోచిస్తారొ. అలాగే 'మిమ్మల్ని మీరు' ఒక ఉత్పత్తిగా భావించి, మీ ప్రత్యేకతలేమిటి? మీ టేలెంట్ ఏమిటి? మీ ప్రతిభ ఎక్కడ/ఎవరికీ ఉపయోగపడుతుంది? ఎక్కడ అధిక ధర లభిస్తుంది? ప్రపంచానికి అవసరమయ్యే విధంగా మీ ప్రతిభను ఎలా తీర్చిదిద్దుకోవచ్చు? ఎక్కడ అత్యంత సంతృప్తి లభిస్తుంది? ఎక్కడ నేర్చుకునే అవకాశం ఉంది? ఎక్కడ మీ ప్రతిభ మరింత మెరుగవుతుంది? ఏది మిమ్మల్ని ప్రగతి పథం వైపు నడిపిస్తుంది? ఏ రంగంలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఉన్నత స్థానాన్ని అందుకోగలరు? ఏ ప్రత్యేకతలు మిమ్మల్ని వేరే వారితో పోల్చలేని విశిష్ఠ వ్యక్తిగా నిలబెడతాయి? ఏ విధంగా మార్కెట్ చేసుకుంటే ప్రపంచం 'నువ్వే కావాలి' అని మీ సేవలను కోరుకుంటూ మీ  వెంట పడుతుంది? మీరు ఎంచుకున్న రంగంలో మొదటగా మీ పేరు గుర్తు రావాలంటే ఏమి చేయాలి? అని ఆలోచించి ఆ విధంగా మీ 'పర్సనల్ బ్రాండ్ ను' సృష్టించుకోవాలి. ప్రపంచం మిమ్మల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో స్పష్టమైతే, మీ వ్యక్తిగత బ్రాండ్ ని సృష్టించు కోవచ్చు. మీకే స్పష్టత లేని విషయాన్ని మీరు ఇతరులకు అమ్మలేరు. మనిషికి టాలెంట్ ఉండడమే కాదు. టాలెంట్ అమ్ముకునే టాలెంట్ కూడా ఉండాలి.

"మీకు పూర్తి సంతృప్తిని ఇస్తుందంటే, మీరు చేసే పనిని పూర్తిగా మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నప్పుడు, మీ శక్తియుక్తులన్నీ ఆ పనిలో పెట్టగలిగినప్పుడు, ఇక మీరు అది తప్ప ఇంకెవరూ కాకూడదని అనుకుంటున్నప్పుడు, ఇదే మీకు కావలసింది అయినప్పుడు, మీరు ప్రకృతితో అంగీకరిస్తారు: ఈ డ్రామాలో మీకు ఇచ్చిన పాత్ర, సరైన పాత్ర అని, మీరు ఈ పాత్రని మార్చడానికి సంసిద్దులుగా లేరనీ, అది అధ్యక్షుడి పదవైన, చక్రవర్తైనా సరే!" - ఓషో

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!