స్వప్నం - లక్ష్యం - ఆదర్శం (లక్ష్యం..ది సీక్రెట్ - వేణుభగవాన్)

'ది సీక్రెట్' గురించి  వేణు భగవాన్ గారి తొలిమాట....
ఈ చాప్టర్ వ్రాస్తున్నప్పుడు ఒక యువకుడు వచ్చి ఈ పుస్తకం ఎవరు చదువుతారు? చదివి ఎవరైనా ఆచరిస్తారా? ఎవరికైనా ఉపయోగపడుతుందా? అని అడిగాడు. నిజమే చాలా మందికి చదివే అలవాటు లేక పోవచ్చు. చదివే అలవాటున్నవారు వేరే పుస్తకంతో పోల్చవచ్చు. కాని నేను ఈ పుస్తకంలో వ్రాసిన 'ది సీక్రెట్' అనే భావప్రపంచం ఆధారంగా, ఇది చేరవలసిన వారికి ఖచ్చితంగా చేరుతుంది. ఎంతమంది కావాలి, చరిత్ర సృష్టించడానికి? ఆ కొద్దిమందికి ఈ పుస్తకం సింహబలాన్ని ఇస్తుంది. అది మీరే కావొచ్చు.

ఈ పుస్తకంలో ఇమిడి ఉన్న ఎన్నో విషయాలు మీ విజయానికి అత్యంత కీలకమని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా లక్ష్య సాధన వెనుక ఉండే ఒక భావప్రపంచం గురించిన విషయాలు మీ ఆలోచనా దృక్పదాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధాలు. మీరు విజయానికి అత్యంత చేరువలో ఉన్నారు. దానికి సాక్ష్యం ఈ పుస్తకం మీ చేతిలో ఉండడమే.


ఇక్కడ మొదటి చాప్టర్ లోని కొంత భాగం రెండు ఆర్టికల్స్ గా ఇది వరకే వ్రాయడం జరిగింది . ఆ రెండు ఆర్టికల్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి....దాని తరువాయి భాగం
స్వప్నం - లక్ష్యం - ఆదర్శం

 

స్వప్నం - లక్ష్యం - ఆదర్శం

మీ మదిలో భవిష్యత్తును ఊహించడం స్వప్నమైతే, లక్ష్యాలు వాటిని నిజం చేసే సాధనాలు, ఇలా ఒక కల కలిగి ఉండడమే విజన్ అంటారు. ఉదాహరణకు నా కల: భారతదేశంలో విద్యా విధానంలో సమూల మార్పులు కలిగి, చిన్ననాటి నుండే వారి సహజ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి వారికి జీవితానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పి, ఆత్మ విశ్వాసంతో కూడిన జీనియస్ లతో దేశం, ప్రపంచం నిండడమే నా కల, నా పుస్తకాలు, ఉపన్యాసాలు నా ఆయుధాలు. (ఈ మధ్యనే వ్రాసిన ది ఫైర్ పుస్తకం మొత్తం దీని గురించే ఉంటుంది). మార్పులో అందరూ భాగస్వాములే, నూతన సృష్టిలో మీ షేరు ఎంత అన్నదానిపై, మీ విజయం ఆధారపడి ఉంటుంది. మీ కళల వైపు అడుగులు వేసిననాడు మీరూ ఓ co-creator అవుతారు.

'జీవితంలో అత్యుత్తమ టైం వేస్ట్ ఏమిటంటే మీరు చేయక్కరలేని పనిని, అత్యంత బాగా చేసేయడమే'. ఇతరులు బాగా చేసే పనులను చేయడంలోనే ఉన్న సమయమంతా అయిపోతే మనం మాత్రమె చేయగల ఒక గొప్ప పనిని చేయడానికి సమయమేదీ! నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరిదో తేల్చుకో ముందుగా అన్నమాట అక్షర సత్యం. ఎవరి పని వారికి దొరికితే, అది అసలు పనే కాదు. అలాంటి పని ఎంత త్వరగా దొరికితే, అంత త్వరగా ఆ వ్యక్తి ఆ పనిలో నిష్ణాతుడవచ్చు.

విజన్ ఎలాంటిదంటే ఒక కారుకు హెడ్ లైట్ లాంటిది. ఆ వెలుగు వంద మీటర్లే పడినా, ఆ వెలుగులో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సైన్ బోర్డులు సహకారంతో, వందల కిలోమీటర్ల దూరాన ఉన్న గమ్యాన్ని కూడా అలవోకగా చేరుకోవచ్చు...

ఒక సమయంలో ఒకే ప్రధాన లక్ష్యం

"తెలివైన మస్తిష్కం తన శక్తియుక్తులన్నిటినీ ఒకే ఒక విషయం పైనే కేంద్రీకరించి,
పనులను సాగదీస్తుంది..ఖచ్చితంగా విజయాలు సాధిస్తుంది." -బోనీ

ఎంత ఎండ రోజైన కూడా ఒక కాగితం సూర్యకిరణాల వల్ల కాలదు. అవే కిరణాలను శక్తివంతమైన భూతద్దంలో నుండి ప్రసరింపచేస్తే ఆ కాగితం కాలుతుంది.

జీవిత లక్ష్యం 'గమ్యం' అయితే, ప్రస్తుత ప్రధాన లక్ష్యాలన్నీ దారిలో స్టేషను వంటివి. ప్రతీ స్టేషనూ దాటుకుంటూ వెళ్తేనే గమ్యాన్ని చేరగలం. లక్ష్యసాధనకు అత్యంత అవసరమైనది ఏకాగ్రత మాత్రమే. పది పనులను ఒకేసారి సాధించలేము. ఒక్కొక్క పనిని ఒక లక్ష్యంగా తీసుకొని, ఆ లక్ష్యమే గురిగా పనిచేసినట్లయితే, అంతిమ లక్ష్యం అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది.

ప్రతిభతో కూడిన లక్ష్యం

సరైన వాడకం లేని పనిముట్లకి తుప్పు పట్టినట్లే, సక్రమంగా వాడక పొతే మనిషి మనసు కైనా తుప్పు తప్పదు. అలాగే చక్కగా పట్టించుకోని తోట కలుపు మొక్కలకి నిలయమైనట్లే, నిర్లక్ష్యానికి గురైన ప్రతిభ నీరసించి నశించి పోతుంది. - ఎథెల్ ఆర్ పేజ్

ప్రతి  ఒక్కరిలో సహజమైన ఒక అసాధారణ ప్రతిభ ఉంటుంది. అది ఒక ఆట అయి ఉండొచ్చు ఒక పాట అయి ఉండొచ్చు ఒక కళ అయి ఉండొచ్చు. కొంతమంది చాలా రంగాలలో సమర్ధులై ఉండవచ్చు. కానీ అన్నిటకన్నా ఎక్కువ నైపుణ్యం, మక్కువగల ప్రతిభ ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిభ అంటే చాలా మంది తెలివితేటలు అనుకుంటారు. కాదు, అత్యంత సామర్ధ్యం, ఆసక్తి ఉన్న రంగం. తెలివితేటలు, నైపుణ్యం సాధన తో మెరుగు పరుచుకోవచ్చు. తమకు ప్రతిభ ఉన్న రంగాన్ని గుర్తించి, కృషి చేసిన వారు గొప్ప వారు కాగలరు.

ఈ ప్రపంచం లో ప్రతి ఒక్కరూ ఒక అసాధారణ ప్రతిభ తో జన్మించారు. ఏ ఇద్దరి వేలి ముద్రలు సరిపోనట్లే ఏ ఇద్దరి ప్రవృత్తి ఒకే రీతిలో ఉండదు. ఒకే ఆట ఎంత మంది  ఆడినా ఏ ఇద్దరూ ఒకే రీతిలో ఆడరు. ఎవరి శైలి వారిది.

మన దేశంలో ప్రతిభకు కొదవలేకపోయినా, బీద దేశంగా ఉండడానికి కారణం ప్రతీ ఒక్కరూ తాము ఇతరుల వలె కావాలనే ప్రయత్నంలో తమ అసలు ప్రతిభను మరచిపోతారు. వాళ్ళ సొంత ప్రతిభ ఉన్న రంగం మాత్రం ఒక హాబీగానో లేక చిన్నప్పుడు నేను ఫలానా వాటిలో ఫస్టు తెలుసా అని చెప్పుకోవడానికో మిగిలిపోయుంటుంది. అందరూ ప్రపంచాన్ని బట్టి పోదాం అనుకునే ప్రయత్నంలో బ్రతుకు తెరువు సంపాదించుకోగలుగుతారు. కానీ తమ అసలు ప్రతిభకు సానబడితే, ప్రపంచమే తనతో వస్తుందని తెలుసుకోరు. అందుకేనేమో మనం మానవ వనరుల అభివృద్దిలో ప్రపంచ దేశాలలో 132 వ స్థానంలో ఉన్నాము. జీవితంలో అత్యంత విషాదం మరణం కాదు, జీవించి ఉండగానే మరణించే మానవ ప్రతిభ.

ఉదాహరణకు మీ చిన్నప్పుడు ఏ ఆటలోనో, పాటలోనో, ఏదేని కళలోనో ఎంత ప్రతిభ ఉన్నా, మన పెద్దలు నీకిదేమైనా కూడు పెడుతుందా? అని ఉత్సాహం పై నీళ్ళు చల్లి ఉంటారు. నిజమే మీరు ఎంచుకున్న మరో వృత్తి మీకు కూడు పెట్టవచ్చు. కానీ మీకు ఎంతగానో ప్రతిభ ఉన్న వృత్తి ఎంతో మందికి కూడు పెడుతుంది, మీకు పరమాన్నం పెడుతుంది అనడంలో సందేహం లేదు.

మనిషి డబ్బు వెనకాల పడితే డబ్బు రావచ్చు కానీ తను అత్యధికంగా ఇష్టపడే పని వెనకాల పడితే సంపదతో పాటు అనంతమైన ఆనందం వాళ్ళ సొంతమవుతుంది.

డాక్టర్ నీరజ్ అనే నా స్నేహితుని ఇంటిలో ఇంచిమించు అందరూ డాక్టర్లు అవడంతో ఆయనా డాక్టర్ అయ్యారు. కానీ ఆయనకి పెయింటింగ్ అంటే ప్రాణం, డాక్టరు వృత్తిని వదిలి, చిత్రలేఖనంలో మరో ముందడుగు వేసి, గ్రాఫిక్ డిజైనింగ్ మరియు మల్టిమీడియాల్లో వైద్య వృత్తికే ఎనలేని సేవలందిస్తున్నారు.

మీలో ఉత్సాహం ఉంటే ఎప్పుడైనా ఆ అసలు సిసలైన సహజ ప్రతిభను పైకి తీసుకురావచ్చు. ఆడుతూ పాడుతూ అత్యున్నత శిఖరాలందుకోవచ్చు. లక్ష్యం వెనకాల భావప్రపంచంలో జరిగే అద్బుతాలు తెలియక పోవడం వల్లే ఎంతో మంది సమున్నత లక్ష్యాలను ఏర్పరచుకోవడం లేదు. మన ప్రవృత్తే మన వృత్తి కావొచ్చు లేదా మన వృత్తిని మన ప్రవృత్తికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఏమైనా ఒక లక్ష్యంగా అనుకున్నది సాధించవచ్చు.

ఏ రంగానికైనా ప్రతిభను మలచుకోవచ్చా?
తప్పనిసరిగా, ప్రస్తుతం ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగాన్ని తన ప్రతిభకు అనువుగా మార్చుకోవడం తెలివైనవారు చేసే పని. ఉదాహరణకు ఈ రోజు హీరో పాత్రలకు పనికి వస్తాడా అనుకునే వ్యక్తులు తమ అంతర్గత ప్రతిభతో నైపుణ్యం పెంచుకుని, ఉన్న అవకాశాలను వినియోగించుకుని, బాహ్య సౌదర్యం కాదు, లోపలి ఫైర్ ముఖ్యమని మనకు చెప్పకనే చెప్పారు. మనం అనుకోవచ్చు, అవకాశం ఉంటే ఎవరైనా రాణిస్తారు అని, సపోర్టు ఉన్నా రాణించని వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రేక్షకులు అభిమానంతో సినిమాలు చూసే రోజులు పోయాయి. పోషించిన పాత్రలకే అభిమానులు గానీ వ్యక్తులకు కాదని చాలా మందికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది.


అవకాశం ఉంటే, ఏ రంగం అయినా వీడిన మార్కు సృష్టించి, వృత్తిని కొత్త కోణంలో చూడవచ్చు. ఏ రోజు మనకు కావలసింది సాధారణ మార్పు కాదు, విప్లవాత్మక మార్పు.కొత్తది రావాలంటే పాత పద్దతులకు బ్రేక్ వేయాలి.

ప్రతి సరదా వృత్తి కానవసరం లేదు. వేల కోట్ల సంస్థ రేమాండ్స్ యజమాని విజయ్ పాత్ సింఘానియాకు హాట్ ఎయిర్ బెలూన్ అంటే చిన్ననాటి నుండీ మక్కువ. 2005 సంవత్సరంలో 69 సంవత్సరంల వయస్సులో హాట్ ఎయిర్ బెలూన్ లో అత్యంత ఎత్తుకి (69,852 అడుగులు) ఎగిరి, ఇంచుమించు అంతరిక్షాన్ని తాకి కొత్త ప్రపంచ రికార్డు స్థాపించారు. ఇటు వ్యాపారంలో విజయం, అటు ఆత్మ సంతృప్తి, రేమండ్స్ - ది కంప్లీట్ మేన్ అన్న స్లోగన్ ఆయనకు సరిగ్గా సరిపోతుంది.

మనలో చాలా మంది జీవితాల్లో అత్యంత ప్రమాదకరమైనది ఏమిటంటే,
మన జీవిత లక్ష్యం చాలా పెద్దది, అది మనం చేరుకోలేకపోవడం కాదు,
అది చాలా చిన్నది మరియు మనం చేరుకోగలిగింది అయిఉండడం. - మైఖెలాంజిలో

Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!