ముసుగులేని అసలైన జీవితం ..వేణు భగవాన్ (ఫైర్)

ఒక 'జూ' లో చింపాంజీ సందర్శకులను తన చేష్టలతో బాగా రంజింపచేసేది...ఒక రోజు అనారోగ్యంతో అది చచ్చిపోయింది.  ఈ చింపాంజీ చేసే ఎంటర్టైన్మెంట్ ప్రజలకు ఎక్కువ ఆకర్షణీయంగా ఉండడం వల్ల, జూ అధికారులు చింపాంజీ చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచి, సర్కస్ నుండి ఒక శిక్షణ పొందిన మనిషికి చింపాంజీ మాస్క్ తొడిగి యధావిధిగా సందర్శకులకు ఎంటర్టైన్మెంట్ అందేలా చేశారు. చింపాంజీ మాస్క్ ఉన్న వ్యక్తి ఒరిజనల్ చింపాంజీ కంటే బాగా చేయడం ప్రారంభించాడు. కొద్ది రోజులు బాగానే నడిచింది. ఒకరోజు అతను సందర్శకులకు మరింత మెప్పించడానికి ఒక చెట్టు ఎక్కి ఊగుతుండగా, ఆ కొమ్మ విరిగి అవతలివైపున్న పులి ప్రాంగణంలో పడ్డాడు. ఆ పులి ఇతనిని చూడనే చూసింది. నెమ్మదిగా ఇతని వైపు రాసాగింది. అంతే! ఇతని గుండె జారిపోయింది, భయంతో వణికి పోతూ అరవసాగాడు. ఈ ఉద్యోగంలో చేరినందుకు తనను తానె తిట్టుకోసాగాడు. ఇంతలో ఆ పులి ఇతని సమీపంకి వచ్చి, "మిత్రమా, నువ్వు ఏ కాలేజ్ నుంచి వచ్చావు"? అని అడిగింది. అప్పుడు అర్ధం అయ్యింది, పులి కూడా తనలాగే వేషం వేసిందని!

మన చదువంతా ఉద్యోగం చేయడానికి, బ్రతకడానికి ఉద్దేశించినట్టు లేదు. అందరూ తాము ఏం చేయడానికి పుట్టామో అది తెలుసుకోకుండానే, జీవితాంతం తమ అంతర్గతసామర్ధ్యానికి సంబంధంలేని పనులు చేస్తూ జీవితం కేవలం సంపాదనకే అయినట్లు జీవిస్తూ, భవిష్యత్ తరాలవారికి నూరిపోస్తున్నారు. లక్ష్మి అంటే ధనలక్ష్మి ఒక్కటే కాదనే సత్యాన్ని మరచిపోతున్నారు. ధర్మ, అర్ధ, కామ, మోక్ష సూత్రాన్నీ మరిచారు.

నేడు ఏదైనా రంగంలో గొప్ప నిపుణుడిని పట్టుకోవాలంటే చాల కష్టంగా ఉంటుంది. ఏ రంగమైనా ఒరిజినల్ టాలెంట్ ఉన్నవారు అతి తక్కువ శాతం కనపడుతున్నారు. ఏ రంగంలో అయినా నాయకత్వ లక్షణాలు కలిగిన నిపుణుల కొరత ఎప్పుడూ ఉంటుంది. ఏ సంస్థ అయినా కష్ట సమయాల్లో టాలెంట్ లేని వారిని అందరికంటే ముందుగా తీసేసేది.

మీరు ఒక సమావేశంలో మీ షూ పోగొట్టుకున్నట్లయితే , వేరొకరిది మీకు సరిపోతుందా? మీకు సంబంధించని రంగాలలో కృషి చేయడం అనేది జీవితాన్ని వృధా చేసుకోవడానికి దగ్గర దారి, జీవితానికి ఏది ప్రత్యామ్నాయం కాదు! ఇతరులను అనుకరించకండి.మీ శరీరం, మనస్సు, ఆత్మా కోరే పనిని ఎంచుకోండి. అవిరామ కృషి ఆ రంగంలో చేయండి. అత్త్యున్నత శిఖరాలు చేరుకోటానికి సులభమైన దారి ఇదే.

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!