వెనుక బెంచి అమ్మాయి...

ఇటీవలే  హిందూజా మహావిద్యాలయకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన టీచర్ పద్మజ 6వ తరగతి  నుంచి  10 వ తరగతి ఇంగ్లీషు బోధిస్తుంది. ఆమె 6 వ తరగతి క్లాసు టీచర్ కూడా, మొదటి రోజు క్లాసు లోకి అడుగు పెట్టగానే తన చూపు ఆఖరి బెంచి లో కూర్చున్న ఇద్దరి అమ్మాయిల మీద పడింది. ఆ క్లాసులో మొత్తం 20అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు ఉండగా, ఆఖరి బెంచిలో కూర్చున్న అమ్మాయిలకి మిగతావారికి మద్య ఒక బెంచి ఖాళీగా ఉండడం వింతగా అనిపించింది. నాలుగు రోజులు గడిచాక నేను ఆఖరి బెంచి అమ్మాయిని ఆ రోజు చెప్పిన పాఠంలో నుండి ఒక ప్రశ్న అడగగానే, ఆ అమ్మాయి జవాబు కంటే ముందే క్లాస్ అంతా గొల్లున నవ్వులతో మ్రోగింది. ఉలిక్కి పడిన నేను, ఆ అమ్మాయి ముఖం చూసా, తనలో ఎటువంటి స్పందనా లేదు, ఒక కఠిన శిలలా నిల్చుంది,అప్పటినుండి తను నాకు ఒక శేష ప్రశ్నే అయ్యింది.

క్లాసు లో అందరు తెలిసి అలవాటు అయ్యేసరికి నేల రోజులు పట్టింది, అప్పటికి టీచర్ బాగా చెపుతారు కాని చెప్పిన హోంవర్క్ చేయకుంటే పనిష్మెంట్ కఠినంగా ఉంటుందన్న పేరు కూడా వచ్చింది, కానీ ఇంతవరకు ఎపుడు నేను వెనుక బెంచీ అమ్మాయిలతో హోంవర్క్ ప్రస్తావన చేసిందే లేదు. ఆ రోజు అందరిని" యువర్ హాబీస్ " మీద వ్యాసం రాయమని, ఎవరైనా రాయకపోతే నా క్లాసుకి రానవసరం లేదని .. అందరు సోమవారం లోపు ఇవ్వాలని చెప్పా.. మీరు కూడా అని వెనుకబెంచి అమ్మాయిల వైపు చూసా...

ఈ రోజు సోమవారం, అప్పటికే అందరు కంప్లీట్ చేసి ఇచ్చారు, నేను లాస్ట్ బెంచ్ అమ్మాయిల కోసం చూస్తున్నా, ఆఖరు బెల్లు కూడా అయ్యింది, నేను ఇంటికి బయలుదేరుతుండగా వినిమించింది "టీచర్" అన్న పిలుపు.. లాస్ట్ బెంచ్ అమ్మాయిలు వాళ్ళు వ్రాసింది నా చేతిలో పెట్టి పిలుస్తున్నా ఆగకుండా పరుగెత్తారు. నాకు ఎదో అద్బుతం జరిగినట్టు, గొప్ప విజయం సాధించినట్టు అనిపించింది.
అందరి పేపర్లు దిద్ది, క్లాస్ లో కొంతమందికి నా తోడ్పాటు ఎలా అందించాలా అని ఆలోచనలో పడ్డాను,

మరుసటిరోజు రూల్ నెంబర్ ప్రకారం ఒకరి తరువాత ఒకరు టీచర్స్ రూమ్ కి వచ్చి వాళ్ళ పేపర్స్ తీసుకోమని చెప్పాను, ఒక్కొక్కరు వచ్చారు, వారికీ తగిన సూచనలు, కొందరికి భాష మెరుగుపరచుకోవడానికి కొన్ని అసైన్ మెంట్స్, ఆఖరి బెంచ్ అమ్మాయిలకి స్పెషల్ పనిష్మెంట్ ఇచ్చా...

జనవరి 26 కి  ...  సృజన అకాడమి నిర్వహించే  వ్యాసరచన పోటికి ప్రతీ స్కూల్ నుండి ఇరవై మందికి పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు, విద్యార్థుల ఎంపిక బాధ్యత నాపై పెట్టారు, అప్పటినుండి వాళ్ళకి  తగిన సూచనలు, శిక్షణ ఇవ్వడంతో రోజులు గడిచిపోయాయి... అనుకున్న దానికంటే ఎక్కువ బహుమతులే పొందారు మా విద్యార్థులు. మాకు వచ్చిన మొదటి బహుమతి కంటే , మూడవ బహుమతి, మరియు ప్రత్యేక బహుమతి చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయారు మా హెడ్ మిస్ట్రెస్ తో సహా..... ఆ రెండు బహుమతులు లాస్ట్ బెంచ్ అమ్మాయిలవి, ఇపుడు ఆ అమ్మాయిల పేర్లు లాస్ట్ బెంచ్ అమ్మాయిల కాదు ... గీతిక, రేవతి...

కాలం వడి వడిగా గడిచిపోయింది. నేను వచ్చి అపుడే మూడేళ్ళు గడిచిపోయాయి, గీతిక ఇపుడు క్లాసు లీడర్, ఖాళీ బెంచ్ అనేదే లేదు, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అని ఎవరు లేరు, ప్రతీ ఒక్కరిలో ఒకో ప్రత్యేకత, నా ప్రయత్నాలన్నీ, మా స్కూల్ కి మంచి పేరుని, నాకు విద్యార్థుల్లో బెస్ట్ టీచర్ గా అభిమానాన్ని తెచ్చిపెట్టింది.

మళ్ళీ ట్రాన్స్ఫర్ ...కొత్త స్కూల్ కి పయనం... అక్కడి లాస్ట్ బెంచ్ విద్యార్థులకి పేర్లు పెట్టడానికి...


Comments

Post New Comment


sasikala 21st Jan 2014 00:27:AM

nice one.nice narration