ఖదీర్ బాబు - రచనలు - సంక్షిప్తంగా

ఖదీర్ బాబు (Khadeer Babu ) తన మొదటి కధ ' పుష్పగుచ్ఛం' ను 1995 లో వ్రాసారు. "దర్గామిట్ట కతలు  (1 edition - first published in 1999 )",  నూరేళ్ల తెలుగు కథ 1 edition - first published in 2001,"పోలేరమ్మబండ కతలు  1 edition - first published in 2004" పప్పుజాన్ కథలు (1 edition - first published in 2004), ‘బాలీవుడ్ క్లాసిక్స్’  1 edition - first published in 2010, మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు, న్యూ బాంబే  టైలర్స్ (కథల సంపుటి )published ఫిబ్రవరి 15, 2012 మొదలైనవి ఈయన రచనలు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పని చేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబుది ప్రత్యేకమైన స్థానం.

దర్గామిట్ట కతలు


ఇందులో ఇరవై ఐదు కథలున్నాయి నూట నలభై
పేజీల్లో. అన్నీ చిన్న చిన్న కథలే. పుస్తకం
కవరు అక్బరు వేసిన వర్ణ చిత్రంతో ముచ్చటగా
వుంది. ప్రతి కథకీ ముందూ చివరా మోహన్ గీసిన
రేఖా చిత్రాలు గిలిగింతలు పెట్టిస్తాయి. ఈ
కతహలన్నీ 1998-99 మధ్యన ఆంధ్రజ్యోతి వార
పత్రికలో అచ్చయ్యాయి.

నూరేళ్ల తెలుగు కథ – మరో వెయ్యేళ్లు వెలిగే కథ

అరుణ పప్పుగారి విశ్లేషణ
ముందొక పిట్ట కథ.
పూర్ణయ్యని బావగాడంటారు అందరూ.
బావగాడు లేకపోతే సరదాలేదు, సంబరమూ లేదు. పెళ్లిగాని, పేరంటంగాని వంట హంగంతా బావగాడే. వంటవాళ్లని కూర్చోనిచ్చేవాడు కాదు. నించోనిచ్చేవాడు కాదు. పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్లకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడితోపులో చేరారు. చాపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. పేకాటలో మునిగినవారు మరికొందరు. గాడిపొయ్యి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యకు పరుగెత్తుకొచ్చాడు. ‘అందరూ వినండర్రా’ అని పెద్దగా గావుకేక పెట్టి మాటలు మానిపించాడు. పేకాట మూయించాడు. ‘వంటకాలు ఇలా తయారు చేయిస్తున్నాను’ అంటూ లిస్టు చదివాడు. ‘వంకాయ మెంతికారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్కకూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగుపచ్చడి, అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, అయ్యా జీడిపప్పు పచ్చకర్పూరాలతో పాయసం, మామిడికోరుతో పులిహోర, గుమ్మడి వడియాలు, వూర మిరపకాయలు. అందరికీ సమ్మతమేనా?’ అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం – అప్పటికప్పుడు అందరి నోళ్లలో నీరూరించి, ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. జిహ్వ గిలగిల్లాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. అక్కడితో ఆగాడా? ఊహూ. లేత వంకాయలు కోయించుకు తెచ్చి ప్రదర్శనకు పెట్టాడు. ‘చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహ చక్కగా మేళవిస్తుంది’ అని జ్ఞాపకం చేశాడు. పులిహోర తిరగమోత వెయ్యగానే ఆ ఘుమఘుమలకే జనానికి శరీరమంతా ఆకలే అయ్యేలా చేశాడు. అందర్నీ బంతులుగా కూచోపెట్టి కొసరికొసరి వడ్డించి తినిపించాడు….

మహమ్మద్‌ ఖదీర్‌బాబున్నాడే, అచ్చం బావగాడే బావగాడు.ఒక కథల సంతర్పణ మొదలుపెట్టాడు. రోజుకో కథ అన్నాడు. ‘ఓసంతేకదా, భారతి కాలం నుంచీ ఇలాంటివి ఎన్నో చూశాం’ అని జనాలు ఎవరి గోలలో వాళ్లు పడ్డారు. కొందరు పిచ్చాపాటీ కబుర్లు, కొందరు పేకాటలు, మరికొందరు రాష్ట్ర విభజన రాజకీయాలు. వారం రోజులు తిరిగేసరికల్లా కథల్ని కొత్తకొత్తగా ఖదీర్‌బాబు వండుతున్న కమ్మని వాసన అందరికీ చేరింది. ఇక వేరే చర్చలు ఆగిపోయాయి. సంతర్పణలో బావగాడు చూపెట్టిన వంకాయల మీదే మాటలు నడిచినట్టు ఎక్కడికక్కడ కథల మీదే మాటలు మొదలయ్యాలు.
‘అసలెలా ఎంచుకుంటున్నాడంటావ్‌?’
‘ఏది వరస?’
‘ఏమైనా ఖదీర్‌ కథలు చెప్పటంలో సిద్దహస్తుడు’
‘ఇంతకీ రేపెవరిదో? ఏ కథ వస్తుందో?’
జనంలో కథల పట్ల ఆకలి నిలువెత్తయి, తాడి ప్రమాణమయింది. నూరు రోజులు, నూరుగురు కథకులు, నూరు కథలు.
పీవీ నరసింహారావు రాసిన కథలో గొల్ల రామవ్వ ఏం చేసింది?
పూసపాటి కృష్ణంరాజు చెప్పిన ‘రెండు బంట్లు పోయాయ్‌’ కథెప్పుడైనా చదివారా?
పురాణం సుబ్రమణ్యంశర్మ ‘రాజనీతి’ ఏమిటో తెలుసునా?
గూడూరి సీతారాం ‘లచ్చి’ కాపరాన్ని ఎలా తీర్చిదిద్దారు?
2బీహెచ్‌కే పరుగుల్లో పడినవారికి దాదాహయత్‌ ‘మురళి ఊదే పాపడు’ ఏమయ్యాడో ఎలా తెలుస్తుంది?
‘ధనత్రయోదశి’ కథలో భండారు అచ్చమాంబ ఇచ్చిన సందేశం ఏదైనా ఉందా?
‘హోగినెకల్‌’ దగ్గర ఉగ్రకావేరి ఏం చేసిందో మహేంద్ర మాటల్లో చదివారా?
నెల్లూరి కేశవస్వామి ‘యుగాంతం’ అయిపోయిందా, ఇప్పటికీ జరుగుతున్న కథా?

ఒక్కమాటలో చెప్పాలంటే వందరోజుల పాటు రోజుకో జీవితపు రుచి. అందుకున్నవాళ్లకి అందుకున్నంత. తెలుగు ప్రజలకు ఖదీరు వడ్డించిన మృష్టాన్న భోజనం. టీవీ సీరియళ్లు తప్ప మరో లోకమెరుగని ఇల్లాళ్లెందరో ఈ కథలున్న పుస్తకాలెక్కడ దొరుకుతాయోనని ఆరా తీశారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని హైదరాబాదులో ఉద్యోగమే పరమావధిగా బతుకుతున్న కుర్రకారంతా తెలుగు కథలింత బావుంటాయా – మరి మాకెవరూ చెప్పలేదేం అనుకున్నారు. సప్త సముద్రాలు దాటి అక్కడెక్కడో ప్రవాస జీవితం గడుపుతున్నవారంతా తెలుగు కథల పుస్తకాలు కావాలని ఇక్కడికి ఫోన్లూ మెయిళ్లూ కొట్టేరు. ‘రావిశాస్త్రి పోయాక తెలుగు కథలు చదవడం మానేశానండీ’ అని స్పష్టంగా చెప్పిన నడివయసు జనాలంతా మళ్లీ తెలుగు కథ మీద ఇష్టం పెంచుకున్నారు. ‘నా కథ ఎప్పుడు వస్తుందో’ అని రచయితలు ఎదురుచూశారు. తమ కథ వచ్చిన రోజు పాఠకుల ఫోన్లు వెల్లువైపోతుంటే తట్టుకోలేక సంతోషంతో మనసు నిండిపోయి అది కంట నీరుగా ఒలికిపోతుంటే చిరునవ్వుతో స్వీకరించినవారున్నారు.

పోతే ఒకటే తేడా. బావగాడు వండించి వడ్డించిన తీరుకు జనాలంతే సుష్ఠుగా తిని ఆకుల ముందునుంచి లేవడం కూడా కష్టమైపోయింది, ఖదీరు కథలు చెప్పి ప్రచురించిన జోరు జనాల మీద ఎపిటైజర్లా పనిచేసింది. వాళ్ల ఆకలి సగం తీరి, మరి సగం తీరకుండా ఉండిపోయింది. వంద కథల తర్వాత దినపత్రికలో ఆ ఫీచర్‌ మరిక రాదంటే వాళ్లకి పిచ్చకోపమొచ్చింది. అలాగని కథల భోజనం ముందు నుంచి లేవలేరు. ‘‘ఏం తెలుగులో ఉన్నవి ఈ నూరు కథలేనా? ఈ నూరుగురు కథకులేనా? మరో వంద చెప్పలేవూ?’’ అని నిలదీశారు. రచయితలకూ కోపమొచ్చింది. ‘‘ఏం తెలుగులో కథలంటే అవేనా? మరో యాభయ్యో వందో వేస్తే నాదీ ఆ జాబితాలో నిలబడకపోదునా?’’ అని చాటుమాటుగా విసుక్కున్నారు. అమరావతి కథల్లో బావగాడి సంతర్పణకీ, ఖదీరుబాబు సంతర్పణకీ ఇదిగో ఇదొక్కటే తేడా.

దాన్ని ఖదీరుబాబు ఊహించాడు. అనుభవించాడు. అందుకే వినయంగా ‘‘కొండను అద్దంలో చూపిస్తున్నా’’నని చెప్పేశాడు. ‘‘వందేళ్లలో వచ్చిన వంద సుప్రసిద్ధ కథలను ఏరి, వాటిని క్లుప్తంగా తిప్పి చెప్పిన ప్రయత్నం ఇది. కథను చదివే, కథ మొతాన్ని చదివే, కథను వెతుక్కుని చదివే వీలు లేని అడావిడి రోజుల్లో నూరేళ్ల తెలుగు కథా సాహిత్యాన్ని అలుపు లేకుండా ముగించడానికి వీలుగా చేసిన ప్రయత్నం ఇది. తెలుగు కథకు ఒక కథకుడు ప్రకటించిన కృతజ్ఞత’’ అని చెప్పుకున్నాడు.ఈ వందమంది కథలను నేను ఎంతో సంతోషంగా రాశాను. ఎంతో పరవశిస్తూ రాశాను. ప్రతి కథలోని సంస్కారాన్ని ఎంతగానో స్వీకరిస్తూ రాశాను. ప్రతి రచయితా వదిలివెళ్లిన కథాస్థలిని ఎంతో కుతూహలంతో రీవిజిట్‌ చేశాను. ఇది నాకు పండగ. నిజంగా నేను అనుభవించిన పండగ’’ అని చెప్పిన ఖదీర్‌ మాటల్లో ప్రతి అక్షరమూ సత్యమేననిపిస్తుంది ఈ పుస్తకం చదివాక.

మా ఊరి అమ్మవారి గర్భగుడిలో నూనె దీపాల మసక వెలుతురే తప్ప కరెంటు దీపాలుండవు. అందుకని అమ్మ ముఖం స్పష్టంగా కనిపించడానికి పూజారి కర్పూర హారతినెత్తి అమ్మ విగ్రహం చుట్టూ తిప్పుతాడు. ఆ వెలుగులో జగద్ధాత్రి చిరునవ్వునూ, కరుణాదృష్టినీ, మెరిసే ముక్కెరనూ, కుంకుమబొట్టునూ, మంగళసూత్రాలనూ, తల్లిపాదాలనూ దర్శిస్తాం. మనసు నిండిపోతుంది. ఖదీరుబాబు మా ఊరి పూజారిలాగా అనిపించాడు నాకు. ఆయన ఎత్తిన కర్పూర హారతిలో తెలుగు కథా దేవత స్వరూపమంతా స్థూలంగా కనిపిస్తోంది. ఆమె పాదాల దగ్గర అతను పెట్టిన దేవగన్నేరు పువ్విది.
ఖదీరు నూరేళ్లుండాలి, తెలుగు కథ వెయ్యేళ్లకీ వెలగాలి.

పోలేరమ్మబండ కతలు

కొంత మంది పిల్లలు, హైస్కూలు పిల్లలు, ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న కాలేజీ పిల్లలు యీ కతలని చాలా ఇష్టంగా కూడబలుక్కుని మరీ చదువుతున్నారని పేరెంట్స్ ద్వారా తెలిసినప్పుడు నా కల్ళెమ్మటి నీళ్ళోచ్చినాయి. ఎక్కడ కావలి, ఎక్కడ పోలేరమ్మ బండ....ఎక్కడ శ్రీధరుగాడు, ఎక్కడ మురళీగాడు, ఎక్కడ మాలకొండలరావుగాడు, కదీరుగాడు....వీళ్ళంతా ఇవ్వాళ చాలా మందికి ఫ్రెండ్స్ అయినారు.
ఇంకా విచిత్రమేమంటే ఈ కతలు అయిపోయినాక ఒకాయన మా ఆఫీసుకి వచ్చి ఈ కతల్లోని నలుగురు ఫ్రెండ్సూ టెన్త్ తోటి ఆగిపోకుండా డిగ్రీలు చదివి ఉద్యోగాలు తెచ్చుకుని , పెళ్ళిళ్ళు చేసుకుని సెటిలయ్యేదాకా ఈ కతలు రాస్తావా చస్తావా అని కూర్చున్నాడు
అదీ ఈ కతల భాగ్యం.
ఈ భాగ్యం నాది కాదు, ఈ భోగమూ నాది కాదు.
ఇది బాల్యానిది.
ఈ బాల్యం ఎవరు రాసినా, ఎప్పుడు రాసినా ఆ భాగ్యమూ, భోగమూ వాళ్ళకీ దక్కుతాయని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను.
- మహమ్మద్ ఖదీర్ బాబు


ఫుప్పుజాన్ కథలు (పిల్లల జానపద సంపద)


ఇందులో మొత్తం 44 కథలు ఉన్నాయి

బఠాణిరాజుది బలే తమాషా             షర్ఫుద్దీన్
జింకమ్మాజింకమ్మా                      మిట్టూ రాజా
సెబ్బాష్ రాజుగారు                        కొంచెం అంటే ఎలా కుదురుతుంది
సుబుర్ బాషా                             భాయ్ ఖీర్
గుత్తి వంకాయ కూర                      ఖలీఫా గారికి ఒకటవ పాఠం
నిద్రనేది ఒకటి ఉంది కదా                 ఏడుగురు అన్నలకు ఒకే చెల్లెలు
అల్లాకె నామ్ పా ఖైరాత్ కర్              ఖలీఫా గారికి రెండవ పాఠం
బీ ఫిత్నీ                                     షారమ్మ
నక్కసాయెబు - నక్క బీబీ                చార్ ఖస్ రత్ కె ఇన్ సాన్
నక్టామాము                                దాల్ గోట్నీ దెబ్బ
ఆకలి - ఆపిల్ పండు                      ఉత్ రో ఉత్ రో సావల్ రాణి
ఫలాతున్ పిచుక కథ                      హసన్ హబ్బాల్
హమ్ న హలాల్ తుమ్ న హరామ్     నెత్తిమీద గట్టిగా మూడు మొట్టు
మూడు ఖర్చులు                           పరేస్తాన్ కా పరా
తైమూరు రాజు - చీమ                     తెలివి కతలు
యా బలఖ్ యా బాషా                    ముందు పనసకాయ ఇలా లేదు
ఎంత చేసుకుంటే అంత                     అమ్మ ఇంటి బూడిద
భర్రున ఎగిరిపోయిందోచ్                     ప్రవక్త చెప్పిన కథ
మనుషుల కథ పిల్లినే అడగాలి             కాన్ కరేలా
ఎక్కడి నుంచి రాకడ? ఎక్కడికి పోకడ?    రెండో పిట్ట
మఛిలీ బందర్ బాషా                          బిస్మిల్లా యిర్రహమా నిర్రహీమ్
ఎవరు ఫైల్వాను?                             జోమ్ పూర్ ఖాజీ


బాలీవుడ్ క్లాసిక్స్

సినీ వార్త (in http://pravasarajyam.com) విశ్లేషణ ...

1970-80 మధ్యకాలంలో హిందీలో వచ్చిన సినిమాల కథనాలు, వాటి తెరవెనుక కథలు, నిర్మాణంలో ఎదురైన సాధక బాధకాలు, ఉత్తమ చిత్రాలుగా ప్రజల గుండెల్లో నిలవడానికి గల కారణాల విశ్లేషణలతో... 50 బాలీవుడ్ ఉత్తమ చిత్రాలను పరిచయం చేస్తూ సాక్షి ఫ్యామిలీలో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన వ్యాసాల సంకలనం ‘బాలీవుడ్ క్లాసిక్స్’.

60వ దశకం నుండి 80 వ దశకం వరకూ హిందీ చిత్రసీమ నుండి వచ్చిన కొన్ని కళాత్మక చిత్రాలకు సంబంధించి రచయిత శ్రీ ఖదీర్‌బాబు, వారం వారం ఒక ప్రముఖ దినపత్రికలో రాసిన 50వ్యాసాలను `బాలీవుడ్ క్లాసిక్స్` పేరుతో సంకలనంగా ప్రచురించటం జరిగింది. సినీ ప్రేమికులు ఆ చిత్రాలలో కొన్నిటిని చూసివున్నా, రచయిత విశ్లేషణా చాతుర్యం వల్లే చదువుతున్నంత సేపు మళ్లీ ఒకసారి రచయిత దృక్కోణంలో ఆ సినిమా చూస్తున్నంత అనుభూతిని పొందుతారనే ఉద్దేశ్యంతో ఈ పుస్తక పరిచయానికి పూనుకున్నాను.

నాటి సినిమాలలో, ఆయా కాలపరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించే కథతో సహజపాత్రలతో పాటు చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకుడికి రసవత్తరంగా వుండటం కోసం తగుమోతాదులో కొద్దిపాటి మసాలా కూడా జోడించేవారు దర్శకనిర్మాతలు.. మరి నేటి సినిమాలో మసాలా అసలు కూరని డామినేట్ చేస్తూ అసలు కూర తక్కువైపోతుందన్నది విమర్శకుల వాదన. సినిమా అనేది వ్యాపారం. కలల్నీ,కళల్నీ అమ్ముకుని చేసే వ్యాపారం. కాలగమనంలో అన్ని వ్యాపారాల స్వభావస్వరూపాలు మారినట్లే సినిమా కూడా మారటం సహజమే.. మన చిన్నతనంలో మిఠాయిని పేపర్లో పొట్లం కట్టిచ్చేవారు… యిప్పుడు అందమైన అట్టపెట్టెల్లో యిస్తున్నా ఎందుకో చిన్నప్పటి పొట్లం మిఠాయే బాగుందనిపిస్తుంది. అంతమాత్రం చేత ప్యాకెట్లో వొద్దు.. పేపరులోనే కట్టివ్వమనం కదా.. టెక్నిక్ ప్యాకింగ్‌తో యిప్పుడొస్తున్న కోట్లాది రూపాయల సినిమాలకంటే ఆత్మవున్న నాటి సినిమాలు, నగలు లేకపోయినా అందంగా కనిపించే బాపూ బొమ్మాయిల్లా వుంటాయన్నది నిజం.. కానీ మారిన నేటి వ్యాపార సరళిలో థియేటర్ వరకూ వచ్చే సగటు ప్రేక్షకుడ్ని సంతృప్తి పరచి సొమ్ముచేసుకోవాల్సిన అగత్యం సినిమావారిదని అంగీకరించవలసిన నిజం.. అందుకే పాతని పొగడటం కొత్తని తెగడటం మాత్రమే పరమావధిగా భావించనవసరం లేదు. ఆ స్వర్ణయుగంలోని బంగారంతో నేడు సరికొత్త నగలు చేయటానికి ప్రయత్నిస్తే ఆధునిక స్వర్ణయుగం మళ్లీ సాక్ష్యాత్కారం కాకపోదు.

ఈ `బాలీవుడ్ క్లాసిక్స్` విషయానికొస్తే సంబంధిత చిత్రాల కథకథనాలను విశ్లేషిస్తూనే ఆ సినిమాల నిర్మాణం వెనుకవున్న కష్టనష్టాలను కూడా రచయిత తెలియజేయడంతో ఆ సినీ జీవుల పట్ల పాఠకులకు యింకా ఆరాధనా భావం ఎక్కువవుతుంది… స్క్రిప్ట్ తప్ప, ముహూర్తాలూ, టైటిల్ సెంటిమెంటూ, క్లాప్‌సెంటిమెంట్లూ, రిలీజ్‌డేట్ సెంటిమెంట్లూ అన్నీ జాగ్రత్తగా చూసుకుని ఫ్లాప్ తీస్తున్న మనవాళ్లు కొన్ని తెలుసుకోవాలి అంటూ, `షోలే` తొలిరోజు షూటింగ్ భారీ వర్షం వల్ల అసలు జరగనేలేదనీ, మరునాడు తొలిషాట్ తీసింది వితంతువు పాత్రపైన అనీ, ఎంత పెద్ద సినిమా అయినా మొదలు ఆధారపడవలసింది అక్షరం మీదే, తయారుకావలసింది పేపర్ మీదే అని చురకలు అంటించాడు రచయిత.

అలాగే `బాబీ` సినిమా గురించి రాస్తూ రాజ్‌కపూర్ తనెంతో ప్రేమించి తీసిన `మేరానామ్ జోకర్`ని ప్రేక్షకులు నిరాదరిస్తే, కసితో డబ్బొచ్చే సినిమా తియ్యాలనే పంతంతో `బాబీ` తీసి విజయం సాధించాడు.. ప్రతిభ కలిగినవాళ్లు పగబడితే చాలా కష్టం.. అని చెబుతూనే… ఏ ఉత్తమ వైద్యుడూ చేతులారా రోగికి విషం యివ్వడు. అందుకే కమర్షియల్ హంగులతో `బాబీ` తీసినా అందులోనూ `రాజ్ కపూర్` తన హృదయాన్ని చూపెట్టాడంటాడు ఖదీర్‌బాబు.

సాదాసీదా దర్శకుడైన `బ్రిజ్` తీసిన సూపర్ హిట్ “విక్టోరియా నెం.203“ గురించి చెబుతూ `ప్రేక్షకులు మెచ్చే మిఠాయి పొట్లాన్ని ఢిల్లీ మిఠాయివాలా మాత్రమే కట్టక్కర్లేదు.. వీధి చివర రంగయ్య అయినాచాలు` అనటం రచయిత చమత్కారం. సినీ ప్రేమికుల్ని అలరించే మరెన్నో విషయాలున్నాయి ఈ పుస్తకంలో…

“ఇలాంటి కథ నాకు తెలుసు అని ప్రేక్షకుడు అనుకునే సినిమాలు నేను తీయను… ఇలాంటి కథ జరిగితే బాగుంటుంది అనుకునే సినిమాలనే తీస్తాను.“ అని చెప్పిన మాస్‌ మసాలా దర్శకుడు `మన్‌మోహన్ దేశయ్` తన కెరీర్‌లో కోట్లుగడించినా మాస్‌పల్స్ తెలియడానికా అన్నట్లు జీవితాంతం ముంబాయ్‌లోని మిడిల్‌క్లాస్ బస్తీలోనే నివాసమున్నాడని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. తన ప్రతి సినిమాలోనూ హిందూ,ముస్లీం,క్రిస్టియన్ పాత్రలు పెట్టి వారి మధ్య బ్రదర్‌హుడ్ కోసం ప్రయత్నిచాడట.

తన కొడుకులా మరెవరూ పోలియో బారిన పడకూడదనే ఉద్దేశ్యంతో తన సినిమా ద్వారా ప్రేక్షకులకు వినోధాన్ని అందిస్తూనే `పోలియో`పట్ల ఎడ్యుకేట్ చెయ్యాలని భావించి తన బిడ్డ `మ్యాకీ`నే ప్రధాన పాత్రగా చేసి `కువారా బాప్` చిత్రాన్ని తీసిన `మొహమూద్` గురించి చదువుతుంటే మనసులో ఏదో మూల కలుక్కుమంటుంది.

ఆనాటి సామాజిక పరిస్థితులనే కథాంశాలుగా తీసుకుని చిత్రాలు నిర్మించి విజయవంతమైన మనోజ్‌కుమార్, దేవానంద్, హృషికేష్ ముఖర్జీ, బాసూ చటర్జీలవంటి ఫిల్మ్‌మేకర్స్ గురించి తెలుసుకున్నప్పుడు సమాజం పట్ల వారికున్న నిబద్ధత అర్థం అవుతుంది.

తారుమారయ్యాక పాత్రల స్వభావం మారి హీరో హీరోయిన్ల జీవితాలతో చెలగాటం ఆడటం అనే అనాదిగా వస్తున్న ఫార్ములాను ఒక్కొక్కరూ ఒక్కోలా తీశారు అంటూ కె.వి రెడ్డి ‘మాయాబజార్‌’ను, బాపూ ‘మంత్రిగారివియ్యంకుడి’నీ, నాసిర్ హుస్సేన్ `హమ్‌ కిసిసే కమ్‌ నహీ` చిత్రాలను రచయిత పోల్చినప్పుడు.. నిజమేకదా.. అన్ని కథాంశాలలోనూ పాయింట్ ఒకటే కదా అనిపిస్తుంది.

జంజీర్ గురించి రాసినవ్యాసంలొ “టైటానిక్ ” మునిగిపోయింది.. అయితే దానిని ఉత్తినే ముంచకుండా ప్రేమను జతచేశాడు దర్శకుడు. `యాదోంకి బారాత్`లొ పగ తీర్చుకోవడంవుంది. ఆయితే ఆ పగను అలాగే వుంచకుండా దానికి ప్రేమను, పాటను కలిపాడు దర్శకుడు.’జంజీర్’లో కూడా పగే వుంది. ఆయితే దానిని అలాగే చూపకుందా వర్తమాన పరిస్థితులను జతచేశాడు దర్శకుడు అంటూ సక్సెస్ ఫార్ములా కిటుకును వివరించాడు రచయిత. చెప్పే కధాశం ప్రేక్షకుడికి చేదు మాత్రలా ఘాటుగా వుండకుండా షుగర్‌కోటెడ్‌ పిల్‌లా వుండేలా అవసరమైన సరుకును కూడా కధలొ చేర్చాలనేది దీని సారాంశం . .

‘బావర్చీ’ చిత్రం గురించి చెబుతూ మన పని మనం ఎలాగూ చెసుకుంటూం .. ఎదుటివారి పని చేయడంలొ వుండే ఆనందం అనుభవిస్తే తప్ప అర్దంకాదు..తల్లితండ్రులు ,తోబుట్టువులు కొత్తగా రారు. మనసుకు నచ్చిన స్నేహితులు వెంట వెంటనే దొరకరు… మన బంధాలు పరిమితం.. అపురూపమైన ఈ మనుషులను, వారితో కలిసి పొందాల్సిన సంతోషాలను మిస్‌ కాకండి అని చెప్పడం ఎంతో బాగుంది.

ఎప్పుడూ గతం తాలూకు విషాదంలో, భవిష్యత్తు తాలూకు బెంగలో వుంటూ ఈ క్షణంలో వున్న ఆనందాల్ని, సౌందర్యాల్ని నిర్లక్ష్యంచేసి… చెప్పాపెట్టకుండా మృత్యువు ప్రత్యక్షం అయినప్పుడు.. అరె…! యింత కాలం ఎలా వృధా చేశాను అని తల బాదుకున్నా సమయం వెనక్కిరాదు అనే సత్యాన్ని ఆవిష్కరించిన `హ్నషికేష్ ముఖర్జీ` `ఆనంద్`ని గుర్తుచేసుకున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం తడుముకుంటాము. ప్రతి క్షణాన్నీ మనస్పూర్తిగా జీవిస్తూ సాటిమనుషులకు ప్రేమను పంచుతూ వారి నుండి ప్రేమను పొందడమే జీవితం… ఈ క్షణం పోతే మళ్లీ రాదు అని చెప్పే `ఆనంద్` లాంటి పాత్ర మళ్లీ వెండి తెరపైకి వొస్తుందా..?

మూగ,చెవుడు,గుడ్డి మనుషులు వారి మనసులతోనే కమ్యూనికేషన్ ఏర్పరచుకొని తమ మధ్య స్నేహబంధాన్ని సృష్టించుకుంటుంటే అన్నీ వున్న మనం మాత్రం మన భాషని, మాటని, ఎప్పుడూ శత్రువులను తయారుచేసుకోవడానికే ఉపయోగించుకుంటున్నాం అని చర్చించే `గుల్జార్` `కోషిష్` చిత్రంపై ఖదీర్‌బాబు విశ్లేషణ అద్భుతం. ఆ మాటకొస్తే అన్ని విశ్లేషణలూ వ్యాసాలూ హృదయాన్ని తాకుతాయి. ఎందుకంటే యిందులో ప్రస్తావించిన సినిమాలన్నీ హృదయమున్న సినిమాలే కాబట్టి. అందుకే వెంటనే పుస్తకంకొని చదవండి. ఆ కళాఖండాలను వీక్షించమని మీ మనసే మిమ్మల్ని తొందరపెడుతుంది.
అన్నిటికన్నా ఈ పుస్తకం వెనుక అట్టమీద వున్న నాలుగులైన్లు ఆకర్షించాయి నన్ను అవి.. “ సినిమాకు భాష అడ్డుగోడకాదు. అడ్డుగోడల మీద సినిమా వారధి కావాలన్నది ఆలోచన. నిజానికి ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే గొప్ప ప్రక్రియ సినిమా“.


మన్ చాహే గీత్

గాయం చేయనివాడు గాయకుడే కాదు మనల్ని వెంటాడి వేధించడం చేతకానిది ఒక పాటా కాదు అంటూ మొదలుపెట్టిన వెనుక పేజీవ్యాఖ్య (పబ్లిషరు చే) ఈ పుస్తకానికి అతికినట్టు సరిపోయింది.

“మన్ చాహే గీత్” ... మహమ్మద్ ఖదీర్ బాబు  వ్రాసిన హిందీ పాటలు-పరిచయాలు చాలా సరళంగాను, మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. సురయ్యా, షంషాద్ బేగం ,తలత్ మహమూద్, మన్నాడే నుండి రఫీ, లతా, కిశోర్ ల వరకు అందరి గాయకుల్ని, గొప్ప గొప్ప సంగీతదర్శకుల్ని పరిచయం చేసిన తీరు అద్భుతంగా వుంది. అంతటి గొప్ప కళాకారులకి కేవలం రెండేసి పేజీలు ఎలా సరిపోతాయన్న సందేహాన్ని పుస్తకంలోకి ప్రవేశించగానే పటాపంచలు చేసేశాడు ఖదీర్ బాబు. సంగీతం గురించి చాలా సూటిగా చెబుతూనే అందరి సంగీతకారుల జీవిత కోణాల్ని స్పృశించిన పద్ధతి చాలా బావుంది.

పాటల రికార్డింగు సందర్భాలలో తీసిన అలనాటి మేటి సంగీతకారుల ఫోటోలు గొప్ప అనుభూతినిస్తున్నాయి. అవే పాటలు ఈ పుస్తకం చదవకముండు ఒకరకమయిన ఆనందాన్ని ఇస్తే, చదివిన తరువాత  ఆయా సంగితకారులతో, గాయని గాయకులతో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టు అవే పాటలు మనకు బాగా తెలిసున్న వాళ్ళు మనకోసమే కంపోజ్ చేసినట్టు పాడినట్టు అనిపిస్తాయి. పరిచయ వ్యాసాలు ఇంత బావుండడం వల్ల సమయం తీసుకొని మళ్ళి ఆ పాత పాటల కలెక్షను బయటకు తీసి వింటున్నానంటే పుస్తకం ఎంత ప్రభావవంతంగా ఉందో  అర్ధం చేసుకోవచ్చు.

సంగీతప్రియులు తప్పక షెల్ఫు లో ఉంచుకోవాల్సిన పుస్తకం.
written by gksraja, gksraja.blogspot

న్యూ బాంబే  టైలర్స్

 

ఈ పుస్తకం లో మొత్తం 12 కథలు (న్యూ బాంబే టైలర్స్ , దావత్,జమీన్, దూద్ బఖష్, కింద నేల ఉంది, ఒక వంతు, రాత్రిపూట, ఢాఖన్, ఒక సాయంత్రం అదృష్టం, పెండెం సోడాసెంటర్, ఖాదర్ లేడు, గెట్ పబ్లిష్డ్ )  (కొన్ని కథలు సంక్షిప్తంగా)

న్యూ బాంబే  టైలర్స్: ఈ కధా సంపుటం లోని మొదటి కధ న్యూ బాంబే  టైలర్స్ . ఈ కధ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు. కావలి లోని పీరుభాయి అనే కుర్రాడు బాంబే వెళ్లి అక్కడి కొత్త ఫాషన్స్ నేర్చుకుని కావలి వచ్చి అక్కడి రైల్వే రోడ్ లో బాంబే టైలర్స్ అనే పేరుతో ఒక దర్జీ దుకాణం తెరిచి అక్కడి కాలేజ్ విద్యార్ధుల, పెద్ద రెడ్ల అభిమానం సంపాదించుకుంటాడు. పేరు, డబ్బు  సంపాదించుకుంటున్న తరుణంలో  పులిమీద పుట్రలా ఆ ఊరు చివర కొత్తగ కొన్ని రేడీమేడ్ దుస్తుల కర్మాగారాలొచ్చి స్థానిక దర్జీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం కలుగచేస్తాయి. దర్జీలు దుకాణాలు మూసివేసి ఈ రేడీ మేడ్   ఫాక్టరీలలో కూలీలుగా చేరిపోతుంటారు. మెల్లగా ఈ ప్రభావం బాంబే టేలర్స్ పై కూడా పడి తండ్రీ కొడుకులు రేడీ మేడ్ కర్మాగారంలో కూలీలుగా చేరటానికి వెళ్లినప్పుడు, వారి పేర్లకు బదులుగా కొన్ని అంకెలుతో వారిని పిలవాల్సొస్తుంది. అంతే కాదు; ముందే కత్తిరించిన కొన్ని బట్టలు ఇచ్చి, కుట్టి తీసుకు రమ్మంటే, పీరుభాయి అది అవమానంగా భావిస్తాడు. బలుసాకైనా తిని బ్రతుకుతా కాని ఈ పని నా వల్ల కాదు అని ఉద్యోగం నిరాకరిస్తాడు.  ప్రపంచీకరణ దుష్ఫలితాలను చక్కగా వివరిస్తుందీ కధ.

జమీన్: ఈ సంపుటి లోని జమీన్ కధకు 1999లో దాని కళాత్మక కాల్పనిక చిత్రణకై  కధ అవార్డ్ వచ్చింది. సంక్షిప్తంగా జమీన్ ఇతివృత్తం:  ఇది ఇద్దరు బాల్యమిత్రుల కధ.  కసాయి కొడుకు హుసేన్, మాలపల్లె లో నివసించే బ్రమ్మయ్య ల మధ్య అనుబంధం ఎక్కువే. చీరాల లో ఉండే హుసేన్‌కు తన స్వస్థలమైన కావలి లో చిన్న ఇల్లు కట్టుకోవాలని, అక్కడే కనుమూయాలని ప్రగాఢ కోరిక.  స్థలం లభ్యమయ్యిందన్న కబురు బ్రమ్మయ్య నుంచి అందగానే కావలికి పయనమైన హుసేన్ ఆ స్థలం తన మిత్రుడు బ్రమ్మయ్యదే అని తెలుసుకొని ఆనందభరితుడవుతాడు. అయితే బ్రమ్మయ్య కొడుకు రమణ ఆర్.ఎస్.ఎస్. పార్టీ లో చేరి ఆ సిద్ధాంతాలను ఒంటపట్టించుకొని, సాయిబు హుసేన్ కు స్థలం అమ్మకానికి తన తీవ్ర అసమ్మతిని తెలియపరుస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించటంతో, ఖిన్నుడయిన హుసేన్  చీకటిలోనే తన ఊరు చీరాలకు తిరుగు ప్రయాణం కట్తాడు, వికల హృదయంతో.

ఒక సాయంత్రపు అదృష్టం: ఈ కధను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో  కధ కంటే అనుభూతి ఎక్కువ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే కధానాయకుడు తన ఊహల్లో క్రియ కంటే ఎప్పుడూ ముందుండి, ప్రక్రుతి సహజమైన  అనుభూతులకు దూరమవుతూ, వేదనకు లోనవుతుటాడు. అయితే ఒక వర్షం కురిసిన సాయంకాలం, పూలమ్మి అమ్మే పూలబుట్టలలోంచి వచ్చే పూల పరిమళాళలకు పరవశుడై, తన భార్యకు అనూహ్యంగా సంతోషాన్ని కలిగించే, చిన్న చిన్న ఆశ్చర్యాలు కలిగించి ఆమెను సంతోషపెడ్తాడు.  రేపు లేదన్నట్లుగా, ఆ సాయంత్రం వారిరువురిదే అన్నట్లుగా,  ఆ రాత్రి అనుభవిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలా తెల్లవారింది. కధానాయకుడిలో  ఆశావాదం పెల్లుబికింది. అయినా రేపు మిధ్య, ఈ రోజే నిజం అన్నట్లుగా  తన కర్తవ్యానికుపక్రమిస్తాడు.

గెట్‌ పబ్లిష్‌డ్‌ : మొదటిసారి మహ్మమ్మద్‌ ఖదీర్‌ బాబు రచన “గెట్‌ పబ్లిష్‌డ్‌’! 36 పేజీల చిన్న పుస్తకం. ఏ పత్రికలోనూ రాకుండా, డైరెక్ట్‌ కతానికగా ప్రత్యేక బుక్‌లెట్‌గా వచ్చింది. ఇపుడు అదే కథ ఈ పుస్తకంలో చేర్చారు. చారిత్రక అవసరం అనదగిన ఈ “మాష్టర్‌ పీస్‌’ కథానికలో వస్తువుని ముందుగా తెలుసుకుందాం. షకీల్‌ ఒక బాధ్యతాయుతమైన పదవిలోని పాత్రికేయుడు. అతనొక రిపోర్ట్‌ తయారు చేస్తున్నాడు. ఆ రిపోర్టే ఈ కథానిక.

“గెట్‌ పబ్లిష్‌డ్‌’ లో (షకీల్‌ కాకుండా) మూడు పాత్రలు. ఒకటి ఏడేళ్ల ముష్టాక్‌. వాడు మసీదు దగ్గరికొచ్చేవారి చెప్పుల్ని భద్రపరిచి తిరిగి ఇచ్చేసే “”పని’’లో వున్నవాడు. “ముష్టాక్‌ నల్ల బంగారం. నల్ల ముత్యం. వాస్తవానికి వాణ్ణొక నల్లటి ముతకరబ్బరు బంతి అనాలి. చూడటానికి ముద్దుగా వుంటాడు. పట్టుకోవడానికి కండగా వుంటాడు’. “వాడి కళ్లల్లో కరెంటు ఉంటుంది. వొంట్లో తూనీగ ఎగురుతూ ఉంటుంది...’ వాడికి అమ్మా నాన్నా ప్రాణం. వారికి వీడు ఇంటిదీపం, కంటి వెలుగు. రెగ్యులర్‌గా మసీదుకు వచ్చీపోయే షకీల్‌కి -వీడొక ప్లెజంట్‌ స్మార్ట్‌ బాయ్‌. ముష్టాక్‌ తల్లి -ఫాతిమా -రెండోపాత్ర. “నేరేడు చెట్టు నీడలో, చుట్టూ చెప్పులు పెట్టుకుని, నల్లటి గువ్వలాగా...’ “ఆమె గొంతే ఆమె ఆకారం. ఆమె మాటే ఆమె వునికి...’ ఫాతిమా ఒక విలక్షణమైన ముస్లిం స్త్రీ. “మసీదులోని తెల్లటి గోడల మధ్య నల్లటి చారికలా కనిపిస్తూ ఉంటుందామె’ అంటాడు కథకుడు. ఇదీ వర్ణనాశిల్పం అంటే. పులుముడుకాదు. ఏకపదవాక్యంతో గుండె మీద ఆర్తినీ, అంత: కరణనీ గీరగలగాలి కథకుడు! ఆ తర్వాత ఆమె చుడీబజార్‌లో యాచిస్తూనూ కనిపిస్తూ ఉంటుందిట! ఇక, ఈమె భర్త- నయాబ్‌-మూడోపాత్ర. అతను అత్తర్‌ నయాబ్‌-పేరుకు. ఇతని కథ కొంచెం పెద్దదే. ఆటో డ్రైవర్‌గా, సెవెన్‌సీటర్‌ డ్రైవర్‌గా చేశాడు. ఏదీ అచ్చిరాలేదు. సంపాదనలేదు.

ప్రపంచంలో అక్కడక్కడా, అక్కడా ఇక్కడా -ఉగ్రవాదదాడులు, ఎవరు ఎవర్ని “టార్గెట్‌’ చేస్తారో, ఎందుకు చేస్తారో తెలీదు. విసిరిన పంజాదెబ్బకు ఎందరో మృతులు, ఎందరో క్షతగాత్రులు. అయితే పంజావిసిరిందెవరు? తెలీదు. అదో పెద్ద యక్షప్రశ్న. హైదరాబాద్‌లోనూ దుర్ఘటనలు. ఒక దురదృష్టకరరాత్రి.. బాగా పొద్దుపోయిన తర్వాత అన్నం ముందు కూర్చున్న నయాబ్‌ని లాగి, కొట్టి, ఫాతిమానీ నెట్టేసి గాయపరచి, ముష్టాక్‌కీ నాలుగు తగలనిచ్చి -నయాబ్‌ని “వాళ్లు’ లాక్కుపోయారు. ఆ తర్వాత జరగాల్సినదంతా జరిగింది. అదొక “ట్రీట్‌మెంట్‌ కథ’. ఇక్కడ ఫాతిమాని ఎవరు ఊరడించగలరు? ముష్టాక్‌ వొళ్లు తెలీని జ్వరంలో కాలిపోతున్నాడు. షకీల్‌ లాంటివాళ్లు అదీ ఇదీ చేద్దామని ముందుకొస్తే ఆమె తరస్కరిస్తుంది. ఉన్న వాళ్లిద్దరూ జీవచ్ఛవాలైనారు. దిగులు బండలయ్యారు. ఆ “ట్రామా’ అక్షరాలకి ఒదుగుతుందా!? చివరికి పదహారు రోజుల తర్వాత నయాబ్‌ని ఎవరో ఇంటి ముందు పడేసి పోయారు. కావడమే “మూలుగు’ వచ్చింది. బతికి వుండీ ఎందుకూ పనికిరాని ఒక మూటవచ్చింది. మీకూ నాకూ -నయాబ్‌ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి -చాలా “బతుకు’ చిత్రాలు దోహదం చేస్తాయి. కళ్లకు కడతాయి. “మళ్లీ నవంబర్‌ 26 వచ్చింది’! ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలీదు! అవును. ఇదే కథ! ముగ్గురు అమాయకుల ఛిద్రజీవన విషాదకావ్యం!

నయాబ్‌ కుటుంబం పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్‌ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్‌ పబ్లిష్‌డ్‌’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.


Comments

Post New Comment


M.Ganesh Kumar 30th Dec 2013 00:53:AM

Dear all, I feel pity for myself as I am unable to get the books dargamitta kathalu and polerammabanda kathalu penned by Mohammed Khadeer Babu for I cannot add them to my library. If you have copies, please send them to me. I will pay for it, whatever the cost may be. I give my address here. M.Ganesh Kumar Assistant Professor in English Wellfare Institute of Science, Technology & Management Pinagadi, Near Rampuram Pendurthi VISAKHAPATNAM - 531 173.


sanjeevreddy@yahoo.com 22nd May 2013 02:24:AM

Very good introduction of Khadeer babu