పాఠం 58/100..రామా చంద్రమౌళి

రామా చంద్రమౌళి వ్రాసిన పాఠం58/100...చదివిన తరువాత ఒక్క నిముషం మనస్సు స్థబ్దుగా అయిపోతుంది... ఇది కథే కదా అని అనిపించదు..కన్నుల ముందు జరిగే నిజమైన స్వప్నంలా గుండె పొరలని కదిలిస్తుంది...కథలో ఏకాంబరం  జీవితమంతా వెన్నంటి ఉంటాడేమో అని అనిపించకమానదు.. మనసు ఇష్టపడే జీవితం ఇంకోలా కూడా జీవించవచ్చు అని కలలోనైనా తలపులా రాక మానదు..

 

పదిలంగా దాచుకున్న చిన్ననాటి పాట పుస్తకం... ముక్క
వాసన.. జేగురు రంగు కాగితాలు....చక చకా పేజీలు
తిరగేసి...ఎప్పటిదో...పాత నెమలీక...దశాబ్దాల నాటిది.


పాత పుస్తకం.. పాత అక్షరాలు.. పాత పుటలు.. పాత జీవితం...వెరసి..చదువు వాసన...జ్ఞాపకాలు చినుకుల్లా కురుస్తున్నాయి.
కళ్ళు మూసుకున్నాను...లోపల ఏదో నిశ్శబ్ద బీభత్సం ..
ఏకాంబరం చచ్చిపోయాడా..?
ఏకాంబరం కూడా చచ్చిపోతాడా.. 'బతకడం..ఒక కలాపం..మరణించడం ఒక నిష్క్రమణ..చిగురు పోటమరిస్తుంది..ఉండీ ఉండీ..ఎండి రాలి ఆకు రాలి.. ఆకు అంతరిస్తుంది..మనిషి కూడా అంతే...' అన్నాడొకసారి ఏకాంబరం.. ఆ రోజు ఏకాంబరం బజార్లో అలా రోడ్డుపై నిరామయంగా, మౌనంగా, తలవంచుకుని నడచివెళ్తూ తారసపడ్డాడు. తను కార్లో వెళ్తూ.
ఎందుకో చటుక్కున అప్రయత్నంగానే కారాపి..
'బాగున్నావా ఏకాంబరం' అన్నాడు తను.
సమాధానంగా.ఒట్టి చిర్నవ్వు. ముఖం నిండా ప్రశాంతత, కళ్ళనిండా జిగేల్ మనే కాంతి..ఉట్టిపడే పసితనం.
అప్పటికే ఏకాంబరం ఎగ్జిక్యూటివ్  ఇంజనీర్..పెద్ద ఉద్యోగం. పెద్ద హోదా..సంపాదించదల్చుకుంటే పిచ్చిపిచ్చిగా కట్టలు కట్టలు లెక్క పెట్టుకునేందుకే వెళ్ళు నొప్పి పెట్టేంత డబ్బు సంపాదించగల కీలకమైన స్థానం ఏకాంబరానిది.
కానీ ఏకాంబరం ఋషి..అతనికున్నది మూడే మూడు గదులున్న చిన్న ఆర్ సిసి ఇల్లు. చుట్టూ ఖాళీస్థలం. దాన్నిండా పూలమొక్కలు.. చెట్లు. పచ్చగా గడ్డి..పక్షులు ..పావురాలు..పిచ్చుకలు.. ఇంటి లోపలా..బయటా ఎప్పుడూ ఎడతెగని వసంతం. రెడ్డి కాలనీలో ..ఎక్కడ్నుంచో కొన్ని పూలగుత్తులను పెరుక్కువచ్చి ఇక్కడ కుప్పపోసినట్టు.. ఏకాంబరం ఇల్లు ఒక స్వప్నశకలం.. అసలు డబ్బు వాసనే లేని, కేవలం మనిషి హృదయ పరిమళం మాత్రమే పరివ్యాపించిన ఒక జీవావరణం..ఎలా ఆవిధంగా బతగ్గలిగాడు ఏకాంబర.. మొత్తం జీవిత మంతా ..నిరాడంబరంగా..నిబద్దంగా..నిర్వ్యాపారంగా?
ఎందుకో దుఃఖం లోలోపల్నుండి పొంది..కళ్ళనిండా నీళ్ళు..
ఎదుట ఏమున్నదో కనిపించట్లేదు..అడ్డుగా కన్నీటి తెర.
"ఏ లేవ్ సాబ్" అని ఒక మాట.
ఎదురుగా..ఎర్రని గులాబీల దండను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి అందిస్తున్నాడు మస్తాన్.
ఏకాంబరం.. పార్దివ శరీరంపై ఉంచి శ్రద్దాంజలి ఘటించడానికి...
ఎంత బాగుందో..ఎర్రని గులాబిదండ..సువాసనతో, హుందాగా..గంభీరంగా..అందంగా..
'మౌళీ..అదంతే..ఎవరిడేది ప్రాప్తమో..అంతే లభిస్తుంది..చేట్టుకోమ్మపై వాలిన పక్షిలా మనిషి అలా అందంగా జీవించి..ఆకాశంలోకి ఎగిరిపోవడమే..అంతిమంగా చేట్టుకోమ్మకూ, ఆకాశానికీ పక్షికీ ఉన్న సంబంధబాంధవ్యం..ఒక చిత్రమైన ప్రశ్న. అర్ధం కావు మౌళీ..నిజానికి తనకు అన్నీ అర్ధమౌతున్నాయని భావిస్తున్న మనిషికి వాస్తవంగా ఏమి అర్ధం కాలేదు..చెప్పు..ఈ గాలి అర్ధమైందా..ఆకాశం అర్ధమైనడా..నవ్వు అర్ధమైందా..కన్నీళ్లు అర్ధంయ్యాయా..దుఃఖం అర్ధమైందా.'
ఎక్కడనుండో.. ఆకాసంలో నుండి  ఏకాంబరం మాట్లాడ్తున్నట్టు..
కన్నీళ్లు పొంగి పొంగి,
పూలదండను తీసుకుని..మస్తాన్ కు  రెండు వంద రూపాయల కాగితాలనందించి..
ఆకాశం ఉరుముతూనే ఉండి..వేసవిలో వర్షాకాలంవలె
ఉదయం... ఏడుగంటలే  ..రోడ్లన్నీ..పల్చగా.
చల్లగా గాలి..అమృత స్పర్శ.
ఏకాంబరం తనకు మొట్టమొదటిసారి పరిచయమైనదెప్పుడు...?
ఖైరతాబాద్.. ఇన్స్టిట్యూట్  ఆఫ్ ఇంజనీర్స్..జూన్ చివరి వారం. ఎ ఎమ్ ఐ ఎ. సెక్షన్ ఎ.. పరీక్షలు..స్ట్రెంత్ ఆఫ్ మెటిరియల్స్ పరీక్ష. ఆరుగురం మిత్రులం..రాత్రంతా హోటల్ ద్వారకా రూంలో కంబైన్డ్ స్టడీ చేసి.,ఫార్ములాలు, గెస్ ప్రశ్నలు ఒకర్నొకరం అడుక్కుని.. యుద్దానికి వెళ్ళే సైనికుల్లా సంసిద్దులమై..అందరం పరీక్ష హాల్లోకి ప్రవేశించి, ప్రశ్నాపత్రం అందుకోగానే.. ఆశ్చర్యం ..దాదాపు అన్నీ తాము ఊహించిన ప్రశ్నలే. చేసిన లెక్కలే.
తను, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్,మల్లేశం,ఏకాంబరం..ముఖాల్లోకి చూశాడొకసారి..అందరిలోనూ పొంగిపొర్లే ఆనందం. యిక విజ్రుభించి పేపర్ ను పూర్తిగా సాధించి వందకు వంద  మార్కులు సంపాదించాలని ఉత్సాహం. తలలు వంచి,సైడ్ రూల్,లాంగ్ బుక్స్, కంపాస్ బాక్స్ అన్నీ సిద్దం చేసుకుని  జవాబులు రాయడంలో మున్దిగిపోయాం.
మధ్య మధ్య..ఒక లేక్కచేయగానే తలెత్తి మిత్రుల వైపు చూస్తే, అందరూ దీక్షగా ప్రశ్నలతో కుస్తీ పడుతున్నట్లు..ఎవరిలోకంలో వాళ్ళు..ఏకాంబరం కూడా తలవంచి సీరియస్ గా రాస్తూనే ఉన్నాడు.
రెండు గంటలు టైం గడిచింది. ఇంకా ఇంకా గంట. వందకు దాదాపు డెబ్బయ్యయిదు మార్కుల లెక్కలు చేశాన్నేను. ఎంతో తృప్తిగా ఆనందంగా ఉండి..అన్నీ చదువుకున్న ప్రశ్నలే.
యాదృచ్చికంగా.. నా చూపులు నా కుడివైపు ఉండవలసిన ఏకాంబరం డెస్క్ దిక్కుమళ్ళాయి.
ఏకాంబరం లేడు.. అప్పటికే పేపర్ పూర్తిచేసి ఇచ్చి వెళ్ళిపోయాడు బయటికి.
'ఎందుకు వెళ్ళి పోయాదబ్బా..ఆతను కూడా అన్నీ ప్రశ్నలూ చేయగలదు. రాత్రి వాటి తాలూకు ఎన్నో ఫార్ములాలను తనే అతన్ని అడిగి అప్పజేప్పించుకున్నాడు.. మరీ...'
'ప్చ్..ఏమో..ఇప్పుడవన్నీ ఆలోచిందే టైం లేదు.. కమాన్ కమాన్' మళ్ళీ నా పేపర్లో మునిగిపోయాను.
మరో గంట గడిచి.. జవాబు పత్రాన్ని సంతృప్తిగా చెక్ చేసుకుని..హాల్ టికెట్ నెంబర్ సరి చూసుకుని..ఎనిమిది ఎడిషనల్ షీట్స్ ను భద్రంగా దారంతో కట్టి..విజయోత్సాహంతో మిత్రులతో జవాబులను క్రాస్ చెక్ చేసుకోవాలనే ఉత్కంఠతో బయటకి నడిచి..
బయటకి రాగానే..ఎదురుగా వేపచెట్టు కింద నిలబడి ఏకాంబరం..
ప్రశాంతంగా..నిరామయంగా..నవ్వుతూ.
"ఏందీ, అన్నీ మనం అనుకున్నా ప్రశ్నలే వచ్చినాయి కదా, వందకు వంద మార్కులు తెచ్చుకోవచ్చు, నువ్వేంది గంట ముందే బయటికోచ్చినౌ " అన్నాన్నేను.
అదే ప్రశాంతత తో అన్నాడు ఏకాంబరం. 'వందకు వంద మార్కులు మనకేండుకుబై ..యాభైకి పాస్ కదా..యాభై ఇదాస్తాయ్ చాలు...అవసరానికంటే ఎక్కువ మనకెందుకు'.
చటుక్కున..షాక్ తిన్నట్టు చూసాను ఏకాంబరం ముఖంలోకి..ఏమిటతని తత్త్వం అన్నట్టు.
అదే నవ్వు.. ప్రశాంతంగా.. యోగివలె. కళ్ళనిండా కాంతి.
ఆ క్షణాన ఇన్నాళ్ళుగా అర్ధం కాని జీవితమేదో కొత్తగా అర్ధమౌతున్నట్టు, జీవితాన్ని కొత్తకోణంలో కొత్తదృష్టితో చూడవచ్చా అన్న జిజ్ఞాస ఏదో హృదయంలో పొటమరిస్తునట్టు...
బకెట్ లోని నీళ్ళలో ఎవరో చేయిపెట్టి లొడపెడ్తున్నట్టు,
ఏకాంబరం ముఖం లోకి అలా..అవాక్కయి..అవ్యక్తంగా చూసానా క్షణం,
తర్వాతర్వాత ..అందరమూ..ఎ.ఎమ్.ఐ.ఎ పూర్తిచేసుకుని జీవితంలో ఎక్కడివాళ్ళమక్కడ స్థిరపడడం మొదలై..
ఇంజనీరింగ్ కాలేజిలో డెమాన్ స్ట్రెటర్ గా ఉన్న నేను లెక్చరర్.. ఇర్రిగేషన్ డిపార్ట్మెంట్ లొ సూపర్వైజర్ గా ఉన్న ఏకాంబరం అసిస్టెంట్ ఇంజనీర్ అయ్యి, పిల్లలు.. కిరాయి కొంపల్లో ఉంటూ స్వంత ఇల్లు నిర్మించుకునే దిశలో ఎదుగుతూ...అప్పుడప్పుడు కలుసుకుంటూ, పలకరించుకుంటూ..
ఒకరోజు కలిసాడు ఏకాంబరం..అకస్మాత్తుగా హనుమకొండ చౌరస్తాలో..జనవరి నెల..గాఢమైన శీతాకాలం.. బాగా చలిగా ఉన్నవేళ.
'మౌలీ..మొన్ననే కొత్తగా ఇల్లు కట్టుకున్నాం.. నువ్వొచ్చి ఓ కప్పు టీ తాగిపోదువుగాని దా...' అని ఆహ్వానించాడు ఏకాంబరం.. అక్కడికి దగ్గరలోనే..రెడ్డికాలనీలో ఉందట ఇల్లు.. అతనిపై నున్న గౌరవపూర్వకమైన ఆత్మీయత నన్నతని ఇంటికి వెళ్లేందుకు ఒప్పించింది. నడిచి వెళ్లాం మెల్లగా.మూడే గదులు ఇల్లు. రెండువందల అరవైఆరు గజాల ప్లాటు. నడుమ ఇల్లు చుట్టూ అప్పుడప్పుడే నాటితే ఏనుకుంటున్న మొక్కలు,చెట్లు. పెద్దగా ఇండ్లు లేవు. అక్కడొక్కటి అక్కడొక్కటి.
భార్యను పరిచయం చేసాడు.. 'లీల' అని.
ఆమె నవ్వింది..పూవ్వువలె, ఆమె కూడా ప్రశాంతంగా ఉంది అతని వలెనే. ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారా అన్నట్టు జంట.
ఇద్దరూ ఆ మూడు గదుల ఇంటిని ఆప్యాయంగా తిప్పి చూపించి..'ఎలా ఉండన్నయా' అందామె.'బాగుందమ్మా..కాని మరీ మూడు గదులే..' అని నేను అంటుండగానే  ఏకాంబరమన్నాడు.
'అంతకంటే ఎక్కువ గదులున్న పెద్ద ఇల్లు మనకెండుకుమరి' అని
చటుక్కున తలెత్తి ఏకాంబరం వైపు, లీల వైపు చూసాను ఆశ్చర్యంగా.
"అవును గదా అన్నగారూ..ఎందుకు మరీ" అందామె కూడా.
ఆశ్చర్యపడుతూ వాళ్ళనలా చూస్తుండగానే.. ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చింది. ఆరేడేళ్ళు ఉంటాయేమో... రెండు జడలు, తెల్లగా బొద్దుగా అప్పుడే విచ్చుకున్న నందివర్ధనం పువ్వులా వస్తూవస్తూనే 'నమస్తే అంకుల్' అంది.
"ఇది మా అమ్మాయి భారతి" అంది లీల.
"ఓ.. వెరి నైస్.." అని దగ్గరకు తీసుకున్నాను. అది దొడాలపై కూర్చుని ఒదిగిపోయింది.
అప్పటికే నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగ, ఒక ఆడ.
"ఇది కాక ఇంకా పిల్లలు" అని అనబోతుండగా..
"ఇదొక్కటే..యిక పిల్లలు కాకుండా ఆపరేషన్.."అన్నాడు.. ఏకాంబరం
అయ్యో..ఎందుకిలా..ఇంకో.." అని అనబోడుండగా...'ఇంతకంటే ఎక్కువ మంది పిల్లలెందుకు మౌలీ..అసలే ఈ దేశం అధిక జనాభాతో సతమతమైపోతోంది.
ఏమిటితను..ఇతనికి తగ్గట్టుగా ఈయన భార్య.. చిత్రమైన దంపతులు.. పూర్తిగా ఏకాభిప్రాయం ఇద్దరిదీ ఆలోచనలు, ఆచరణలు వ్యక్తిత్వాలు, తత్వాలు.. అన్నీ ఒకేరీతిగా.. అసలు వెళ్ళు ఎవరికివాళ్ళు ఇదారా..లేక ఇద్దరూ కలిసి ఒక్కరేనా.

*********
తర్వాత.. ఏకాంబరం గురించి ఎందుకో ఒకరకమైన ఆసక్తి పెరిగింది. అతన్ని ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాలనిపించింది. మెల్ల మెల్లగా అతని గురించి తెలుసుకోవడం ప్రారంభించాను.
మొదట్లో సైకిల్ పై ఆఫీసుకు వెళ్ళేవాడు. ఈ మధ్యనే ఒక స్కూటర్ కొన్నాడు. ఎప్పుడు చూసినా తెల్లని డ్రెస్ వేసుకుంటాడు.. కడిగిన ముత్యంలా కనిపిస్తాడు. మూడు నాలుగు జతల కంటే ఎక్కువ బట్టలున్నట్లులేవు. ఒంటిపై ఉంగరం లాంటి కనీస ఆభరణాలు కూడా ఉండవు. ఆఫీసులో.. ప్రతిరోజూ మొట్టమొదట ఆఫీసుకు వచ్చి, అందరూ ఇళ్ళకు వెళ్ళిపోయినా తర్వాత వెళ్ళిపోయే వ్యక్తిగా పేరుంది. క్రమశిక్షణకు,నీతినియమాలకు, అద్బ్తమైన పనిసామర్ధ్యానికి, పెట్టింది పేరు. ప్రభుత్వ రూల్స్, ప్రోవిజన్స్ అన్నీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి.. అన్నిటినీ మించి అంకిత భావంతో ఉద్యోగం చేసే మనిషిగా ఏకాంబరం గొప్ప పేరూ, గుర్తింపూ ఉన్నాయి. అందువల్ల అందరూ ఏకాంబరమంటే భయపడ్తూ గౌరవిస్తారు.

మనుషుల్లో ఎదుటి మనిషంటే మరో మనిషికి ఏర్పడే భయానికి కారణాలు సాదారణంగా అధికారం, డబ్బు, ఆధిపత్యం, అనివార్యత, దౌర్జన్యం,దుర్మార్గం..వంటివే ఉంటాయి. కాని మనిషిలో మూర్తీభవించి ఉండే మంచితనం, వ్యక్తిత్వం వల్ల కూడా ఎదుటివాళ్ళు గౌరవపూర్వకమైన భయభాక్తులను ప్రదర్శిస్తారని ఏకాంబరాన్ని తెలుసుకున్న తర్వాత తెలిసింది.

ఒకరోజు ఓ దినపత్రికలో ఒక వార్త కనిపించింది. 'రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకోనున్న ఇంజనీర్ ఏకాంబరం' అని, వివరాల్లోకి తొంగి చూసాను. 'తెలంగాణలో లిప్ట్ ఇరిగేషన్ మెళకువలు - నీటిపారుదల' అనే అద్బ్తమైన గ్రంథాన్ని రాసి ఎందరో జలవనరుల నిపుణుల ప్రశంసలనందుకున్న ఏకాంబరానికి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సిఫార్స్ పై పురస్కారం లభిస్తుంది. ఆ వార్తలోపలే ఏకాంబరం రాసిన ఇతర ఇరిగేషన్ పుస్తకాలు, అతని అత్యాధునికమైన పరిశోధనలు, అధ్యయనాలు, ప్రచురించిన పత్రాల వివరాలు.. అన్నీ విపులంగా ఉటంకించారు. మంచుపోర కప్పిన మేలిముత్యం లాంటి ఏకాంబరం అంతర్గత ప్రతిభ అప్పుడు నాకు అర్ధమైంది.

'గాంధీ మన భారతదేశ ప్రజలకు ఒక మహోన్నతమైన వారసత్వ వైభవాన్ని అందించి వెళ్ళాడు సార్... అది మనిషి నిరాడంబరంగా జీవిస్తూ, అవసరానికి మించిన దేన్నయినా త్యజించి జీవిస్తూ ప్రకృతే సూత్రాలను పాటించి పరమానందంగా బ్రతకమని చెప్పి, బ్రతికి చూపించిన ఒక మహోన్నత సంస్కృతి.. మనందరం భారతీయులమైనందుకు గర్వించాలి' అన్నాడొకసారి..ఎక్కడో మార్నింగ్ వాక్ లో రోడ్డుపక్కనున్న బండిమీద చాయ్ తాగుతూ నాతో.. అనుకోకుండా కలిసినపుడు.

యిక అప్పటినుండి.. ఏకాంబరం దగ్గరకు తరచుగా పోతూండడం ఒక అభిరుచిగా రాయారైంది. అతన్ని చూస్తుంటే.. మనిషి ఎంత గొప్పగా, అద్బుతంగా అర్ధవంతంగా జీవించవచ్చో తెలిసేది. చిన్న గీత ప్రక్క పెద్దగీత, చీకటి ప్రక్కన వెలుతురూ, లోయప్రక్కనే శిఖరం.. వలె ఏకాంబరం ప్రక్కన నాకు నేను ఎంతో చిన్నగా సకల మానవ బలహీనతలకు లోనై అలా బ్రతుకును గోర్రెలవలె, సందులలో పందుల్లా బ్రతికేస్తున్న అతి సామాన్య అర్భకునిలా తోచేది. ఈ బంగళాలు, కార్లు, బ్యాంకు బాలెన్స్ .. అన్నీ ఒత్తి కాకి బంగారపు భ్రాంతిమయ సంపదలుగా అనిపించేవి.
లోపల ఏదో వెలితి.. ఏదో బోలుతనం.. ఏదో ఆత్మజ్వలనం.. నాకు నచ్చని జీవితాన్ని నేను జీవిస్తున్నాననే నిప్పులా దహించే ఏదో అపరాధ భావన.. గుండెనిండా చెదలు..
చెదలు బయటికి కనపడకుండా లోలోపలే తినేస్తుంది.
దేన్నీ....? దేన్నయినా...
ఏకాంబరం శవం...ఆ మూడు గదుల ఇంటి వాకిట్లోని అరుగుపై పడుకోబెట్టబడి ఉంది. ఉదయమే.. ఇంకా చాలామంది రాలేదు. పది  పదిహేను మంది ఉన్నారు. కుటుంబ సభులు, ఆఫీస్ లోని అతి సన్నిహితులు.. లీల.. ప్రక్కనే బిడ్డ భారతి.
భారతి పెద్దదైంది ..పెళ్ళీ .. భర్తా..
లీల ముఖంలో వయస్సు పైపడ్తున్న చాయలు..అక్కడక్కడా తెల్లని వెంట్రుకల పాయలు.
ఏకాంబరానికి.. ఏభై ఎనిమిదేళ్ళు.. ఇంకో రెండు నెలల్లో రిటైర్మెంట్.
విషాదం.. దుఃఖం... నిశ్శబ్దం..వాతావరణమంతా గంభీరంగా ఉంది.
పూలదండున్న ప్లాస్టిక్ కవర్ ను తీసుకుని.. అడుగులో అడుగు వేసుకుంటూ..
ఏకాంబరం.. చనిపోయినట్టు లేదు. ప్రశాంతంగా నిద్రిస్తున్నట్టున్నాడు. నవ్వు కూడా ఉంది పెదవులపై...ఏదో అదృశ్య సజీవరశ్మి ఆ ప్రాంతాన్నంతా ఆవరించి ఉన్నట్టనిపిస్తోంది.
చేతిలోని ఎర్రని గులాబీదండను..వంగి .. ఏకాంబరం పార్ధివ శరీరంపై నెమ్మదిగా ఉంచి..తలవంచుకుని ప్రకంపిస్తున్న హృదయంతో నిలబడి..
లోలోపల్నుంది  దుఃఖం ఎందుకో ఉప్పెనలా పెల్లుబికి వచ్చింది. ఎక్కేక్కిపడి ఏడుపు..ఆశ్చర్యం నాలో కూడా యింత గాఢమైన
దుఃఖోద్విగ్నత  ఉందా.
కన్నీటి పోరల్లోనుంది లీల కనబడ్తోంది .. లీలగా ,, మూర్తీభవించిన దుఃఖమై.
"వందమార్కులేందుకు మౌలీ..యాభై చాలు కదా...ఎన్నో గదుల ఇల్లెందుకు...మూడు గదుల ముచ్చటైన ఇల్లు చాలు..లక్షలకోట్ల ఈ అవినీతి సంపాదనేందుకు..వస్తున్న ఈ జీతం ఈ జీవితం.. చాలుగదా అని ఎప్పుడూ చెప్పేవీడు.. వందేళ్ళేదుకు...యాభై ఎనిమిదేళ్ళు బతుకుచాలుగదా...అని...సంతృప్తుడై వెళ్ళిపోయాడమ్మా  ..మనందర్నీ విడిచి..."
దుఃఖం మాటల్ని మింగేస్తుంది...అంతా మౌనం...నిశ్శబ్దం....
ఏది శాశ్వత, మేదశాశ్వతమో మహార్హ్సీ... ఓ మహాత్మా....

*****

కొన్ని కథలూ మెదడుకు పదును పెడతాయి..కొన్ని కథలూ మనసుకుపదును  పెడతాయి..మనసుకి హత్తుకునే మరి కొన్ని కథలూ ఇవి...రామా చంద్రమౌళి వ్రాసిన సాధారణం లాంటి కథ అరుణ పప్పు కథ కూడా..

 


Comments

Post New Comment


buchi reddy gangula 27th Apr 2013 22:44:PM

excellent story